రక్షణ రంగంలో భారత్‌, అమెరికా చెట్టపట్టాల్‌

రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా భారత్‌, అమెరికా తాజాగా ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నాయి.

Published : 06 Jun 2023 04:55 IST

 కీలక ఉత్పత్తుల సంయుక్త అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక  
రాజ్‌నాథ్‌తో లాయిడ్‌ ఆస్టిన్‌ భేటీలో ఖరారు

దిల్లీ: రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా భారత్‌, అమెరికా తాజాగా ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నాయి. ఈ ప్రణాళికలో భాగంగా పలు మిలిటరీ ప్లాట్‌ఫాంలు, హార్డ్‌వేర్‌లను సంయుక్తంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో ప్రస్తుత పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత పర్యటనకు వచ్చిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌... రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో దిల్లీలో సోమవారం సమావేశమయ్యారు. రక్షణ రంగంలో పరస్పర సహకారంపై వారు విస్తృతంగా చర్చలు జరిపారు. రక్షణ పారిశ్రామిక సహకారంపై ప్రత్యేక ప్రణాళికను ఈ భేటీలో వారు ఖరారు చేశారు. అనంతరం సంబంధిత వివరాలను విలేకర్ల సమావేశంలో ఆస్టిన్‌ వెల్లడించారు. ‘‘ఇండో-పసిఫిక్‌లో స్వేచ్ఛాయుత వాతావరణానికి భారత్‌-అమెరికా భాగస్వామ్యం మూలరాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం పెరుగుతుండటం అంతర్జాతీయంగా శుభ పరిణామం. ఈ నేపథ్యంలో రాబోయే కొన్నేళ్లపాటు పలు ప్రాజెక్టుల సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి కోసం ప్రతిష్ఠాత్మక రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నాం. దీనివల్ల ఇరు దేశాల రక్షణ పారిశ్రామిక బంధం మరింత బలపడుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీ కోసం భారత్‌తో సాంకేతికతను పంచుకునేలా ‘జనరల్‌ ఎలక్ట్రిక్‌’ చేసిన ప్రతిపాదనపై రాజ్‌నాథ్‌తో భేటీలో ఆస్టిన్‌ చర్చించారు. అమెరికా కంపెనీ ‘జనరల్‌ అటామిక్‌ ఏరోనాటికల్‌ సిస్టమ్‌’ నుంచి 300 కోట్ల డాలర్లతో ఇండియా 30 ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్లను కొనుగోలు చేసే అంశంపైనా సమాలోచనలు జరిపారు. సమాచార మార్పిడిని మెరుగుపర్చుకునే మార్గాలతోపాటు నౌకాదళాల మధ్య సహకారాన్ని పెంచుకోవడంపైనా చర్చించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో ఆస్టిన్‌ విడిగా భేటీ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని