WPL: గల్లీ నుంచి దిల్లీ దాకా వచ్చి.. జాక్‌పాట్ కొట్టేశారు!

డబ్ల్యూపీఎల్‌ వేలం.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ కోసం తొలిసారి జరిగిన ఈ వేలంలో అందరి కళ్లూ స్మృతీ మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దీప్తి శర్మ.. వంటి స్టార్‌ క్రికెటర్స్ పైనే! అందరి అంచనాల్ని నిజం చేస్తూ వీళ్లు కోట్లలో ధర పలికారు. అయితే వాళ్ల స్ఫూర్తితోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న కొంతమంది.....

Updated : 15 Feb 2023 20:08 IST

(Photos: Twitter)

డబ్ల్యూపీఎల్‌ వేలం.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ కోసం తొలిసారి జరిగిన ఈ వేలంలో అందరి కళ్లూ స్మృతీ మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దీప్తి శర్మ.. వంటి స్టార్‌ క్రికెటర్స్ పైనే! అందరి అంచనాల్ని నిజం చేస్తూ వీళ్లు కోట్లలో ధర పలికారు. అయితే వాళ్ల స్ఫూర్తితోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న కొంతమంది యువ కెరటాలూ తొలి డబ్ల్యూపీఎల్‌ వేలంలోనే జాక్‌పాట్‌ కొట్టేశారు. తమదైన ప్రతిభతో లక్షల్లో ధర పలికి తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని ఒక్కసారిగా మార్చేశారు. తమకెదురైన వివక్షకు సరైన సమాధానం చెప్పారు. మరి, తొలి డబ్ల్యూపీఎల్‌ వేలంతోనే లక్షాధికారులుగా మారిన ఈ అమ్మాయిల అంతరంగమేంటో వారి మాటల్లోనే..!

క్రికెటా.. వద్దంటే వద్దన్నారు! - మిన్ను మణి

కేరళ వయనాడ్‌లోని కురిచియా గిరిజన ప్రాంతానికి చెందిన అమ్మాయిని నేను. నాన్న రోజువారీ కూలీ. అమ్మ గృహిణి. ఆర్థికంగా బాగా వెనుకబడిన కుటుంబం మాది. నాకు చిన్న వయసు నుంచే ఆటలంటే ఇష్టం. అందులోనూ క్రికెట్‌ అంటే మక్కువ ఎక్కువ. ఈ ఇష్టాన్నే ఇంట్లో చెప్తే అమ్మానాన్నలు వద్దంటే వద్దన్నారు. ‘క్రికెట్‌ అబ్బాయిల ఆట.. నువ్వెందుకు ఆడతావు?!’ అంటూ అడుగడుగునా నిరుత్సాహపరిచేవారు. అయినా నేను తలొగ్గలేదు. ఇరుగుపొరుగు అబ్బాయిలు, మా కజిన్స్‌తో కలిసి పంట పొలాల్లో క్రికెట్‌ ఆడేదాన్ని. ఇక ఈ ఆటపై సీరియస్‌గా దృష్టి పెట్టింది మాత్రం 8 తరగతిలో ఉన్నప్పుడే! స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే క్రమంలో ఆ స్కూల్‌ పీఈటీ ఆట పట్ల నాకున్న మక్కువను గుర్తించి ప్రోత్సహించారు. ఈ సమయంలోనే వయనాడ్‌ జిల్లా అండర్‌-13 జట్టు కోసం సెలక్షన్‌ ట్రయల్స్‌ జరిగాయి. అందులో పాల్గొనడానికి అమ్మానాన్నల్ని ఎంతగా ఒప్పించానో నాకే తెలుసు! ఎలాగైతేనేం.. ఈ ట్రయల్స్‌లో ఎంపికై కేసీ అకాడమీలో సీటొచ్చాక గానీ అమ్మానాన్న మనసు మారలేదు.

నాలుగు బస్సులు మారేదాన్ని!

ఇక శిక్షణలో భాగంగా.. ఉదయం 4 గంటలకు నా రోజు మొదలయ్యేది. నిద్ర లేచి అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేసేదాన్ని. మా ఇంటి నుంచి కృష్ణగిరిలోని కేసీఏ స్టేడియంకు చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టేది. నేరుగా బస్సు సదుపాయం కూడా లేదు. నాలుగు బస్సులు మారి 9 కల్లా స్టేడియంకు చేరుకునేదాన్ని. ఇక ప్రాక్టీస్‌ ముగించుకొని ఇంటికొచ్చేసరికి సాయంత్రం 7 అయ్యేది. విపరీతంగా అలసిపోయేదాన్ని. కానీ తర్వాత్తర్వాత సాధన చేసే కొద్దీ ఈ అలసటను అధిగమించగలిగాను. మొదట్లో శిక్షణ కోసం నాన్న చాలా అప్పులు చేశారు. కానీ ఆపై మ్యాచులతో నేను సంపాదించిన డబ్బుతో ఈ అప్పులన్నీ తీర్చడమే కాదు.. ఓ చిన్న ఇల్లు కూడా కట్టుకున్నాం. అయితే ఆ తర్వాత వరదల్లో ఇల్లు కాస్త దెబ్బతిన్నా.. తిరిగి బాగు చేయించుకునే స్థితిలో ఉన్నానంటే అదంతా క్రికెట్ వల్లే అని చెప్తా. ప్రస్తుతం కేరళ మహిళల జట్టులో భాగమైన నన్ను వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు రూ. 30 లక్షలకు కొనుగోలు చేయడం సంతోషంగా ఉంది. ఇందులో మంచి ప్రదర్శన చేసి.. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యం.


అందుకే అబ్బాయిలతో ఆడేదాన్ని! - తనూజా కన్వర్

హిమాచల్ప్రదేశ్ సిమ్లాలో పుట్టి పెరిగాను నేను. స్కూల్లో ఉన్నప్పుడు అన్ని ఆటల్లో చురుగ్గా రాణించేదాన్ని. అయితే వాటిల్లో క్రికెట్‌ నా మనసుకు బాగా నచ్చేసింది. ఈ ఆట గురించి తెలిసినా అమ్మాయిల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారని, అమ్మాయిలకంటూ ప్రత్యేకించి ఓ జట్టు ఉంటుందని నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా.. స్థానిక అబ్బాయిలతో గల్లీ క్రికెట్‌ ఆడడం! ఇక నాలోని ఇష్టాన్ని గుర్తించిన నాన్న.. అమ్మాయిల క్రికెట్‌, కోచింగ్‌ గురించి మరిన్ని విషయాలు తెలుసుకొని.. నేను ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకునే విషయంలో నా వెన్నుతట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో కోచ్‌ సలహా మేరకు స్పిన్‌ బౌలింగ్‌లో నైపుణ్యాలు పెంచుకున్నా. ఇండియా ‘ఎ’ కోసం ఆడుతున్న క్రమంలో కాస్త నెర్వస్‌గా ఫీలయ్యేదాన్ని. కానీ జట్టులోని సీనియర్లతో మాట్లాడుతున్న కొద్దీ ఆత్మవిశ్వాసం రెట్టించేది. మొదట్లో ఆటలోని ఒత్తిడిని అధిగమించడానికి సుష్మా వర్మ ఇచ్చిన సలహాలు పనికొచ్చాయి. ఎప్పటికైనా టీమిండియా జెర్సీ ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. డబ్ల్యూపీఎల్ ఆ మార్గాన్ని మరింత సుగమం చేసింది. వేలంలో గుజరాత్‌ జెయింట్స్‌ నన్ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి ఈ టోర్నీనే లక్ష్యంగా పెట్టుకున్నా.


పరుగుల మెషీన్‌! - శ్వేత సెహ్రావత్

మాది దిల్లీలోని వసంత్‌ కుంజ్‌. అమ్మానాన్నలకు మేమిద్దరం అమ్మాయిలమే! పురుషులతో సమానంగా మమ్మల్ని పెంచారు. స్కూల్లో చదువుకునే రోజుల్లో అక్కతో పాటే క్రికెట్‌ కోచింగ్‌కి వెళ్లేదాన్ని. అలా నాలో ఈ ఆట పట్ల మక్కువ పెరిగింది. అక్కడ షాడో ప్రాక్టీస్‌ (బంతి ఉపయోగించకుండా కోచ్‌ ఇచ్చే మెలకువలను అనుసరిస్తూ బ్యాట్‌తో సాధన చేయడం) నాకు బాగా తోడ్పడింది. నా క్రికెట్‌ నైపుణ్యాల్ని మరింతగా మెరుగుపరచుకునేందుకు దోహదం చేసింది. 12 ఏళ్ల వయసులోనే ‘దిల్లీ సీనియర్‌ విమెన్స్‌ ట్రయల్స్‌’లో భాగంగా 30 ప్రాబబుల్స్‌కి ఎంపికయ్యా. అయితే ఆపై అండర్‌-16 జట్టుకు ఎంపికవడానికి మరింత కష్టపడి సాధన చేయాల్సి వచ్చింది. ఇక అండర్‌-16 మ్యాచుల్లో భాగంగా నేను కనబరిచిన ప్రతిభే నన్ను అండర్‌-19 జట్టులో చోటు దక్కించుకునేలా చేసింది. ఇటీవలే ముగిసిన అండర్‌-19 టీ 20 టోర్నీలోనూ సత్తా చాటా. అద్భుతమైన బ్యాటింగ్‌ ప్రదర్శనతో అనతి కాలంలోనే పరుగుల మెషీన్‌గానూ గుర్తింపు పొందా. డబ్ల్యూపీఎల్‌ వేలంలో రూ. 40 లక్షలకు యూపీ వారియర్స్‌ జట్టు నన్ను సొంతం చేసుకుంది. ఈ వేదికగా ఇదే ప్రదర్శనను కనబరచాలని ఉవ్విళ్లూరుతున్నా.


స్కేటింగ్‌ నుంచి క్రికెట్‌కు! - కనికా అహుజా

మాది పంజాబ్‌. నాకు చిన్నతనం నుంచి స్కేటింగ్‌ అంటే చాలా ఇష్టం. జాతీయ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొన్నా. అయితే స్కూల్లో ఆటలపోటీల్లో నా చురుకుదనం చూసి.. అందరూ నేను క్రికెట్‌ మరింత బాగా ఆడతానని, అందులో మెరుగ్గా రాణిస్తానని అనేవారు. వాళ్లు అలా అన్నప్పుడల్లా స్కేటింగా/క్రికెటా? కెరీర్‌గా దేన్ని ఎంచుకోవాలి? అన్న సందిగ్ధంలో పడిపోయేదాన్ని. కానీ జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నీలో పాల్గొన్నప్పుడు ఈ ఆట పట్ల నాకున్న తృష్ణేంటో అర్థమైంది. అలా సందిగ్ధం వీడి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నా. ‘అమ్మాయి క్రికెట్‌ ఆడడమేంటి?’ అన్న వాళ్లూ లేకపోలేదు. అయితే మధ్యమధ్యలో గాయాలైనప్పుడు ఇంట్లో వాళ్లు భయపడేవాళ్లు. కానీ నేను పైచదువులకని అబద్ధం చెప్పి చండీగఢ్ వెళ్లి క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసేదాన్ని. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ నా ఫేవరెట్‌ ప్లేయర్‌. ప్రస్తుతం పంజాబ్‌ విమెన్‌, ఇండియా డి విమెన్‌, నార్త్‌ జోన్‌ విమెన్‌.. వంటి జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నా. డబ్ల్యూపీఎల్‌ వేలంలో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు రూ. 35 లక్షలకు నన్ను కొనుగోలు చేసింది. జట్టు నాపై పెట్టుకున్న అంచనాల్ని వమ్ము చేయకుండా రాణిస్తా.. తద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్