Cancer: పేగు క్యాన్సర్‌ చికిత్స.. ఒక్క ఔషధంతో కణాలన్నీ మటుమాయం..!

అత్యంత ప్రమాదకరంగా మారిన పేగు (Rectal) క్యాన్సర్‌పై తాజాగా ఓ ఔషధం అద్భుత ఫలితాలు చూపిస్తున్నట్లు వెల్లడైంది.

Published : 08 Jun 2022 01:54 IST

అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏటా లక్షల మందిని బలి తీసుకుంటున్న ప్రాణాంతక క్యాన్సర్‌ను అణచివేసేందుకు ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అత్యంత ప్రమాదకరంగా మారిన పేగు (Rectal) క్యాన్సర్‌పై తాజాగా ఓ ఔషధం అద్భుత ఫలితాలు చూపిస్తున్నట్లు వెల్లడైంది. క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారందరిలోనూ క్యాన్సర్‌ కణాలు అదృశ్యమైపోయినట్లు అమెరికా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్‌ బాధితులతోపాటు వైద్య రంగంలో కొత్త ఆశలు కలిగిస్తోన్న ఈ ఔషధంపై భారీస్థాయిలో పరిశోధనలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

6 నెలల్లో కణాలు మటుమాయం

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షల మంది పేగు (Rectal) క్యాన్సర్‌ బారినపడుతున్నారు. బాధితులు సర్జరీలు చేయించుకున్నప్పటికీ క్యాన్సర్‌ కణాలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో క్యాన్సర్‌ కణాలను నాశనం చేసే డొస్టార్లిమాబ్‌ (Dostarlimab) ఔషధాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అనంతరం జరిపిన క్లినికల్‌ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు చూపించినట్లు గుర్తించారు. ప్రయోగాల్లో భాగంగా 18మంది రోగులకు ఆరు నెలలపాటు ఔషధాన్ని ఇవ్వగా.. కోర్సు పూర్తయ్యే నాటికి ప్రతిఒక్కరిలో క్యాన్సర్‌ కణాలు అదృశ్యమైనట్లు గుర్తించారు. ముఖ్యంగా ఎండోస్కోపీ, పెట్‌ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కానింగ్‌లోలనూ క్యాన్సర్‌ కణాల జాడ కనిపించలేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

క్యాన్సర్‌ చరిత్రలో తొలిసారి..

సాధారణంగా క్యాన్సర్‌ రోగులకు చికిత్సలో భాగంగా పలురకాల శస్త్రచికిత్సలతోపాటు కీమోథెరపీ, రేడియేషన్‌ వంటివి ఇస్తుంటారు. చికిత్స తర్వాత బాధితుల్లో జీర్ణాశయ, మూత్ర సంబంధ సమస్యలు కనిపిస్తాయి. కానీ, క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న 18 మందిలో ఈ సమస్యలేవీ కనిపించలేవు. అంతేకాదు, ఆరు నెలల తర్వాత ఏ ఒక్కరిలోనూ క్యాన్సర్‌ కణాలు కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీటితోపాటు ఇతర అవయవాలకు వ్యాధి వ్యాపించక పోవడంతోపాటు తదుపరి చికిత్స కూడా అవసరం లేదని పరిశోధకులు చెబుతున్నారు. వీటికి సంబంధించిన పరిశోధన నివేదిక ‘న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రచురితమైంది.

క్యాన్సర్‌ రోగుల క్లినికల్‌ ప్రయోగాల్లో డోస్టార్లిమాబ్‌ (Dostarlimab) ఔషధం చూపించిన ఫలితాలను అద్భుత పరిణామంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలా సంభవించడం క్యాన్సర్‌ చరిత్రలోనే తొలిసారి అని న్యూయార్క్‌ మెమోరియల్‌ స్లోవాన్‌ కెట్టెరింగ్‌ క్యాన్సర్‌ సెంటర్‌కు చెందిన డాక్టర్‌ లూయిస్‌ ఏ.డియాజ్‌ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం జరిపిన ప్రయోగాలు కేవలం కొద్దిమంది రోగుల్లోనే జరిగాయని.. అందరి రోగుల్లో ఇదే విధమైన ఫలితాలు వస్తాయో లేదనే విషయాన్ని తెలుసుకునేందుకు విస్తృత స్థాయిలో ప్రయోగాలు జరపాల్సి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని