Air France: ‘రక్తం.. రక్తం..’ విమాన ప్రయాణికుడికి భయానక అనుభవం..!

విమానంలో సీటు కింద రక్తపు ఆనవాళ్లను గుర్తించి ఓ ప్రయాణికుడు షాక్‌కు గురయ్యాడు. అక్కడ జరిగిందంతా ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

Published : 04 Jul 2023 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమానంలో ఓ ప్రయాణికుడి (Air Passenger)కి భయానక అనుభవం ఎదురైంది! అతని సీటు కింద పరిచిన కార్పెట్‌ రక్తంతో తడిచి ఉండటం చూసి ఒక్కసారిగా గతుక్కుమన్నాడు. అతని బ్యాగు, చేతులకూ రక్తపు మరకలు అంటుకున్నాయి. సంబంధిత దృశ్యాలతోపాటు అక్కడ ఏం జరిగింది..? అసలు ఆ రక్తం ఎక్కడిది? వివరాలన్నీ ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశాడు. ఈ క్రమంలోనే ఆ ట్వీట్‌ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. హబీబ్‌ బాటాహ్‌ అనే వ్యక్తి పారిస్‌ నుంచి కెనడాలోని టోరంటోకు ‘ఎయిర్‌ఫ్రాన్స్‌ (AirFrance)’ విమానంలో బయల్దేరాడు. సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఏదో వాసన వస్తుండటంతో సీటు కింద కాళ్ల దగ్గర చూశాడు.

కార్పెట్‌పై అతనికి తడిగా ఉన్న ఓ పెద్ద మరక కనిపించింది. సిబ్బందిని పిలవగా వారు కొంచెం తటపటాయించి.. టిష్యూ పేపర్లు ఇచ్చారు. అసలు అదేంటా? అని దాన్ని తుడిచి చూడగా.. అదంతా రక్తమని తేలింది. పదుల కొద్ది టిష్యూలతో తుడిచినా.. అదే పరిస్థితి. సీటు కింద ఉంచిన అతని బ్యాగుకూ నెత్తుటి మరకలు అంటాయి. కొద్దిసేపటికి సిబ్బంది అసలు విషయం చెప్పారు. అంతకుముందు ట్రిప్‌లో ఈ విమానంలో ఓ ఇన్‌ఫెక్షన్‌ రోగి ప్రయాణించాడని, అతనికి రక్తస్రావమైనట్లు తెలిపారు. సీట్లను శుభ్రం చేసిన క్లీనింగ్‌ సిబ్బంది.. కార్పెట్‌ను అలాగే వదిలేశారన్నారు. ఊహించని ఈ సమాధానానికి ఒక్కసారిగా షాక్‌ తిన్న అతను.. జరిగిందంతా ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

‘నా జీవితంలో ఇప్పటివరకు చూసిన ఘటనలు ఒకెత్తు. ఇది ఒకెత్తు. ఇంత రక్తం కోల్పోయిన ఆ రోగి పరిస్థితి ఎలా ఉందో? ఒకవేళ అతనికి ఏదైనా వ్యాధి ఉంటే.. అది తనతోపాటు ఇతర ప్రయాణికులకు వ్యాపిస్తే పరిస్థితి ఏంటి? ఎయిర్‌ఫ్రాన్స్‌, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌లు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఆ రోగి ప్రస్తుత పరిస్థితిపై సమాచారం అందించాలి’ అని హబీబ్‌ డిమాండ్‌ చేశాడు. ‘ఎయిర్‌ఫ్రాన్స్‌’ స్పందిస్తూ.. కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. తమ సిబ్బంది సంప్రదిస్తారని తెలిపింది. నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అంటూ నెటిజన్లలో ఒకరు స్పందించారు. ప్రయాణికులనే శుభ్రం చేసుకోమని చెప్పడం ఏంటని మరొకరు ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని