China: యాంటీ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిన చైనా..!

చైనా యాంటీ బాలిస్టిక్‌ క్షిపణిని ఆదివారం రాత్రి విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. ఉపరితలంపై నుంచి ప్రయోగించే క్షిపణి సాయంతో ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపింది.

Published : 20 Jun 2022 12:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాంటీ బాలిస్టిక్‌ క్షిపణిని చైనా ఆదివారం రాత్రి విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. ఉపరితలంపై నుంచి ప్రయోగించే క్షిపణి సాయంతో ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపింది. పూర్తి ఆత్మరక్షణ కోసమే ఈ పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించింది. చైనా రక్షణ కోసం యాంటీ బాలిస్టిక్‌ మిసైల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది ఖండాంతర క్షిపణులు, ఇతర ప్రొజెక్టైల్స్‌ను అడ్డుకొంటుంది. 2010 నుంచి చైనా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తోంది. చైనా చేపట్టిన ఆరోపరీక్ష ఇది. గతంలో 2021 ఫిబ్రవరిలో నిర్వహించింది.

ఉత్తర కొరియా - దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్ష జరగడం గమనార్హం. అమెరికా ఈ ప్రాంతంలో దక్షిణ కొరియాతో కలిసి ఇటీవల క్షిపణి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2016లో దక్షిణ కొరియాపై ఉ.కొరియా దాడి చేస్తుందనే భయంతో టర్మినల్‌ హై ఆల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్‌ వ్యవస్థను మోహరించింది. ఈ విషయంలో చైనా-దక్షిణ కొరియా మధ్య విభేదాలు తలెత్తాయి. తమ జాతీయ భద్రతను ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ దెబ్బతీస్తుందని చైనా వాదించింది. ఇటీవల మేలో కూడా మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణుల మోహరింపుపై అమెరికాను చైనా విమర్శించింది. స్థానిక భద్రతను అగ్రరాజ్యం ప్రమాదంలో పడేస్తోందని మండిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని