Ukraine Crisis: రష్యాలో భారీ పేలుళ్లు..!

ఉక్రెయిన్‌ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న రష్యా నగరం బెల్‌గోరోడ్‌లో నేడు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం ముగ్గురు చనిపోయారు. పేలుడు

Published : 03 Jul 2022 11:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న రష్యా నగరం బెల్‌గోరోడ్‌లో నేడు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు మొత్తం 11 అపార్ట్‌మెంట్‌ భవనాలు, 39 నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడిని ఆ ప్రాంత గవర్నర్‌ గ్లాడికోవ్‌ ధ్రువీకరించారు. ఈ పేలుళ్ల కారణంగా ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను యాక్టివేట్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిపై ఉక్రెయిన్‌ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత నుంచి తరచూ ఈ విధంగా రష్యాలో ఏదో ఒక ప్రాంతంలో పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కీలకమైన మౌలిక వ్యవస్థలున్న ప్రదేశాల్లో ఇవి చోటు చేసుకోవడం గమనార్హం. 

రష్యాలో ఉక్రెయిన్‌ ‘షామన్‌’ రహస్య బెటాలియన్‌

ఉక్రెయిన్‌కు చెందిన స్పెషల్‌ కమాండో బృందాలు రహస్యంగా రష్యాలోకి చొరబడి కీలక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయని ఇటీవల ది టైమ్స్‌ పత్రిక కథనంలో పేర్కొంది. అత్యున్నత శ్రేణి శిక్షణ పొందిన షామన్‌ రహస్య దళాలు రష్యా కీలక ప్రదేశాలను ధ్వంసం చేయడంపై దృష్టిపెట్టినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌ దాడికి వినియోగిస్తోన్న ఆయుధాలు, నిర్మాణాలను గుర్తించి ధ్వంసం చేయడం ఈ బెటాలియన్‌ పని.  ఇప్పటి వరకు ఈ దళాలు రష్యా చమురు , ఆయుధ డిపోలు, కమ్యూనికేషన్‌ పరికరాలు వంటి వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించాయి.  

కఠిన శిక్షణ పూర్తి చేస్తేనే..

షామన్‌ బెటాలియన్‌లో చేరాలంటే శారీరక దారుఢ్యం తప్పనిసరి. శిక్షణలో భాగంగా డైవింగ్‌, పారాచూటింగ్‌, పర్వతారోహణ వంటి అంశాల్లో కఠిన శిక్షణ ఇస్తున్నారు. వీరిని రష్యాలో ఆపరేషన్లతోపాటు.. ఇంటెలిజెన్స్‌ సేకరణకు కూడా వినియోగిస్తున్నారు. ‘అడోనిస్‌’ లేదా ‘22’ అనే కాల్‌సైన్‌తో వీరిని వ్యవరిస్తుంటారు. రష్యా సరిహద్దులను దాటి ప్రధాన భూభాగం, నగరాల్లో ఈ బెటాలియన్‌ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

రష్యా ఎయిర్‌ డిఫెన్స్‌లకు అందకుండా హెలికాప్టర్లు..

షామన్‌ బెటాలియన్‌ను రష్యా భూభాగంలోకి చేర్చడానికి భూమికి తక్కువ ఎత్తులో ఎగిరే హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. రష్యా ఎయిర్‌ డిఫెన్స్‌లకు అనుమానం రాకుండా వీలైనంత సమీపంలోకి ఈ బెటాలియన్‌ సభ్యులను చేర్చడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. షామన్‌ బెటాలియన్‌ సభ్యులు పేలుళ్ల జరపడంలో సిద్ధహస్తులు కావడంతో రష్యా కీలక స్థావరాలను పేల్చేస్తున్నారు. ఇటీవల రష్యాలో చోటు చేసుకొన్న అనుమానాస్పద ఘటనల వెనుక ఈ బెటాలియన్‌ హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉక్రెయిన్‌ దళాలు ఇంత సాహసం చేస్తాయాని రష్యా అధికారులు కూడా నమ్మడంలేదు. దాడుల సమాచారం వెల్లడించే సమయంలో వారు కేవలం గుర్తుతెలియని గ్రూపు పనిగా అభివర్ణిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని