China: 2023లో చైనా ముందు కఠిన సవాళ్లు

చైనాలో దేశమంతటా వ్యాప్తి చెందిన కొవిడ్‌ - 19 తాజా ఉద్ధృతి కొత్త సవాళ్లు విసురుతున్నట్లు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అంగీకరించారు.

Updated : 01 Jan 2023 09:52 IST

కొవిడ్‌ ఉద్ధృతిపై షీ జిన్‌పింగ్‌ ఆందోళన

బీజింగ్‌: చైనాలో దేశమంతటా వ్యాప్తి చెందిన కొవిడ్‌ - 19 తాజా ఉద్ధృతి కొత్త సవాళ్లు విసురుతున్నట్లు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అంగీకరించారు. భారత్‌తోపాటు పలు దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ప్రబలిన కొవిడ్‌ వేరియంట్లపై మరింత సమాచారం కావాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డ్రాగన్‌ దేశాన్ని కోరింది. ఈ పరిస్థితుల్లో కొత్త సంవత్సరాది ప్రారంభ వేళ జాతీయ టెలివిజన్‌లో జిన్‌పింగ్‌ మాట్లాడారు. ఇప్పటిదాకా అసాధారణ ప్రయత్నాలతో చైనా ఎన్నో ఇబ్బందులను అధిగమించిందని చెప్పారు. ‘కొవిడ్‌-19ను ఎదుర్కోవడంలో మనం ఇపుడు కొత్తదశలోకి ప్రవేశించాం. కఠిన సవాళ్లు ముందున్నాయి. ఈ ప్రయాణం అంత సులభం కాదు’ అన్నారు. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల తీవ్రత గురించి ఆయన ఇంతకుమించి వివరాలు వెల్లడించలేదు. ‘ఈ మహమ్మారి ప్రబలినప్పటి నుంచీ ప్రజల జీవితాలు, ఆరోగ్య సంరక్షణకే అధిక ప్రాధాన్యం ఇచ్చాం. శాస్త్రీయ విధానాలతో కొవిడ్‌ను ఎదుర్కొన్నాం. అధికారులు ఈ దిశగా ఎంతో ధైర్యం ప్రదర్శించి పని చేశారు. ఇపుడు విశ్వాసమనే ఓ కాంతిరేఖ ముందుంది. పట్టుదల, ఐకమత్యంతో మరింత శ్రమించి విజయం సాధిద్దాం’ అని జిన్‌పింగ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.


పశ్చిమ దేశాల వంచన, దూకుడు తగ్గాలి : పుతిన్‌

మాస్కో: ఉక్రెయిన్‌లోని సంఘర్షణను ఉపయోగించుకొని మాస్కోను అణగదొక్కాలని చూస్తున్న పశ్చిమ దేశాలు తమ వంచన, దుందుడుకు వైఖరిని తగ్గించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ డిమాండ్‌ చేశారు. కొత్త సంవత్సర ప్రారంభ వేళ పుతిన్‌ ప్రసంగించిన వీడియో ఒకటి శనివారం రష్యా స్టేట్‌ టెలివిజన్‌లో ప్రసారమైంది. వెనుక సైనికులు నిలబడి ఉండగా చేసిన ఈ ప్రసంగం మిలటరీ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి చేసినట్టుగా ఉంది. 2022ని రష్యాకు క్లిష్టమైన ఏడాదిగా పేర్కొన్న పుతిన్‌ తమ భద్రతను సవాలు చేసినందునే ఉక్రెయిన్‌కు బలగాలను తరలించాల్సి వచ్చిందని పునరుద్ఘాటించారు. ‘2022లో మా మీద నిజమైన ఆంక్షల యుద్ధాన్ని ప్రకటించారు. వారి ఉద్దేశం మా పరిశ్రమలు, ఆర్థికవ్యవస్థ, రవాణా వ్యవస్థ కుప్పకూలడం. కానీ, అలా జరగలేదు’ అని పుతిన్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని