Beijing: కరోనా కట్టడికి చైనా తంటాలు.. బీజింగ్‌లో 2.1కోట్ల మందికి పరీక్షలు

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా తీవ్ర కష్టాలు పడుతోంది. ముఖ్యంగా బీజింగ్‌ నగరంలో కరోనా విజృంభణతో ఆందోళన చెందుతోంది.

Published : 27 Apr 2022 01:34 IST

షాంఘైలో నిత్యం 50 మంది మృతి

బీజింగ్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా అష్ట కష్టాలు పడుతోంది. ముఖ్యంగా బీజింగ్‌ నగరంలో కరోనా విజృంభణతో ఆందోళన చెందుతోంది. సోమవారం నాడు 35లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా 21 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. నగరంలో మొత్తం కేసుల సంఖ్య 155కి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మహానగరంలోని 2.1కోట్ల పౌరులకు కొవిడ్‌ పరీక్షలు జరపాలని నిర్ణయించారు. మరోవైపు 38 కరోనా పాజిటివ్‌ కేసులకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టగా వాటన్నింటిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ గుర్తించినట్లు అక్కడి వైద్య అధికారులు వెల్లడించారు.

కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతుండడంతో బీజింగ్‌ వాసులకు లాక్‌డౌన్‌ భయం పట్టుకుంది. ఇప్పటికే నాలుగు వారాలుగా షాంఘై ప్రజలు లాక్‌డౌన్‌లోనే ఉండిపోవడంతో అటువంటి ఆంక్షలు ఇక్కడా అమలు చేస్తారనే ఆందోళన నెలకొంది. దీంతో నిత్యవసర వస్తువులను సమకూర్చుకునేందుకు మార్కెట్ల వద్ద క్యూ కడుతున్నారు. అయితే, డిమాండుకు సరిపడా సరుకులను అందుబాటులో ఉంచుతున్నట్లు బీజింగ్‌ అధికారులు వెల్లడిస్తున్నారు.

190కి చేరిన కొవిడ్ మరణాలు

మరోవైపు, కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ షాంఘైలో వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు అక్కడ మొత్తం 5లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ కొవిడ్‌ మరణాలు కలవరపెడుతున్నాయి. సోమవారం ఒక్కరోజు మరో 52 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో నగరంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 190కి చేరింది. అయితే, నగరంలో వృద్ధుల సంఖ్య అధికంగా ఉండడం, వారికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడం కొవిడ్‌ మరణాలు అధికంగా నమోదు కావడానికి కారణంగా షాంఘై అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని