రష్యాలో ఉంటే మిమ్మల్ని మేం రక్షించలేం

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ఏడాది సమీపిస్తోన్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. వెంటనే ఆ దేశాన్ని వీడాలని తమ పౌరులకు సూచించింది.

Published : 14 Feb 2023 06:16 IST

తక్షణం దేశం విడిచి వెళ్లండి
తమ పౌరులను హెచ్చరించిన అమెరికా

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ఏడాది సమీపిస్తోన్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. వెంటనే ఆ దేశాన్ని వీడాలని తమ పౌరులకు సూచించింది. ఉక్రెయిన్‌లో తీవ్రతరమవుతోన్న దాడులతోపాటు రష్యా భద్రతాసంస్థల నుంచి ఏకపక్ష అరెస్టులు, వేధింపుల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ‘‘రష్యాలో నివసిస్తున్న లేదా పర్యటిస్తోన్న అమెరికా జాతీయులు వెంటనే దేశాన్ని వీడి బయలుదేరాలి’ అని మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. మాస్కోకు దూరంగా ఉన్న పౌరుల భద్రతను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో  పర్యవేక్షించలేమని, ఏదైనా ముప్పు ఎదురైనా రక్షించలేమని పేర్కొంది. తప్పుడు నిర్బంధాల అవకాశం నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. దీంతోపాటు అమెరికన్లను రష్యాకు వెళ్లొద్దని పేర్కొంది. గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే అనుమానంతో అమెరికా పౌరుడిపై క్రిమినల్‌ కేసు ప్రారంభించినట్లు రష్యాకు చెందిన ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ఇటీవల తెలిపిన వేళ తాజా ప్రకటన వచ్చింది. ‘రష్యన్‌ భద్రతాసంస్థలు కొంతమంది అమెరికా పౌరులను తప్పుడు ఆరోపణలపై అరెస్టు చేశాయి. అమెరికన్లను నిర్బంధించడంతోపాటు వేధింపులకు పాల్పడుతున్నాయి. పైగా, వారికి న్యాయమైన, పారదర్శకమైన సేవలను అందించేందుకు నిరాకరించాయి. సరైన సాక్ష్యాలు సమర్పించకుండానే రహస్య విచారణల్లో వారిని దోషులుగా తేల్చాయి’ అని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ముఖ్యంగా అమెరికన్‌ మత బోధకులను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాను విడిచి వెళ్లాలని అమెరికా తన పౌరులను గతంలోనూ పలుమార్లు హెచ్చరించింది. చివరగా గతేడాది సెప్టెంబరులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సైనిక సమీకరణకు ఆదేశించిన సమయంలో ఈ మేరకు ప్రకటన చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని