మీ సాయం ప్రపంచ భద్రతకు పెట్టుబడి

ఉక్రెయిన్‌కు అమెరికా అందజేసే నిధులు, ఆయుధాలు విరాళం కాదని.. అది ప్రపంచ భద్రతకు పెట్టుబడి అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.

Published : 23 Dec 2022 06:03 IST

యుద్ధం అంతానికి రాజీ పడేది లేదు
అమెరికా కాంగ్రెస్‌లో జెలెన్‌స్కీ

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌కు అమెరికా అందజేసే నిధులు, ఆయుధాలు విరాళం కాదని.. అది ప్రపంచ భద్రతకు పెట్టుబడి అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన బుధవారం కాంగ్రెస్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘మీ డబ్బు విరాళం కాదు.. ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యాలకు పెట్టుబడి. నేను ఇక్కడ ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఉక్రెయిన్‌ కుప్పకూలదు. సజీవంగానే ఉండి పోరాడుతుంది. రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఎటువంటి రాజీ పడేది లేదు. మా దేశం ఎప్పటికీ లొంగిపోదు. యుద్ధ పర్యవసానాలు మా దేశ విధిరాత కంటే తీవ్రమైనవి. అవి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పరీక్షిస్తున్నాయి. ప్రపంచం దృష్టిలో మేము రష్యాను ఓడించాము. శాంతి కోసం మేము చేస్తున్న ప్రయత్నాలకు బైడెన్‌ సహకరించారు. ఆయనకు, అమెరికా నేతలు, పౌరులకు కృతజ్ఞతలు’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌ ఒంటరిది కాదు: బైడెన్‌

రష్యాతో యుద్ధం ఎన్నాళ్లు కొనసాగినా.. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌ ఎప్పటికీ ఒంటరిది కాదని పేర్కొన్నారు. రెండు బిలియన్‌ డాలర్ల సరికొత్త ప్యాకేజీని ధ్రువీకరించారు. జెలెన్‌స్కీ తన పర్యటనలో భాగంగా శ్వేతసౌధంలో బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో బైడెన్‌ మాట్లాడుతూ.. మిత్రపక్షాలను కలిపి ఉంచడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కొంత మంది మిత్రులు యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన, ఆహార కొరత కారణంగా ఇబ్బందికి గురవుతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన ఈ విధంగా స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని