Nobel for Zelensky: జెలెన్‌స్కీకి నోబెల్‌.. నామినేషన్‌ కోసం ప్రయత్నాలు ముమ్మరం!

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేయాలనే ప్రతిపాదనలు మొదలయ్యాయి.

Published : 19 Mar 2022 01:31 IST

నోబెల్‌ కమిటీకి యూరోపియన్‌ నేతల విజ్ఞప్తి

కీవ్‌: ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆయుధ సంపత్తి కలిగిన రష్యా చేస్తోన్న సైనిక చర్యను ఉక్రెయిన్‌ సేనలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రష్యా వ్యూహాలకు అందని విధంగా ఉక్రెయిన్‌ సైన్యం చేస్తోన్న పోరాటం తీరు యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. భీకర దాడులతో రష్యా సేనలు వణికిస్తున్నప్పటికీ తమ పౌరుల వెంటే ఉన్నానంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఆ దేశ పౌరులకు మద్దతుగా నిలుస్తుండడం  ఆయనను నిజమైన హీరోగా నిలబెడుతోంది. ఓవైపు ప్రపంచ దేశాల సాయం కోరుతూనే.. మరోవైపు యుద్ధానికి ముగింపు పలకాలని శత్రుదేశంతో చర్చలు కొనసాగిస్తున్న ప్రయత్నాలు దేశాధినేతలను కదిలిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేయాలనే ప్రతిపాదనలు మొదలయ్యాయి. అయితే, ఈ ఏడాది పురస్కారాల కోసం దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసిపోవడంతో జెలెన్‌స్కీ కోసం దాన్ని పొడగించాలని కోరుతూ యూరోపియన్‌ నేతల నుంచి విజ్ఞప్తులు ఎక్కువయ్యాయి.

‘నోబెల్‌ శాంతి బహుమతికి జెలెన్‌స్కీ నామినేషన్‌ అనుమతించేందుకు గానూ నామినేషన్‌ విధానం, దరఖాస్తు ప్రక్రియను పునఃపరిశీలించండి. ఇందుకోసం దరఖాస్తు తేదీని మార్చి 31, 2022 వరకు పొడిగించండి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు, ఆ దేశ ప్రజల కోసం నోబెల్‌కు దరఖాస్తు చేసుకునే అంశాన్ని పరిగణనలోకి తీసుకోండి’ అని నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీకి విజ్ఞప్తి చేస్తూ యూరోపియన్‌ నేతలు లేఖ రాశారు. అయితే, 2022 నోబెల్‌ బహుమతి కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో దాన్ని తిరిగి తెరవాలని యూరప్‌ నేతలు కోరుతున్నారు. ఇక ఈ ఏడాది నోబెల్‌ బహుమతుల ప్రదానోత్సవం అక్టోబర్‌ 3నుంచి 10 తేదీల్లో జరుగనుండగా.. ఒక్క నోబెల్‌ శాంతి బహుమతి కోసమే ప్రపంచ వ్యాప్తంగా 251 మంది వ్యక్తిగతంగా, 92 సంస్థలూ దరఖాస్తు చేసుకున్నాయి.

ఇదిలాఉంటే, సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దండయాత్రను ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక, సాంకేతిక ఆంక్షలతో రష్యాను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ రష్యా చేస్తోన్న భీకర దాడులను ఉక్రెయిన్‌ సేనలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో దాదాపు 14వేల మంది రష్యా సేనలను అంతం చేసినట్లు పేర్కొన్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌ కూడా భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని