వెన్నెముక దారుఢ్యానికి...

మనలో కొందరికి కిందికి వంగాలన్నా.. ఆఫీసులో కంప్యూటర్‌ ముందు గంటల తరబడి పనిచేయాలన్నా నడుంనొప్పి వేధిస్తుంటుంది. ఈ అసౌకర్యం నుంచి బయటపడేందుకు చక్రాసనాన్ని ప్రయత్నించండి.

Published : 11 Feb 2023 00:12 IST

మనలో కొందరికి కిందికి వంగాలన్నా.. ఆఫీసులో కంప్యూటర్‌ ముందు గంటల తరబడి పనిచేయాలన్నా నడుంనొప్పి వేధిస్తుంటుంది. ఈ అసౌకర్యం నుంచి బయటపడేందుకు చక్రాసనాన్ని ప్రయత్నించండి. దీని వల్ల ఇతరత్రా లాభాలూ ఉన్నాయి. ఇంకెందుకాలస్యం.. వెంటనే మొదలుపెట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.

ఇలా చేయాలి... ముందుగా వెల్లకిలా పడుకొని రెండు కాళ్లనూ మడవాలి. రెండు అరచేతులను భుజాల దగ్గర్నుంచి చెవుల పక్కగా ఆనించి ఉంచాలి. చేతుల మీద బరువు వేస్తూ నడుమును పైకి లేపాలి. కానీ ఒక్కసారిగా కాకుండా మెల్లమెల్లగా విల్లులా వంచాలి. దీన్ని హ్యాండ్‌ బ్యాలెన్సింగ్‌ అంటారు. చేతుల మీద శరీరాన్ని నిలపగలుగుతాం అనుకున్నప్పుడే దీన్ని చేయడానికి సిద్ధం కావాలి. ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్లూ, చేతుల మీద బరువు సమంగా ఉండేట్లు చూడాలి. ఈ భంగిమలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి.. ఆనక నెమ్మదిగా చేతుల మీద బరువు మోపుతూ నడుము భాగాన్ని కిందికి తీసుకురావాలి. ఒకేసారి లేపడానికి లేదా దించడానికి ప్రయత్నిస్తే మాత్రం మేలు కంటే కీడే ఎక్కువని మర్చిపోవద్దు.

ఇవీ ప్రయోజనాలు...

చక్రాసనం చేయడం వల్ల వెన్నెముకను వ్యతిరేక దిశలో వంచగలుగుతాం. అందువల్ల వెన్ను గట్టిపడుతుంది. నడుంనొప్పి రాదు.

పొట్ట దగ్గరున్న కండరాలు బలోపేతమవుతాయి. అక్కడ పేరుకున్న కొవ్వు తగ్గుతుంది.

పొత్తి కడుపు నుంచి ఛాతీ వరకూ శరీరం దృఢంగా తయారవుతుంది. రక్త సరఫరా సవ్యంగా సాగుతుంది.

జీర్ణాశయంలో తలెత్తే సమస్యలకు నివారణగా పనిచేస్తుంది.

మణిపూరక చక్ర, స్వాధిష్ఠాన చక్ర ఉత్తేజితమవుతాయి.

ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.

శ్వాస ఇబ్బందులు, ఉబ్బస వ్యాధి ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది.

కంటిచూపు మెరుగుపడుతుంది. ఆకలి పెరుగుతుంది.

ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్