Ukraine: పేలుళ్లతో దద్దరిల్లిన ఉక్రెయిన్‌ రాజధాని..!

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ ఆదివారం పేలుళ్లతో దద్దరిల్లింది. దాదాపు కొన్ని వారాల వ్యవధి తర్వాత ఈ స్థాయి దాడిని కీవ్‌ చవిచూసింది. దీంతో నగరంలోని పలు భవనాల నుంచి నల్లటి పొగ వెలువడుతోంది.

Published : 05 Jun 2022 18:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ ఆదివారం పేలుళ్లతో దద్దరిల్లింది. దాదాపు కొన్ని వారాల వ్యవధి తర్వాత ఈ స్థాయి దాడిని కీవ్‌ చవిచూసింది. దీంతో నగరంలోని పలు భవనాల నుంచి నల్లటి పొగ వెలువడుతోంది. ఈ దాడుల్లో కనీసం ఒకరు గాయపడినట్లు ప్రాథమిక వార్తలతో తెలుస్తోంది. మరోపక్క డాన్‌బాస్‌ ప్రాంతంలోని సెవీరోడొనెట్స్క్‌ నగరంలో హోరాహోరీ పోరాటం జరుగుతోంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ ఆ నగరంలో పరిస్థితి అత్యంత సంక్లిష్ఠంగా ఉందని పేర్కొన్నారు. 

లుహాన్స్క్‌ ప్రాంతం చాలా వరకు రష్యా దళాలు, స్థానిక వేర్పాటువాద దళాల స్వాధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో  సెవీరోడొనెట్స్క్‌, ఇతర నగరాల్లో రష్యా బలగాలు నిరంతరాయం దాడులు యుద్ధవిమానాలు, శతఘ్నులతో దాడులు చేస్తూనే ఉన్నాయి. అయినా కానీ ఉక్రెయిన్‌ దళాలు కొన్ని చోట్ల మొండిగా పోరాడుతున్నాయని జెలెన్‌స్కీ వెల్లడించారు. పశ్చిమ దేశాలు అందించే అత్యాధునిక ఆయుధాల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. మరోపక్క ఉక్రెయిన్‌ ఇతర ప్రాంతాల నుంచి సరఫరాలు డాన్‌బాస్‌ ప్రాంతానికి చేరకుండా రష్యా బలగాలు కీలక వంతెలను పేల్చేశాయి. 

తాజాగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ప్రజల జీవనం సాధారణ  స్థాయికి వచ్చిన తర్వాత ఈ దాడులు మళ్లీ జరగడం విశేషం.  కానీ, నేడు ఉదయం అక్కడి ప్రజలు నిద్రలేచే సమయానికి నగరం మొత్తం నల్లటి పొగకమ్ముకొని ఉంది. ఆ నగరం ఇప్పటికీ యుద్ధం అంచున్న ఉందన్న విషయాన్ని వారికి గుర్తు చేసింది. తూర్పు ఐరోపా దేశాలు సరఫరా చేస్తున్న ట్యాంకులను లక్ష్యంగా చేసుకొని రష్యా అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణుల దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని