Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్‌

చైనా బెలూన్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) స్పందించారు. ఇది ఇరు దేశాల సంబంధాలపై చూపే ప్రభావం గురించి మాట్లాడారు. 

Published : 09 Feb 2023 11:25 IST

వాషింగ్టన్‌: బెలూన్‌ వ్యవహారం అమెరికా(US), చైనా(China) సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. గత ఏడాది జరిగిన జీ20 సదస్సులో భాగంగా తమ ద్వైపాక్షిక బంధాన్ని మెరుగుపర్చుకునేందుకు ఇరు దేశాలు చేసిన ప్రయత్నాలకు ఇది విఘాతం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden)ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 

‘మేం చైనాతో పోటీనే కోరుకుంటున్నాం. ఘర్షణ కాదు’ అని బైడెన్‌ వెల్లడించారు. అలాగే ఈ బెలూన్‌ ఘటన ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందా..? అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ ఉండదన్నారు. ‘చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ చాలా క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థికవ్యవస్థ ఒడుదొడుకుల్లో ఉంది. అయితే, ఆయన వాటిని తట్టుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. అలాగే తన దేశ వాణిజ్య అవసరాలను పరిరక్షించుకునే ప్రయత్నంలో పాశ్చాత్య దేశాలతో ఘర్షణ విషయంలో ఉన్న పరిమితులను ఆయన గుర్తించారు’ అని వెల్లడించారు.

ఇటీవల అమెరికా గగనతలంపై ఓ చైనా బెలూన్‌(Chinese Balloon) ఎగరడాన్ని అక్కడి రక్షణ విభాగం పెంటగాన్‌ గుర్తించింది. అమెరికాలోని అణు క్షిపణి స్థావరాలపై నిఘా పెట్టడంతోపాటు కీలక సమాచారాన్ని సేకరించేందుకే చైనా వీటిని ప్రయోగించినట్లు అమెరికా భావిస్తుండగా.. అది వాతావరణ పరిశోధన కోసం పంపిన బెలూన్‌ అని చైనా పేర్కొంది. అట్లాంటిక్ మహా సముద్రంలో యూఎస్‌ యుద్ధవిమానం దీనిని కూల్చివేసింది. దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌  చైనా (China) పర్యటనను వాయిదా వేసుకొన్నట్లు ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని