అమ్మకానికి ఓ గ్రామం.. దాదాపు రూ.2 కోట్లకే 44 ఇళ్లు..!

స్పెయిన్‌లోని సాల్టో డే కాస్ట్రో అనే గ్రామాన్ని విక్రయానికి ఉంచారు. కేవలం సుమారు రూ.2కోట్లకే గ్రామంలోని దాదాపు 44 ఇళ్లు సొంతం చేసుకోవచ్చనే ప్రకటనపై పలు దేశాలను ఆకర్షిస్తోంది. దీన్ని సొంతం చేసుకోవడానికి వందల మంది ఆసక్తి చూపుతుండటం విశేషం.

Updated : 24 Nov 2022 14:27 IST

మాడ్రిడ్‌: సొంతంగా ఓ ఇల్లు లేదా ఖరీదైన విల్లా కొనుగోలు చేయాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. అందుకోసం కొన్ని లక్షల రూపాయల నుంచి కోటి వరకు ఖర్చు పెట్టి తమ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో అదే డబ్బుతో ఏకంగా ఓ గ్రామాన్నే కొనొచ్చంటే.. అది నిజంగా ఆశ్చర్యమే కదా..! అవును. స్పెయిన్‌లోని ఓ గ్రామాన్ని ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు (Village for Sale). ధర కూడా అందుబాటులోనే. కేవలం 2,27,000 యూరోలకే (సుమారు రూ.2కోట్లు మాత్రమే) గ్రామం మొత్తం సొంతం చేసుకోవచ్చు.

స్పెయిన్‌లోని సాల్టో డే కాస్ట్రో (Salto de Castro) అనే గ్రామం పోర్చుగల్‌ సరిహద్దులో ఉంది. రాజధాని మాడ్రిడ్‌ నుంచి మూడు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. 1950ల్లో ఆ ప్రాంతంలో ఓ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ సమయంలో కార్మికుల కోసం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ నివాసాలు ఏర్పాటు చేసింది. అయితే, ఆ ప్రాజెక్టు పూర్తైన తర్వాత అక్కడివారంతా సమీప పట్టణాలకు తరలిపోవడం మొదలుపెట్టారు. ఇలా 1990 చివరి నాటికి ఆ ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. అక్కడ 44 ఇల్లు, ఓ హోటల్‌, చర్చి, పాఠశాల, స్విమ్మింగ్‌ పూల్‌తోపాటు ఇతర సదుపాయాలున్నాయి.

అయితే, ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 2000ల్లో ఆ గ్రామాన్నిఓ కుటుంబం కొనుగోలు చేసింది. కానీ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఆ ప్రణాళికను విజయవంతం చేయలేకపోయింది. దీంతో చివరకు ఆ గ్రామాన్ని విక్రయించాలని నిర్ణయించిన కుటుంబం.. స్పెయిన్‌కి చెందిన ప్రముఖ ప్రాపర్టీ వెబ్‌సైట్‌లో (Idealista)లో వివరాలను పొందుపరిచింది. పట్టణంలో నివాసముంటున్నందున ఈ గ్రామాన్ని విక్రయిస్తున్నానని ఆ గ్రామ యజమాని వివరించారు.

నవంబర్‌ తొలివారంలో ఆ ప్రకటన పోస్టు చేయగా.. భారీ స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50వేల మంది ఆ ప్రాపర్టీ వివరాలను చూడగా.. రష్యా, ఫ్రాన్స్‌, బెల్జియంతోపాటు బ్రిటన్‌కు చెందిన 300 మంది ఆ గ్రామాన్ని కొనేందుకు ముందుకు వచ్చినట్లు విక్రయానికి ఉంచిన సంస్థ ప్రతినిధి రోడ్రిగజ్‌ పేర్కొన్నారు. అయితే, గతంలోనూ ఈ గ్రామాన్ని అమ్మకానికి పెట్టినప్పటికీ భారీ ధర ఉండటంతో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈసారి మాత్రం మార్కెట్‌ విలువ అంచనా వేసి ధర నిర్ణయించడంతో ఈ గ్రామాన్ని సొంతం చేసుకునేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని