Flight Missing: 22 మంది ఉన్న విమానం అదృశ్యం.. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు

నేపాల్‌లో తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఆచూకీ గల్లతైంది.

Updated : 29 May 2022 15:55 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌లో ఓ విమానం ఆచూకీ గల్లంతైంది. తారా ఎయిర్​లైన్స్​ 9 ఎన్ఏఈటీ ట్విన్​ఇంజిన్ విమానం ఈ ఉదయం పొఖారా నుంచి జామ్‌సోమ్‌కు బయలుదేరింది. 9:55 గంటల సమయంలో ఏటీసీతో విమానానికి సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానంలో సిబ్బంది సహా మొత్తం 22 మంది ఉన్నట్లు నేపాల్‌ అధికారిక మీడియా వెల్లడించింది. వీరిలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్‌వాసులు కాగా.. మిగిలిన వారు నేపాల్‌ పౌరులు.

ముస్తాంగ్‌ ప్రాంతంలోని జామ్‌సోమ్‌లో గాల్లో ఉండగా విమానం చివరిసారి కనిపించిందని.. తర్వాత దాన్ని దౌలగిరి పర్వతం వైపు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. కొద్దిసేపటికే సంబంధాలు తెగిపోయి ఆచూకీ గల్లంతైనట్లు వివరించారు. గాలింపు కోసం రెండు హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు ముస్తాంగ్‌ జిల్లా డీఎస్పీ రామ్‌ కుమార్‌దని తెలిపారు. నేపాల్‌ సైనిక హెలికాప్టర్‌ ఎంఐ-17ని కూడా సెర్చ్‌ ఆపరేషన్‌కు పంపినట్లు నేపాల్‌ ఆర్మీ అధికార ప్రతినిధి నారాయణ్‌ సిల్వాల్‌ వెల్లడించారు.

గల్లంతయిన నలుగురు భారతీయులను అశోక్‌ కుమార్‌ త్రిపాఠి, ధనుష్‌ త్రిపాఠి, రితికా త్రిపాఠి, వైభవి త్రిపాఠీలుగా గుర్తించారు. ఘటనపై వీరి కుటుంబాలకు సమాచారం అందించినట్లు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని