China: అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోబోమని జిన్‌పింగ్‌ హామీ..!

అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోబోమని చైనా హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికే జిన్‌పింగ్‌ స్వయంగా బైడెన్‌కు వెల్లడించారు. 

Updated : 31 Jan 2024 13:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికల్లో తమ దేశం జోక్యం చేసుకోబోదని చైనా (China) అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నుంచి జోబైడెన్‌కు హామీ లభించింది. ఈ విషయాన్ని ఆంగ్ల పత్రిక  సీఎన్‌ఎన్‌ కథనంలో పేర్కొంది. వీరిద్దరూ నవంబర్‌లో భేటీ అయిన సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకొంది. గత వారం బ్యాంకాక్‌లో 12 గంటల పాటు జరిగిన ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలోనూ మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. నాడు చైనా మంత్రి వాంగ్‌యీ మాట్లాడుతూ.. తాము అమెరికా ఎన్నికల్లో జోక్యానికి దూరంగా ఉంటామని పునరుద్ఘాటించారు.  

2016 అమెరికా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకొన్నట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. నాడు రష్యా ఇంటెలిజెన్స్‌ సంస్థలు డెమోక్రటిక్‌ నేషనల్‌ కమిటీకి చెందిన కీలక సమాచారాన్ని లీక్‌ చేశాయి. అధ్యక్ష రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్‌ ఆ దెబ్బతో ఓటమి పాలయ్యారు. నాటి నుంచి ఇరాన్‌, క్యూబా, చైనా ఏజెంట్లు తరచూ ఎన్నికల్లో జోక్యం చేసుకొంటున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. 

‘భారత్‌కు ముయిజ్జు క్షమాపణలు చెప్పాలి’: మాల్దీవుల విపక్షం డిమాండ్‌

చైనాకు బలమైన సైబర్‌ బలగం, సామర్థ్యాలున్నాయి. 2020 ఎన్నికల సమయంలో అమెరికా ప్రజలను ప్రభావితం చేసేలా తప్పుడు సోషల్‌ మీడియా ఖాతాలను సృష్టించాలని అప్పట్లో బీజింగ్‌ నుంచి ఆదేశాలు వెలువడినట్లు తెలిసింది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అమెరికాలో ఎఫ్‌బీఐ, జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ చర్యలు చేపట్టాయి. ఇటీవల చైనీస్‌ హ్యాకింగ్‌ యత్నాన్ని కూడా భగ్నం చేసినట్లు ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని