‘బోర్డ్‌ గేమ్స్‌’తో పిల్లల మెదడుకు పదును పెడుతోంది!

చదువు, ఆన్‌లైన్‌ క్లాసులంటూ ఈ కాలపు పిల్లలు గంటల కొద్దీ మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌తో గడుపుతున్నారు. దీనివల్ల విజ్ఞానం మాటేమో గానీ.. చిన్నతనంలోనే వారు కంటి సమస్యలు, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. తన చుట్టూ ఉన్న చాలామంది పిల్లల్లో ఈ సమస్యల్ని....

Updated : 27 Mar 2023 14:21 IST

చదువు, ఆన్‌లైన్‌ క్లాసులంటూ ఈ కాలపు పిల్లలు గంటల కొద్దీ మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌తో గడుపుతున్నారు. దీనివల్ల విజ్ఞానం మాటేమో గానీ.. చిన్నతనంలోనే వారు కంటి సమస్యలు, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. తన చుట్టూ ఉన్న చాలామంది పిల్లల్లో ఈ సమస్యల్ని గుర్తించింది హైదరాబాద్‌కు చెందిన రితికా అగర్వాల్‌. పిల్లల స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించడంతో పాటు వారికి విజ్ఞానాన్ని అందించే బోర్డ్‌ గేమ్స్‌ తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనతోనే చిన్నతనంలో తానెంతో ఇష్టంగా ఆడిన ఈ ఆటల్నే తన వ్యాపార సూత్రంగా మలచుకున్న ఆమె.. ఓవైపు పిల్లలకు విజ్ఞానాన్ని పంచుతూనే, మరోవైపు లక్షల ఆదాయం ఆర్జిస్తోంది. ఇలా తనదైన సృజనాత్మకతతో దూసుకుపోతోన్న రితిక.. తన వ్యాపార ప్రయాణాన్ని ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకుంది.

మాది హైదరాబాద్‌. ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఫైనాన్స్‌ విభాగాల్లో ఎంబీఏ పూర్తిచేశా. చిన్నప్పట్నుంచీ గణితం నాకిష్టమైన సబ్జెక్టు. అలాగే బోర్డ్‌ గేమ్స్‌ బాగా ఆడేదాన్ని. ఒక్కోసారి మా కజిన్స్‌తో కలిసి ఏకధాటిగా నాలుగు రోజుల పాటు బోర్డ్‌ గేమ్స్‌ ఆడిన సందర్భాలూ ఉన్నాయి. ఈ ఆటలంటే నాకు అంత మక్కువ మరి! ఇక ఎంబీఏ చదువుతున్నప్పుడూ ‘గేమ్‌ స్పేస్‌’ పేరుతో బోర్డ్‌ గేమ్స్‌ అంశంపైనే లైవ్‌ ప్రాజెక్ట్‌ చేశా. దీనివల్ల ఇటు బోర్డ్‌ గేమ్స్‌, అటు బిజినెస్‌.. రెండింటిపైనా పట్టు పెరిగింది.

మా పిల్లల కోసం చేసిన ఆలోచన..!

ఇక పెళ్లై, పిల్లలు పుట్టాక.. నా ఇద్దరు కొడుకుల కోసం బోర్డ్‌ గేమ్స్‌ తయారుచేయాలనుకున్నా. అయితే అవి కేవలం వాళ్ల తెలివితేటల్ని పెంచడమే కాదు.. ఆ జ్ఞానాన్ని తమ చుట్టూ జరిగే విషయాలకు ప్రయోగాత్మకంగా అన్వయించి అర్థం చేసుకునే సామర్థ్యాన్నీ ఈ ఆటలతో అందించాలనుకున్నా. ఈ క్రమంలోనే మార్కెట్లో ఇప్పటివరకు ఉన్న బోర్డ్‌ గేమ్స్‌పై ఓ చిన్నపాటి అధ్యయనం చేశా. చిన్నారుల తెలివితేటల్ని పెంచుతూనే, వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే బోర్డ్‌ గేమ్స్‌ చాలా అరుదుగా ఉన్నాయన్న విషయం అర్థమైంది. దీనికి తోడు ఈ కాలపు పిల్లల్లో చాలామంది చదువు, ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో గంటల తరబడి మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌కే పరిమితమవుతున్నారు. దీంతో వారిలో కంటి సమస్యలు, మానసిక ఒత్తిళ్లు తలెత్తుతున్నాయి. కాబట్టి బోర్డ్‌ గేమ్స్‌తో ఇలాంటి గ్యాడ్జెట్స్‌ నుంచీ వారి మనసు మళ్లించచ్చనిపించింది. ఈ ఆలోచనలే 2020లో ‘యుకా ఛాంప్స్‌’ అనే బోర్డ్‌ గేమ్స్‌ తయారీ సంస్థకు ఊపిరి పోశాయి. నా ఇద్దరు కొడుకులు యువాన్‌, కయాన్‌ పేర్ల మీదుగా ఈ సంస్థకు పేరు పెట్టా.

‘ఛాంపియన్‌’ని వెలికితీసేందుకు..!

ప్రతి చిన్నారిలో తమకే తెలియని విజేత దాగుంటారు. ఆ ఛాంపియన్‌ని వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, క్రమశిక్షణ పెంచడమే మా సంస్థ ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో పిల్లల మెదడుకు పదునుపెట్టేలా, వారిలో నిగూఢమైన తెలివితేటల్ని వెలికితీసేలా వినూత్నమైన బోర్డ్‌ గేమ్స్‌ రూపొందిస్తున్నా. వీటితో వారిని మరింత ప్రతిభావంతుల్ని చేసి, వారి భవిష్యత్తును అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఇందులో భాగంగానే ఏళ్ల కొద్దీ పరిశోధన చేసి, వినూత్న పద్ధతుల్ని క్రోడీకరించి ఇప్పటివరకు సుమారు ఆరు బోర్డ్‌ గేమ్స్‌ రూపొందించా. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచే ‘గ్రీన్‌ డే’, మెదడుకు పదును పెడుతూ.. గణిత నైపుణ్యాల్ని పెంచే ‘మారథాన్‌’, గడియారం గురించి మరింత లోతుగా నేర్పే ‘టిక్‌ టాక్‌ టిక్‌’, సరదాగా ఆడే ‘డూ యూ సీ మీ?’.. వంటి ఆటలు అందులో కొన్ని! ఆరేళ్ల పైబడిన చిన్నారులు ఎవరైనా మా బోర్డ్‌ గేమ్స్‌ ఆడచ్చు.. ఒంటరిగానే కాదు.. జంటలుగా, నలుగురూ ఒకేసారి ఆడేలా ఈ గేమ్స్‌ని రూపొందించాం.

సరదాగా.. సులభంగా..!

ఆడే కొద్దీ ఆసక్తిని పెంచుతూ.. ఎంతో సరదాగా, సులభంగా ఆడేందుకు వీలుగా ఉండడంతో మా బోర్డ్‌ గేమ్స్‌ ఎక్కువ మంది పిల్లల్ని ఆకట్టుకుంటున్నాయి. అలాగే మా బోర్డ్‌ గేమ్స్‌లో ప్రతిదీ దేనికదే ప్రత్యేకం. ఈ ప్రత్యేకతల్ని అర్థం చేసుకోవడానికి వీలుగా.. ప్రతి గేమ్‌ను వివరించే YouTube వీడియోకు ఓ QR కోడ్‌ను జతచేశాం. అంతేకాదు.. మేము వివిధ బోర్డ్ గేమ్ ఈవెంట్‌లనూ నిర్వహిస్తుంటాం. ఇందులో భాగంగా పిల్లలతో పాటు పెద్దలూ ఈ బోర్డ్‌ గేమ్స్‌ ఆడచ్చు.. తద్వారా వాటిలోని ప్రత్యేకతల్ని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.

మరో 50.. మా టార్గెట్‌!

తొలుత మా ఉత్పత్తుల్ని 30కి పైగా ప్రముఖ ఈ-కామర్స్‌ వేదికలపై విక్రయించడం మొదలుపెట్టాం. ఇక ఐఎస్‌ఐ గుర్తింపు పొందాక ఆఫ్‌లైన్‌ మార్కెట్లోకీ అడుగుపెట్టాం. ప్రస్తుతం ఆన్‌లైన్‌తో పాటు దేశవ్యాప్తంగా 300లకు పైగా రిటైల్‌ స్టోర్స్‌లోనూ మా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే అమెరికా వంటి దేశాలకూ ఎగుమతి చేయడం ప్రారంభించాం. పలు కార్పొరేట్ పాఠశాలలూ మా బోర్డ్‌గేమ్స్‌ను ఉపయోగించి వారి విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచుతున్నాయి. వచ్చే ఏడాది కల్లా 50కి పైగా సరికొత్త బోర్డ్‌ గేమ్స్‌ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే ‘హామ్లేస్‌’ వంటి ప్రముఖ టాయ్‌ స్టోర్స్‌లోనూ మా ఉత్పత్తుల్ని విక్రయించాలనుకుంటున్నాం. మరోవైపు మా వ్యాపారాన్ని వివిధ దేశాలకూ విస్తరించాలన్న యోచన చేస్తున్నాం.

అడుగడుగునా ప్రోత్సహించారు!

వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో నా కుటుంబం నుంచి నాకు పూర్తి మద్దతు లభించింది. అంతేకాదు.. వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో బిజినెస్‌ మెలకువలతో పాటు చక్కటి మార్గనిర్దేశనం కూడా వారి నుంచి నాకు అందింది. ఇక వీహబ్‌లో చేరాక.. అక్కడ నిర్వహించిన నెట్‌వర్కింగ్‌-మెంటార్‌షిప్‌ సెషన్స్‌, నిపుణుల సెమినార్స్‌.. నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ఈ క్రమంలో వ్యాపార నిర్వహణ, దాన్ని విస్తరించే మెలకువలపై పట్టు పెరిగింది. ఇక ఇటీవలే ‘హైదరాబాద్‌ బిజినెస్‌ అవార్డ్స్‌’లో భాగంగా ‘న్యూ ఆంత్రప్రెన్యూర్‌ అవార్డు’ అందుకోవడం మరింత ప్రోత్సాహకరంగా అనిపిస్తోంది. చేసే పనిపై మనకున్న తపన, ఇతరుల ప్రోత్సాహంతో పాటు క్రమశిక్షణతో ఆ పని పూర్తిచేయడం ముఖ్యం. ఎలాంటి సవాళ్లు ఎదురైనా పక్కా ప్రణాళికతో, స్థిరమైన పనితనాన్ని ప్రదర్శిస్తే మనం నిర్దేశించుకున్న లక్ష్యానికి సులభంగా చేరుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్