Massacre: గాఢ నిద్రే.. ప్రాణభిక్ష! థాయిలాండ్‌ ఘటనలో క్షేమంగా బయటపడ్డ ఏకైక చిన్నారి

థాయిలాండ్‌లోని ఓ ‘డే కేర్‌’ సెంటర్‌లో ఇటీవల ఓ ఉన్మాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల ఘటనలో ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడంది. కారణం.. ఆ సమయంలో ఆమె దుప్పటి కప్పుకొని నిద్రపోతుండటమేనట.

Published : 10 Oct 2022 01:16 IST

బ్యాంకాక్‌: థాయిలాండ్‌లోని ఓ ‘డే కేర్‌’ సెంటర్‌లో ఇటీవల ఓ ఉన్మాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 24 మంది చిన్నారులతోపాటు 30 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ మారణకాండ(Thailand Massacre)లో అక్కడే ఉన్న ఓ చిన్నారి మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడటం విశేషం. కారణం.. ఆ సమయంలో ఆమె తరగతి గది మూలలో దుప్పటి కప్పుకొని నిద్రపోతుండటమే. ఆమే మూడేళ్ల ‘పవీనట్‌ సుపొల్‌వాంగ్‌’. ఘటనా సమయంలో ఆమె గాఢంగా నిద్రపోతోందని, అప్పటికే ఆమెపై దుప్పటి కప్పి ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఇదే ఆమె ప్రాణాలను కాపాడినట్లు తెలుస్తోంది! ఈ దారుణం నుంచి క్షేమంగా తప్పించుకున్న ఏకైక చిన్నారి సుపొల్‌వాంగ్‌ కావడం గమనార్హం.

‘నేను షాక్‌లో ఉన్నా!’ అని పాప తల్లి పనోమ్‌పాయ్ సితోంగ్ ఓ వార్తాసంస్థతో చెప్పారు. తన బిడ్డ బతికి ఉన్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ.. ఇతర పిల్లల కుటుంబాలను చూస్తే బాధేస్తోందన్నారు. ఇది విచారం, కృతజ్ఞత కలగలిపిన కొత్త అనుభూతి అని వివరించారు. అయితే, ఈ విషాదం గురించి చిన్నారికి జ్ఞాపకం లేకపోవచ్చని తెలిపారు. ఘటనాస్థలం నుంచి నిందితుడు వెళ్లిపోయిన తర్వాత.. గదిలోని ఒక మూలలో కదలికల ఆధారంగా పాప బతికున్నట్లు గుర్తించారు. తోటి పిల్లల మృతదేహాలు కనిపించనీయకుండా.. అలాగే దుప్పటితో ఆమె ముఖాన్ని కప్పి తీసుకొచ్చారని సితోంగ్‌ తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన చిన్నారుల్లో.. 11 మంది ఆమె నిద్రిస్తున్న గదిలోనే ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

అయితే, తన కుమార్తెను ఆత్మలే రక్షించాయని తల్లి పేర్కొనడం గమనార్హం. ‘సాధారణంగా చిన్నపాటి అలికిడి అయినా ఆమె నిద్రలేస్తుంది. కానీ, ఆ రోజుమాత్రం గాఢ నిద్రలో ఉంది. ఆ సమయంలో ఆమె కళ్లు, చెవులను ఆత్మలు మూసేసినట్లు నమ్ముతున్నా. అందరికీ వేర్వేరు నమ్మకాలు ఉంటాయి. నా విషయంలో మాత్రం ఇదే’ అని వివరించారు. ఈ ఘటనలో చిన్నారి బెస్ట్ ఫ్రెండ్, రెండేళ్ల టెకిన్ మృతి చెందిందని.. ఈ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పామన్నారు. ఈ ఘటన గురించి ఆమెకు పూర్తిగా తెలియదన్నారు. మరో బంధువు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. పాప ప్రాణాలతో బయటపడటాన్ని ఓ ‘అద్భుతం’గా అభివర్ణించారు. ఇదిలా ఉండగా.. ఈ దురాగతానికి తెగబడిన హంతకుడు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని