PhonePe: నెంబర్‌ప్లేట్‌ స్థానంలో ఫోన్‌పే.. దీని సంగతేంటి?

కారువెనుక భాగంలో నెంబర్‌ప్లేట్‌కు బదులు ఫోన్‌పే ప్లేట్ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Updated : 13 Nov 2023 18:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాహనం ముందు, వెనుకభాగంలో నెంబర్‌ప్లేట్‌పై (Number Plate) రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ చూస్తుంటాం. కొందరు రవాణాశాఖ కార్యాలయంలో కొంత మొత్తం చెల్లించి.. తమకు కావాల్సిన లక్కీ నెంబర్లను కొనుక్కుంటారు. మరికొందరు.. కాస్త ట్రెండింగ్ కోసం నెంబర్‌ ప్లేట్‌పై అంకెలను వంకర్లు తిప్పుతుంటారు. కానీ, వీటన్నింటికీ భిన్నంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ కారు యజమాని నెంబర్‌ ప్లేట్‌ స్థానంలో.. ‘PhonePe’ అని ముద్రించుకున్నాడు. ఆ ఫొటోను సత్యన్‌ గజ్వానీ అనే వ్యక్తి ఎక్స్‌ ( ట్విటర్‌)లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

సత్యన్‌ గజ్వానీ ఆ ఫొటోను ట్వీట్‌ చేస్తూ.. ‘ఇది ప్రపంచ బ్రాండ్‌గా మారుతుందా’ అంటూ రాసుకొచ్చాడు. ఫోన్‌పే సీఈవో సమీర్‌ నిగమ్‌, ఫోన్‌పే అధికారిక ట్విటర్‌ ఖాతాలను కూడా ట్యాగ్‌ చేశాడు. ఈ పోస్టు కారు యజమాని గౌరవ్‌ లోచన్‌ దృష్టికి వెళ్లింది. సత్యన్‌ గజ్వానీకి ఆయన సమాధానమిస్తూ.. అది నెంబర్‌ప్లేట్‌ కాదని, తన వ్యక్తిగత ప్లేట్‌ అని చెప్పారు. గతేడాది అమెరికాలో తొలి ఫోన్‌పే కార్యాలయాన్ని ప్రారంభించానని, దానికి గుర్తుగా తన కారు వెనుకభాగంలో అలా ప్లేట్‌ పెట్టానని చెప్పుకొచ్చారు. ‘మీరు పని చేస్తున్న సంస్థపై నిజమైన నమ్మకంతో ఉంటే...’ అంటూ ఎవరైనా అలా పెట్టుకోవచ్చని పరోక్షంగా చెప్పారు.

దీనిపై ట్విటర్‌లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు గౌరవ్ లోచన్‌ ఆలోచనని మెచ్చకుంటుండగా.. కొందరు కారు రిజస్ట్రేషన్‌ నెంబర్‌కు సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌ను కూడా ముద్రించి ఉంటే బాగుండేదని సలహా ఇస్తున్నారు. మరోవైపు ఇలా వ్యక్తిగత నెంబర్‌ ప్లేట్లను పెట్టుకోవడాన్ని అమెరికా, కెనడాల్లో అనుమతిస్తారు. భారత్‌లో లక్కీ నెంబర్లను కొనుగోలు చేసినట్లే.. అక్కడ రవాణాశాఖకు కొంత మొత్తం చెల్లించి తమకు కావాల్సిన పేర్లపై వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. అయితే, నిబంధనలను కచ్చితంగా పాటించినప్పుడే ఆయా పేర్లను కేటాయిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని