Death Valley: ప్రపంచంలోనే అత్యంత పొడి, వేడి ప్రాంతంలో ‘వాటర్‌ఫాల్స్‌’..!

ప్రపంచంలోనే అత్యంత పొడి, వేడి ప్రదేశంగా పేరుగాంచిన కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీలో (Death Valley) వాటర్‌వాల్స్‌కు దారితీసింది.

Published : 14 Sep 2022 01:46 IST

డెత్‌వ్యాలీలో కొనసాగుతోన్న ఆకస్మిక వరదలు

కాలిఫోర్నియా: అమెరికాలో హరికేన్‌ ‘కే’ పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. హరికేన్‌ అనంతరం కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత పొడి, వేడి ప్రదేశంగా పేరుగాంచిన కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీలో (Death Valley) వాటర్‌వాల్స్‌కు ఇవి దారితీశాయి. అటువంటి ప్రాంతంలో చోటుచేసుకున్న అరుదైన దృశ్యాన్ని పార్క్‌ అధికారులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి.

ఇటీవల సంభవించిన హరికేన్‌ కే అక్కడి డెత్‌ వ్యాలీ నేషనల్‌ పార్కులో ఆకస్మిక వరదలకు కారణమయ్యింది. ఈ తుపాను ధాటికి పార్కులోని రోడ్లు, భారీ వృక్షాలు దెబ్బతినడంతోపాటు వన్యప్రాణులకు నష్టం కలిగింది. మరోవైపు భారీ వర్షం కారణంగా బురదతో కూడిన నీరు కొండప్రాంతం నుంచి దిగువకు ప్రవహిస్తోంది. ఆ ప్రాంతంలో అత్యంత అరుదుగా సంభవించే ఇటువంటి జలపాత దృశ్యాలను పార్కు అధికారులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ప్రపంచంలోనే అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం అమెరికాలోని డెత్‌ వ్యాలీ (Death Valley). అమెరికాలోనే అత్యంత పొడి ప్రదేశమిది. ఏడాది సగటు వర్షపాతం అక్కడ కేవలం 2.2 అంగుళాలు మాత్రమే. కానీ, అటువంటి ప్రాంతంలోనూ ఇటీవల రికార్డుస్థాయి వర్షపాతం నమోదవుతోంది. ఆగస్టులో కొన్ని గంటల్లోనే 1.46 అంగుళాల వర్షపాతం నమోదుకాగా ఈ నెలలోనూ అదే పరిస్థితి. ఇలా ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలతో అత్యంత పొడి ప్రాంతంలోనూ (Death Valley) ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఆగస్టు నెలలో ఈ ప్రాంతంలో వరద బీభత్సంతో రహదారులు కొట్టుకుపోవడంతోపాటు జాతీయ పార్కులో పనిచేసే సిబ్బంది, వేలాది మంది పర్యాటకులు అందులో చిక్కుకుపోయారు.

భూమ్మీదనే  ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా కాలిఫోర్నియాలోని డెత్‌ వ్యాలీ (Death Valley) జాతీయ పార్కుకు గుర్తింపు ఉంది. అక్కడ గరిష్ఠంగా 128 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రతలు రికార్డవుతుంటాయి. అంతర్జాతీయ వాతావరణ సంస్థల నివేదిక ప్రకారం, ఇటీవల అక్కడ 130డిగ్రీల ఫారెన్‌హీట్‌ (54.4డిగ్రీ సెల్సియస్)కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని