Updated : 07 Jul 2022 16:53 IST

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌.. ఆయన గురించి తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: అన్నీ అనుకున్నట్లు జరిగితే బ్రిటన్‌ పాలనా పగ్గాలు భారత సంతతి వ్యక్తి చేతుల్లోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. వరుస వివాదాల్లో చిక్కుకున్న ప్రస్తుత ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఎట్టకేలకు అధికార పీఠం నుంచి దిగిపోయేందుకు అంగీకరించారు. నేడో, రేపో ఆయన రాజీనామా చేయనున్నారు. దీంతో తదుపరి ప్రధాని ఎవరా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ పేరు వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే బ్రిటన్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించే అవకాశముంది. మరి ఈ సందర్భంగా రిషి సునాక్‌ గురించి కొన్ని విశేషాలు..

పూర్వీకులది పంజాబ్‌..

రిషి సునాక్‌ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. ఆయన పూర్వీకులు పంజాబ్‌కు చెందిన వారు. వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్‌వీర్‌ కెన్యాలో.. తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలసవెళ్లాక వివాహం చేసుకున్నారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేసిన రిషి.. తొలుత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాతో పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

బోరిస్‌ మెప్పుతో మంత్రిగా..

చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్‌ పార్టీలో కొంతకాలం ఇంటర్నిష్‌ చేశారు. ఆ తర్వాత 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి రిషి విజయం సాధించారు. 2019లో జరిగిన కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో రిషి.. బోరిస్‌ జాన్సన్‌కు మద్దతిచ్చారు. దీంతో బోరిస్‌ ప్రధానిగా ఎన్నికైన తర్వాత రిషికి ఆర్థిక శాఖలో చీఫ్‌ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించారు. బోరిస్‌ జాన్సన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా సునాక్‌కు పేరుంది. తన వ్యక్తిత్వం, దూకుడు శైలితో ‘రైజింగ్‌ స్టార్‌’ మినిస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సునాక్ పనితీరుకు మెచ్చి 2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్‌గా పదోన్నతి కల్పించారు. కేబినెట్‌లో పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా చేరింది అప్పుడే. అదే ఏడాది మార్చిలో సునాక్‌ పార్లమెంట్‌లో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. హిందువైన సునాక్‌.. పార్లమెంట్‌లో ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేశారు.

కరోనా సమయంలో పాపులారిటీ..

కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేలా బిలియన్‌ పౌండ్ల విలువ చేసే అత్యవసర పథకాలను సునక్‌ ప్రకటించారు. వ్యాపారులు, ఉద్యోగుల కోసం కూడా అనేక ఆకర్షణీయ పథకాలు, ఉద్దీపనలు తీసుకొచ్చారు. దీంతో పాటు పార్లమెంటులో ఆయన పనితీరు, పాలసీల రూపకల్పనతో బ్రిటన్‌ ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. అప్పట్లో ఆయన ఫొటోలు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న సమయంలో ప్రధాని బోరిస్‌ తన సహచరులతో కలిసి నిబంధనలు విరుద్ధంగా పార్టీ చేసుకోవడం బ్రిటన్‌ రాజకీయాలను తీవ్రంగా కుదిపేసింది. జాన్సన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడమే గాక, ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపించాయి. ఒకవేళ బోరిస్‌ దిగిపోవాల్సి వస్తే.. తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఆ సమయంలో రిషికి ఉన్న పాపులారిటీతో ఆయన పేరు పీఎం రేసులో ఎక్కువగా వినిపించింది.

సతీమణి పన్ను వివాదం..

ఆ మధ్య రిషి సతీమణి అక్షతా మూర్తిపై వచ్చిన పన్ను ఎగవేత ఆరోపణలు సునాక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. అక్షత బ్రిటన్‌లో ‘నాన్‌-డొమిసైల్‌’ హోదాలో నివసిస్తున్నారు. ఆమెకు ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్‌లో ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదా ఇస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో తాము ఆర్జించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టక్కర్లేదు. ఈ హోదాను అడ్డుపెట్టుకొని అక్షత.. పన్ను ఎగవేస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ. అయితే తాము చట్టప్రకారం బ్రిటన్‌లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నానని అక్షతా మూర్తి ప్రతినిధి అప్పట్లో తెలిపారు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపడంతో అక్షతా మూర్తి స్పందించారు. ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదా చట్టబద్ధమేనని తెలిపారు. అయినప్పటికీ.. విదేశాల్లో పొందిన ఆర్జనపై పన్ను నుంచి మినహాయింపునిస్తున్న ఈ నిబంధనల నుంచి ఇక ఏమాత్రం ప్రయోజనం పొందబోనని స్పష్టం చేశారు. తన భర్త పదవికి ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

విమర్శలూ లేకపోలేదు..

కరోనా సంక్షోభం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సునాక్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కరోనా విజృంభణ సమయంలో ప్రజలు, ఉద్యోగులకు అండగా ఉండేందుకు అనేక పథకాలను ప్రకటించిన ఆయన.. తర్వాత ఖజానాపై భారం పడకుండా కొన్ని వర్గాలపై పన్నులు పెంచారు. దీనికి ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోయాయి. ఓవైపు పన్నుల పెంపు.. మరోవైపు ధరల పెరుగుదల ప్రజల్లో అసహనానికి కారణమైంది. దీనికి రిషి నిర్ణయాలే కారణమని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.

రేసులో మరికొందరు..

తదుపరి ప్రధాని రేసులో రిషి సునాక్‌తో పాటు వాణిజ్య మంత్రి పెన్నీ మార్డాంట్‌ ముందంజలో ఉన్నారు. వీరితో పాటు రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, మాజీ ఆరోగ్య మంత్రి సాజిద్‌ జావిద్‌, ఆర్థికమంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నదీమ్‌ జహావీ, మాజీ విదేశాంగ మంత్రి జెరెమీ హంట్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బోరిస్‌ జాన్సన్‌పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ రిషి సునాక్‌ ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత వరుసగా మంత్రుల రాజీనామాల పరంపర కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని పేరులో సునాక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని