China: కెనడా ప్రధానిపై జిన్‌పింగ్‌ కోప్పడలేదు.. సమర్థించుకున్న చైనా

జి-20 సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో మాటల తూటాల వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బీజింగ్‌ తాజాగా వివరణ ఇచ్చింది.

Published : 17 Nov 2022 22:28 IST

బీజింగ్‌: ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగిన జి-20 సదస్సులో కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రుడోపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అందరి ముందే ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై చైనా స్పందించింది. ట్రుడోపై జిన్‌పింగ్‌ కోప్పడలేదని , వారిద్దరి మధ్య సాధారణ చర్చే జరిగిందని బీజింగ్‌ సమర్థించుకునే ప్రయత్నం చేసింది.

జి-20 సదస్సులో భాగంగా ట్రుడోపై జిన్‌పింగ్‌ కాస్త ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే.  ట్రూడోతో తన గత సమావేశానికి సంబంధించిన విషయాలు మీడియాలో వచ్చాయంటూ జిన్‌పింగ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది ఎంతమాత్రమూ సముచితంగా కాదని కెనడా ప్రధానితో కాస్త కోపంగా చెప్పారు. ‘‘చర్చలు జరిగే విధానం అది కాదు. నిజాయతీగా ఉంటేనే.. మనం సరిగ్గా మాట్లాడుకోగలం. లేదంటే ఫలితం గురించి చెప్పడం కష్టం’’ అని స్పష్టం చేశారు. జిన్‌పింగ్‌ ఆ మాటల్ని పూర్తి చేసేలోపే ట్రూడో అసహనంతో స్పందించారు. తాము స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్కపటంగా చర్చలు జరగాలని కోరుకుంటుంటామని చెప్పారు. మునుముందు కూడా అదే ధోరణిని కొనసాగిస్తామని నిక్కచ్చిగా పేర్కొన్నారు. దీంతో జిన్‌పింగ్‌ స్పందిస్తూ.. తొలుత షరతులు విధించుకుందామని ప్రతిపాదించారు. అనంతరం ఇద్దరు నేతలు కరచాలనం చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జి-20 సదస్సులో ఇరు నేతల మధ్య చిన్నపాటి సంభాషణ జరిగింది. అది పూర్తిగా సాధారణమైనదే. కెనడా ప్రధానిని జిన్‌పింగ్‌ విమర్శించడం లేదా నిందించినట్లుగా దాన్ని భావించడం సరికాదు. పారదర్శక చర్చలకే బీజింగ్‌ ఎల్లప్పుడూ మద్దతిస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కెనడా తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం’’ అని వివరించారు.

గత మంగళవారం జి-20 సదస్సులో భాగంగా జిన్‌పింగ్‌, ట్రుడో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం ఆ భేటీకి సంబంధించిన వివరాలు మీడియాలో బయటకు వచ్చాయి. ఆ భేటీలో కెనడా ఎన్నికల్లో చైనా ‘జోక్యం’ గురించి ట్రుడో.. జిన్‌పింగ్‌ వద్ద ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిపైనే జిన్‌పింగ్‌ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలపై చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్‌ స్పందిస్తూ.. ‘‘ఇతర దేశాల వ్యవహారాల్లో చైనా ఎన్నడూ జోక్యం చేసుకోదు’’ అని స్పష్టం చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని