Britian: ముగ్గురి డీఎన్‌ఏలతో ముద్దుల చిన్నారులు!

వంశపారంపర్యంగా వచ్చే కొన్ని అరుదైన జన్యువ్యాధులను నివారించడం ద్వారా ఆరోగ్యవంతమైన చిన్నారుల జననానికి దోహదపడే ప్రయోగాత్మక విధానాన్ని బ్రిటన్‌ పరిశోధకులు తాజాగా విజయవంతంగా అమలుపరిచారు.

Updated : 11 May 2023 11:03 IST

బ్రిటన్‌ చరిత్రలో తొలిసారి జననం
‘మైటోకాండ్రియా దానం’ విధానంలో సాకారం

లండన్‌: వంశపారంపర్యంగా వచ్చే కొన్ని అరుదైన జన్యువ్యాధులను నివారించడం ద్వారా ఆరోగ్యవంతమైన చిన్నారుల జననానికి దోహదపడే ప్రయోగాత్మక విధానాన్ని బ్రిటన్‌ పరిశోధకులు తాజాగా విజయవంతంగా అమలుపరిచారు. తమ దేశ చరిత్రలో తొలిసారిగా.. ముగ్గురు వ్యక్తుల డీఎన్‌ఏను పంచుకుంటూ శిశువులు జన్మించేలా చేశారు. ‘మైటోకాండ్రియా దానం’ అనే వినూత్న విధానాన్ని ఇందుకు ఉపయోగించారు. బ్రిటన్‌లోని ‘మానవ ఫలదీకరణ, పిండోత్పత్తి ప్రాధికార సంస్థ’ బుధవారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ విధానంలో ఎంతమంది శిశువులు పుట్టారన్న సంగతిని స్పష్టంగా వెల్లడించలేదు. వారి సంఖ్య 5 కంటే తక్కువ అని మాత్రమే పేర్కొంది. ఆయా కుటుంబాల గోప్యతను పరిరక్షించేందుకే పూర్తి వివరాలు బయటపెట్టడం లేదని తెలిపింది.

కణ శక్తి భాండాగారాల్లో లోపంతో..

కణాల్లోని అత్యంత కీలక భాగాల్లో మైటోకాండ్రియా ఒకటి. దాన్ని ‘కణ శక్తి భాండాగారం’ అని పిలుస్తారు. కొంతమంది మహిళల్లో జన్యుపరమైన సమస్యల కారణంగా మైటోకాండ్రియాలు సరిగా పనిచేయవు. ఆ పరిస్థితిని ‘ఫాల్టీ మైటోకాండ్రియా’గా పిలుస్తారు. అలాంటి మహిళల సంతానానికీ.. వంశపారంపర్యంగా జన్యులోపాలు సంక్రమిస్తాయి. వాటివల్ల కండరాల బలహీనత, మూర్చ వంటి వ్యాధులతో పాటు గుండె సమస్యలు, మేధోపరమైన వైకల్యాలు తలెత్తుతుంటాయి. బ్రిటన్‌లో దాదాపుగా ప్రతి 200 మంది చిన్నారుల్లో ఒకరు ఈ మైటోకాండ్రియా సంబంధిత రుగ్మతతో జన్మిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


ఏమిటీ ప్రయోగాత్మక విధానం?

ఫాల్టీ మైటోకాండ్రియాతో బాధపడుతున్న మహిళల సంతానానికి ఇబ్బందులు తలెత్తకుండా నివారించేందుకు పరిశోధకులు వినూత్న విధానాన్ని ఆవిష్కరించారు. ఇందులో తొలుత బాధిత మహిళ అండం నుంచి జన్యుపదార్థాన్ని సేకరిస్తారు. ఆ పదార్థాన్ని దాత అండంలో ప్రవేశపెడతారు. అంతకుముందే- దాత అండం నుంచి కీలక జన్యుపదార్థాన్ని తొలగిస్తారు. ఆరోగ్యవంతమైన మైటోకాండ్రియాను (ఇందులోనూ దాత డీఎన్‌ఏ కొంత ఉంటుంది) మాత్రం అందులోనే ఉంచుతారు. ఆపై అండాన్ని ఫలదీకరణం చెందించి.. తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. ఈ విధానంలో జన్మించే శిశువులో దాతకు సంబంధించిన జన్యుపదార్థం 1% కంటే తక్కువే ఉంటుంది. తండ్రితో కలిపితే మొత్తంగా ముగ్గురి డీఎన్‌ఏ శిశువులో ఉంటుందన్నమాట.

* మైటోకాండ్రియా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలు ఈ విధానం ద్వారా ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందొచ్చు. అయితే వంశపారంపర్యంగా వచ్చే లోపాలను అధిగమించేందుకు ఇతర మార్గాలేవీ అందుబాటులో లేనప్పుడు మాత్రమే బాధితులకు ఈ సాంకేతికతను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తామని బ్రిటన్‌ పరిశోధకులు చెబుతున్నారు. ఈ విధానంలో జన్మించే పిల్లలకు భవిష్యత్తులో తిరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియదని పలువురు నిపుణులు పేర్కొన్నారు. మైటోకాండ్రియా దానం విధానంలో ప్రపంచంలో తొలి శిశువు జన్మించినట్లు 2016లోనే అమెరికా ప్రకటించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని