Taiwan Tensions: చైనా- తైవాన్‌ వివాదం.. ఎలాన్‌ మస్క్‌ పరిష్కారమిదే!

ఎలాన్‌ మస్క్(Elon musk)‌.. తాజాగా చైనా- తైవాన్‌ వివాద పరిష్కారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌పై కొంత నియంత్రణను బీజింగ్‌కు అప్పగించడం ద్వారా.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించవచ్చని ఆయన సూచనలు చేయడం గమనార్హం.

Published : 08 Oct 2022 20:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ సంక్షోభం(Ukraine Crisis) విషయంలో శాంతి ప్రణాళిక ప్రతిపాదనలు చేసి విమర్శల పాలైన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్(Elon musk)‌.. తాజాగా చైనా- తైవాన్‌ వివాద పరిష్కారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌పై కొంత నియంత్రణను బీజింగ్‌కు అప్పగించడం ద్వారా.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల(Taiwan Tensions)ను పరిష్కరించవచ్చని ఆయన సూచనలు చేయడం గమనార్హం. ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో భాగంగా చైనాపై అడిగిన ప్రశ్నకు మస్క్‌ ఈ మేరకు స్పందించారు.

‘తైవాన్‌ను ఒక ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్‌గా గుర్తించాలనేది నా సిఫార్సు. ఇది సహేతుకమైన చర్యే. బహుశా ఇది.. అందరినీ సంతోషపెట్టకపోవచ్చు. కానీ, సాధ్యమే. నిజానికి.. హాంకాంగ్ కంటే మరింత సౌమ్యమైన వ్యవస్థ కలిగి ఉండొచ్చని భావిస్తున్నా’ అని మస్క్ వ్యాఖ్యానించారు. తైవాన్‌ సంక్షోభం అనివార్యమని.. ఇది టెస్లా, యాపిల్ వంటి కంపెనీలు, ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మస్క్‌కు చెందిన విద్యుత్‌ కార్ల సంస్థ ‘టెస్లా’.. చైనాలోని షాంఘైలోనే తన అతిపెద్ద ఫ్యాక్టరీని నిర్వహిస్తోంది.

స్వయంపాలిత ‘తైవాన్‌’ తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది. అయితే, డ్రాగన్‌ వాదనలను తైవాన్ కొట్టిపారేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. కొన్నాళ్లుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు.. మస్క్ తాజా వ్యాఖ్యలపై స్పందించేందుకు తైవాన్ విదేశాంగ శాఖ నిరాకరించింది. తైవాన్‌ అధికారిక ‘డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ సీనియర్ శాసనసభ్యుడు వాంగ్ టింగ్ యు మాట్లాడుతూ.. 23 మిలియన్ల తైవాన్‌వాసుల ప్రజాస్వామ్యయుత స్వేచ్ఛ, సార్వభౌమాధికారంపై అజాగ్రత్తగా మాట్లాడటం తగదన్నారు.

ఇదిలా ఉండగా.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మస్క్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక ఇటీవల బెడిసికొట్టిన విషయం తెలిసిందే. ట్విటర్‌ వేదికగా ఆయన చేసిన ప్రతిపాదనలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సహా పలువురు ఉన్నతాధికారులు తిరస్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని