చిరుధాన్యాలతో.. ప్రతి ‘బైట్’ ఆరోగ్యకరంగా ఉండేలా..!

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. కొవిడ్‌కు ముందు ఎలా ఉన్నా.. కొవిడ్‌ తర్వాత మాత్రం అందరూ దీన్ని బాగా ఒంటబట్టించుకున్నారు. ప్రతి బైట్‌లోనూ ఆరోగ్యాన్ని వెతుక్కుంటున్నారు. ఇలా అందరి ఆలోచననే ఆదాయ మార్గంగా మలచుకున్నారు హైదరాబాద్‌కు....

Updated : 20 Dec 2022 13:16 IST

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. కొవిడ్‌కు ముందు ఎలా ఉన్నా.. కొవిడ్‌ తర్వాత మాత్రం అందరూ దీన్ని బాగా ఒంటబట్టించుకున్నారు. ప్రతి బైట్‌లోనూ ఆరోగ్యాన్ని వెతుక్కుంటున్నారు. ఇలా అందరి ఆలోచననే ఆదాయ మార్గంగా మలచుకున్నారు హైదరాబాద్‌కు చెందిన శిల్పి సింగ్‌. రుచిలో ఏమాత్రం రాజీ పడకుండా, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాల్ని చిరుధాన్యాలతో తయారుచేసే వ్యాపారాన్ని ప్రారంభించారామె. సాయంత్రాలు అలా టైంపాస్‌గా తినే స్నాక్స్‌ దగ్గర్నుంచి.. చిటికెలో వండుకోవడానికి సిద్ధంగా ఉండే ఆహార ఉత్పత్తుల్ని వినియోగదారులకు చేరువ చేస్తోన్న శిల్పి.. తన వ్యాపార ప్రయాణం గురించి ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

మాది ఉత్తరప్రదేశ్‌. పెళ్లయ్యాక హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. ఐఐటీ రూర్కీలో ఇంజినీరింగ్‌ చదివాక.. యూఎస్‌లో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేశాను. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేశా. చదువు పూర్తయ్యాక 14 ఏళ్ల పాటు వివిధ కంపెనీల్లో పనిచేశాను.

ఆ ఆలోచనతోనే..

నాకు ముందు నుంచీ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. ఈక్రమంలోనే చిరుధాన్యాల్ని నా ఆహారంలో భాగం చేసుకునేదాన్ని. అయితే ఇవి నేరుగా వండుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. పైగా అంత రుచించవు కూడా! అలాగని పోషకాల విషయంలో వీటికి తిరుగులేదు. అందుకే వీటిలోనే అటు ఆరోగ్యకరంగా, ఇటు రుచికరంగా ఉండే ఆప్షన్ల గురించి మార్కెట్లో అన్వేషించడం మొదలుపెట్టా. కానీ ఎక్కడా అలాంటి ఉత్పత్తులు నాకు తారసపడలేదు.. ఒకవేళ ఉన్నా తక్కువ ఆప్షన్లు ఉండేవి. దీనికి తోడు సొంత వ్యాపారం ప్రారంభించాలన్న మక్కువ కూడా నాకు ముందు నుంచే ఉంది. అందుకే ఈ రెండింటికీ ముడిపెట్టాలనుకున్నా. ఈ ఆలోచనే ‘ఫిట్టర్‌ బైట్స్‌ (FittR biTes)’ అనే సంస్థకు బీజం వేసింది. ఫిట్‌నెస్‌, ఆరోగ్యం రెండూ కలగలిసేలా దీనికి ఈ పేరు పెట్టాం.

‘రిస్క్‌ ఎందుకు’ అన్నారు!

అయితే వ్యాపారం ప్రారంభించినప్పుడు వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉన్నతోద్యోగం, మంచి జీతం వదులుకొని వ్యాపారంలోకి వస్తే చుట్టూ ఉన్న వారు తలా ఓ మాట అనడం సహజం. నా విషయంలో ‘బిజినెస్ సక్సెస్‌ అవుతుందో, లేదో తెలియదు.. రిస్క్‌ చేయడమెందుకు?’ అన్న వారూ లేకపోలేదు. కానీ ఇలాంటి సమయంలో నా కుటుంబం, మా వారు నాకు వెన్నుదన్నుగా నిలిచారు. నన్ను ప్రోత్సహించారు. పైగా నాకు రిస్క్‌ చేయడమంటే ముందు నుంచే ఇష్టం. ఇవే నేను ముందడుగు వేసేలా చేశాయి. ఇక ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చే క్రమంలో సుమారు ఏడాదిన్నర పాటు చిన్నపాటి రీసెర్చ్‌ చేశాను. మార్కెట్లో ఎలాంటి ఉత్పత్తులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది? అన్ని వయసుల వారికి ఆరోగ్యాన్నిచ్చే ఆహార ఉత్పత్తులు.. మొదలైన విషయాల గురించి సునిశితంగా పరిశీలించాకే చిరుధాన్యాల్ని ప్రధాన ముడిసరుకుగా ఎంచుకున్నా.

బోలెడన్ని ఆప్షన్లు!

చిరుధాన్యాలతో ప్రస్తుతం మా వద్ద రెండు రకాల పదార్థాలు తయారవుతున్నాయి. ఒకటి-స్నాక్స్‌, రెండోది-వండుకోవడానికి సిద్ధంగా ఉండే పదార్థాలు. స్నాక్స్‌లో భాగంగా.. మిల్లెట్‌ చిక్కీ, కుకీస్.. వంటివి ఉన్నాయి. వీటి తయారీలో చిరుధాన్యాలతో పాటు గోధుమ పిండి, బ్రౌన్‌ షుగర్‌, పల్లీలు, బెల్లం.. వంటి సహజసిద్ధమైన/ఆరోగ్యకరమైన పదార్థాల్ని ఉపయోగిస్తున్నాం. ఇక వండుకోవడానికి సిద్ధంగా ఉన్న పదార్థాల్లో భాగంగా.. మిల్లెట్‌ కిచిడీ, మిల్లెట్‌ దోసె, ఓట్స్‌ ఇడ్లీ (ఓట్స్‌+రవ్వ), జొన్న ఉప్మా, మిల్లెట్‌ నూడుల్స్‌.. వంటివి అందిస్తున్నాం. ఇక రోగనిరోధక శక్తి కోసం కాఢా పానీయం, సత్తూ మిక్స్.. వంటివీ వినియోగదారులకు అందుబాటులో ఉంచాం. మా వద్ద తయారయ్యే ప్రతి ఉత్పత్తిలోనూ సోడా, కృత్రిమ రంగులు.. వంటివేవీ ఉపయోగించం. ఇక ఆయా పదార్థాలకు అదనపు రుచిని, పోషకాల్ని అందించడం కోసం వివిధ రకాల పప్పులు, గోధుమపిండి.. వంటివి ఉపయోగిస్తున్నాం. అలాగే కొన్ని ఉత్పత్తుల్ని మధుమేహులూ తీసుకోవచ్చు. ఇలా మా వద్ద తయారయ్యే పదార్థాలు సుమారు ఆరు నెలల పాటు నిల్వ ఉంటాయి. ఇక మా ఉత్పత్తులకు FSSAI ఆమోదం కూడా లభించింది.

అదే మా ప్రత్యేకత!

కొవిడ్‌ తర్వాత చిరుధాన్యాలకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. వీటితో తయారుచేసిన ఆహార ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ఈ క్రమంలో- ఆరోగ్యకరమైన పదార్థాల వాడకం, తయారీలో మేం పాటించే నాణ్యత వల్లే మా ఉత్పత్తులు ఎక్కువమంది వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్నాయని కచ్చితంగా చెప్పగలను. ఇక వీటి తయారీ దగ్గర్నుంచి ప్యాకింగ్‌ దాకా ఆయా నిపుణుల బృందం ప్రత్యక్షంగా పర్యవేక్షించడం, శ్రద్ధ తీసుకోవడం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వడం.. వంటివెన్నో మాకు సానుకూలాంశాలు.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో..

ప్రస్తుతం మా ఉత్పత్తుల ధర రూ. 10-200 వరకు ఉంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వీటిని అందుబాటులో ఉంచాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో 200కి పైగా స్టోర్స్‌, సూపర్‌మార్కెట్స్‌లో మా ఉత్పత్తులు లభిస్తున్నాయి. విజయవాడ, బెంగళూరు, పశ్చిమబంగ, దిల్లీ.. వంటి నగరాల్లోని స్టోర్స్‌ ద్వారా కూడా విక్రయిస్తున్నాం. ఇవి కాక గిఫ్టింగ్‌ సౌలభ్యం కూడా మా వద్ద అందుబాటులో ఉంది. హోల్‌సేల్‌ తరహాలో విదేశాలకూ పంపిస్తున్నాం. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అన్ని మెట్రోనగరాల్లో మా ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన ఉంది. అలాగే మధుమేహుల కోసం ప్రత్యేకంగా ఆహార ఉత్పత్తులు, కుకీస్‌, వివిధ రకాల నూడుల్స్‌-పాస్తా.. వంటివీ తయారుచేయాలనుకుంటున్నాం. అలాగే విదేశాలకు ఎగుమతి చేసేందుకూ ప్రణాళికలు రచిస్తున్నాం.


వాళ్ల గైడెన్స్‌తో..

ఒక వ్యాపారం ప్రారంభించాలంటే ఆలోచనొక్కటే సరిపోదు.. పెట్టుబడి అవకాశాలు,  మార్కెటింగ్, బ్రాండ్‌ బిల్డింగ్.. ఇలా ప్రతి అంశంలో సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలి. ఈ క్రమంలో మాకు వీహబ్‌ సహాయ సహకారాలు ఎంతగానో ఉపకరించాయి. ఆయా అంశాల్లో ట్రైనింగ్‌ సెషన్స్‌ నిర్వహించడంతో పాటు రీటైల్‌ స్టోర్స్‌కి మా ఉత్పత్తుల్ని అనుసంధానించడం, వివిధ ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించడం.. ఇలా చాలా అంశాల్లో వారి సలహాలు పనికొచ్చాయి. ఈ వేదికగానే లాంచ్‌ప్యాడ్‌ అనే ప్రోగ్రామ్‌లోనూ మేం భాగమయ్యాం. భవిష్యత్తులోనూ ఈ సహకారం ఇలాగే కొనసాగుతుందన్న భరోసా ఉంది. ఇక స్టార్టప్‌ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా టాప్-32 స్టార్టప్స్‌లో మాది ఎంపికైంది. స్టాన్‌ఫోర్డ్‌ పార్క్‌ సీడ్‌ ప్రోగ్రామ్‌కూ ఎంపికయ్యాం. ఐఐఎంఆర్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌కు చెందిన N-grain Nutrihub Programలోనూ చేరాం. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సమకూర్చుకున్న పెట్టుబడికి తోడు ప్రస్తుతం నిధుల సమీకరణకూ నడుం బిగించాను.


ఆ రెండూ ముఖ్యం!

సానుకూల దృక్పథం, పట్టుదల.. ఈ రెండూ మనల్ని లక్ష్యం వైపు అడుగేయిస్తాయి. వ్యాపారంలో ఎత్తుపల్లాలు సహజం. అయినా ఆలోచనను ఆచరణలో పెడుతూ ముందుకెళ్లాలి. అవసరమైతే మెంటార్స్‌ సహాయం తీసుకోవడం మంచిది. ఇక ప్రస్తుతం చాలామంది మహిళలు వర్క్-లైఫ్‌ బ్యాలన్స్‌ విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అది కాస్త కష్టమే కావచ్చు.. కానీ ప్రాధాన్యతల్ని బట్టి వ్యక్తిగత, వృత్తిపరమైన పనుల్ని బేరీజు వేసుకుంటూ, వాటికి తగిన సమయం ఇవ్వగలిగితే ఈ రెండింటినీ సునాయాసంగా సమన్వయం చేసుకోవచ్చు. ఇక వర్కింగ్‌ మదర్‌గా పిల్లల కెరీర్ పైనా సానుకూల ప్రభావం చూపగలుగుతాం. ఇవన్నీ నా స్వీయానుభవాలు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్