US Embassy: ఉక్రెయిన్‌ను వీడండి.. అమెరికన్లకు విదేశాంగ శాఖ హెచ్చరిక!

ఉక్రెయిన్‌(Ukraine) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాబోయే రోజుల్లో.. ఆ దేశంపై రష్యా(Russia) సేనలు మరిన్ని దాడులతో విరుచుకుపడే ప్రమాదం ఉందని అమెరికా(America) హెచ్చరించింది....

Published : 24 Aug 2022 02:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌(Ukraine) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాబోయే రోజుల్లో.. ఆ దేశంపై రష్యా(Russia) సేనలు మరిన్ని దాడులతో విరుచుకుపడే ప్రమాదం ఉందని అమెరికా(America) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని అమెరికన్లు వీలైతే దేశం విడిచిపెట్టాలని కీవ్‌(Kyiv)లోని అగ్రరాజ్య రాయబార కార్యాలయం(US Embassy) కొత్తగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ‘రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ పౌర సదుపాయాలు, ప్రభుత్వ కేంద్రాలపై రష్యా తన దాడులను ముమ్మరం చేయనుందని విదేశాంగ శాఖకు సమాచారం ఉంది’ అని అమెరికా ఎంబసీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

సురక్షితమని భావిస్తే ప్రైవేటుగా అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా ఉక్రెయిన్ నుంచి బయలుదేరాలని కోరింది. రష్యా సైనిక చర్య ప్రారంభానికి ముందు సైతం అగ్రరాజ్యం.. ఉక్రెయిన్‌లోని తన పౌరులకు పలుమార్లు ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఉక్రెయిన్‌ కూడా రాకెట్ దాడులకు అవకాశం ఉన్నందున గురువారం వరకు రాజధాని ‘కీవ్‌’లో స్వాతంత్య్ర దినోత్సవాలకు సంబంధించి భారీ బహిరంగ కార్యక్రమాలు, ర్యాలీలు, ఇతర సమావేశాలను నిషేధించింది.

పదింట ఒక పాఠశాల ధ్వంసం: యూనిసెఫ్‌

మరోవైపు.. ఉక్రెయిన్‌ యుద్ధ సంక్షోభంలో చిన్నారుల మరణాలపై యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ రస్సెల్ ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు సగటున అయిదుకుపైగా.. ఇప్పటివరకు 972కుపైగా చిన్నారులు మృతి చెందారు లేదా గాయపడ్డారని తెలిపారు. వాస్తవానికి ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందన్నారు. ఈ వారంలో ఉక్రెయిన్‌లో విద్యాసంవత్సరం మొదలు కానుంది. అయితే, యూనిసెఫ్‌ అంచనా ప్రకారం.. స్థానికంగా 10 పాఠశాలల్లో ఒకటి ధ్వంసమైందని ఆమె చెప్పారు. చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం ఇరు దేశాలు కాల్పుల విరమణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని