China: రెండేళ్ల తర్వాత విమాన సర్వీసుల పునరుద్ధరణ.. భారత్‌కు అవకాశాలపై నీలినీడలు!

కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను చైనా పునరుద్ధరించనుంది.......

Published : 06 Jul 2022 00:35 IST

దిల్లీ: కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను చైనా పునరుద్ధరించనుంది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల క్వారంటైన్ ​గడువును సైతం సవరించింది. అంతకుముందు వారం రోజులు ఉండగా.. ప్రస్తుతం నిర్దేశిత హోటళ్లలో 3 రోజులు, ఇళ్లలో 2 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. అమెరికా సహా 125కు పైగా దేశాలతో విమాన సర్వీసులను క్రమబద్ధీకరణకు చైనా అంగీకారం తెలిపింది. దీంతో 2,025 విమానాల రాకపోకలు ఈ వారంలో ప్రారంభమవుతాయని చైనా పేర్కొంది.

అయితే, భారత్‌కు విమాన సర్వీసుల పునరుద్ధరణపై మాత్రం బీజింగ్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు. 2020 నవంబర్​ నుంచి చైనా, భారత్‌ మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. భారతీయ ఉద్యోగులు​, వారి కుటుంబాల వీసాలపై నిషేధం విధించడం వల్ల రెండేళ్లుగా వారు ఇక్కడే ఉంటున్నారు. అయితే గత నెలలో వారి వీసాలపై నిషేధం ఎత్తివేసినా.. విమాన సర్వీసులు పునరుద్ధరించపోవడం కారణంగా వారంతా తిరిగి చైనాకు వెళ్లలేకపోతున్నారు. అక్కడ చదివే 23వేల మందికిపైగా భారతీయ విద్యార్థులు కొవిడ్​వీసా నిబంధనలతో ఇక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం నిబంధనలను సడలించడంతో ఆ దేశానికి వెళ్లేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. పేర్లు ఇవ్వాలని చైనా కోరగా ఇప్పటికే వందల మంది జాబితాను ​భారత్ సమర్పించింది.

మరోవైపు శ్రీలంక, పాకిస్థాన్​, రష్యా లాంటి దేశాల విమానాలకు డ్రాగన్‌ అనుమతి ఇచ్చింది. దీంతో ఆయా దేశాల విద్యార్థులు ప్రత్యేక విమానాల్లో చైనాకు చేరుకుంటున్నారు. విమానాలు పునరుద్ధరించకపోవడం కారణంగా చైనాకు వెళ్లడం కష్టంగా మారిందని భారతీయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల మీదుగా ప్రయాణించడం వల్ల ఖర్చులు అధికమవుతాయని వాపోతున్నారు. విమానాల అనుమతిపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని