Biden: జీ20పై జిన్‌పింగ్ నిర్ణయం నిరాశపర్చింది: బైడెన్‌

జీ20 సదస్సుకు హాజరు కాకూడదని జిన్‌పింగ్‌ నిర్ణయించుకొన్నట్లు వస్తున్న వార్తలపై జోబైడెన్‌ నిరాశ వ్యక్తం చేశారు. అయినా.. తాను చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యేందుకు వెళుతున్నట్లు చెప్పారు.

Updated : 04 Sep 2023 10:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీ20కి హాజరుకాకూడదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Xi Jinping) తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ (Joe Biden) నిరాశ వ్యక్తం చేశారు. ఈ వారంలో జరగనున్న సదస్సుకు తన ప్రతినిధిగా చైనా ప్రీమియర్‌ లి కియాంగ్‌ను పంపాలని జిన్‌పింగ్‌ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై తాజాగా డేలావేర్‌లో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు  బైడెన్‌ స్పందిస్తూ.. ‘‘నేను నిరుత్సాహనికి గురయ్యాను.. కానీ, నేను ఆయనను కలిసేందుకు వెళుతున్నాను’’ అని ముక్తసరిగా పేర్కొన్నారు. కానీ, వీరి సమావేశం ఎక్కడ జరుగుతుందనే సమాచారం మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 7-10 మధ్యలో బైడెన్‌ జీ20 సదస్సు పర్యటన జరుగుతుంది. అనంతరం వియత్నాంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలపై బైడెన్‌ స్పందిస్తూ.. ఆయా దేశాలతో మరింత సమన్వయం చేసుకోవాల్సి ఉందన్నారు. అదే సమయంలో భారత్‌, వియత్నాం కూడా అమెరికాతో సంబంధాలను బలపర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు.  

ఎలిజబెత్‌-2కు శాశ్వత స్మారకం

వాస్తవానికి గతంలో తాను భారత్‌ వెళతానని జిన్‌పింగ్‌ వెల్లడించారు. కానీ, గురువారం చైనా విదేశాంగ శాఖ నిర్వహించిన సాధారణ ప్రెస్‌మీట్‌లో ఈ పర్యటనపై విలేకర్లు ప్రశ్నించగా.. కచ్చితంగా అధికారులు చెప్పలేకపోయారు. అదే సమయంలో జిన్‌పింగ్‌ ఈ ఏడాది జీ20కి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.

భారత్‌-చైనా సంబంధాలు బాగా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న సమయంలో జిన్‌పింగ్‌ గైర్హాజరు.. పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. గత వారం చైనా సరికొత్త మ్యాప్‌ను జారీ చేయడం ఇరు దేశాల మధ్య మరో వివాదాన్ని రాజేసింది. 

బైడెన్‌-జిన్‌పింగ్‌ గతేడాది బాలిలో జరిగిన సదస్సులో భేటీ అయ్యారు. వీరు ఈ ఏడాది నవంబర్‌లో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఆ నెలలో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆసియా-పసిఫిక్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ సదస్సు నిర్వహించనున్నారు. ఈ భేటీకి జిన్‌పింగ్‌ హాజరయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు