సంక్షిప్త వార్తలు (8)

స్వస్తిక్‌ సహా నాజీలకు సంబంధించిన ఇతర గుర్తులను దేశవ్యాప్తంగా నిషేధించేందుకు ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తోంది.

Updated : 09 Jun 2023 05:53 IST

స్వస్తిక్‌కు స్వస్తి
నాజీ గుర్తులపై నిషేధం విధించనున్న ఆస్ట్రేలియా

కాన్‌బెర్రా: స్వస్తిక్‌ సహా నాజీలకు సంబంధించిన ఇతర గుర్తులను దేశవ్యాప్తంగా నిషేధించేందుకు ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తోంది. అతివాద ఆలోచనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తున్నట్లు అటార్నీ జనరల్‌ మార్క్‌ డ్రెఫస్‌ గురువారం తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నాజీ గుర్తుల ప్రదర్శనపై నిషేధం ఉందన్నారు. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయడం వల్ల సంబంధిత వస్తువుల వాణిజ్యంపై కూడా ఆంక్షలు అమలవుతాయని చెప్పారు. ‘‘విద్వేషం, హింసను వ్యాప్తి చేసేవారికి ఆస్ట్రేలియాలో చోటులేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. వచ్చేవారం పార్లమెంటులో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. మత, విద్య, కళా సంబంధ అవసరాల కోసం ఈ గుర్తులను ప్రదర్శించడాన్ని నిషేధం నుంచి మినహాయిస్తున్నట్లు చెప్పారు. హిందువులు, బౌద్ధులు, జైనులు స్వస్తిక్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.


ఇందిరాగాంధీ హత్యను సమర్థిస్తూ కెనడాలో ఖలిస్థాన్‌ ఊరేగింపు

మండిపడ్డ కాంగ్రెస్‌
బ్రామ్‌టన్‌ ఘటనపై జైశంకర్‌ ఆగ్రహం

దిల్లీ: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యను సమర్థించేలా కెనడాలోని బ్రామ్‌టన్‌లో నాలుగు రోజుల క్రితం ఖలిస్థాన్‌ మద్దతుదారులు భారీ ఊరేగింపు నిర్వహించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై భారత ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీసింది. దీనిపై కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించింది. బ్రామ్‌టన్‌ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ వైఖరి కెనడాకు మంచిది కాదు. భారత్‌తో సత్సంబంధాలకూ ఇది సరికాదని భావిస్తున్నా’నని  జైశంకర్‌ పేర్కొన్నారు. బ్రామ్‌టన్‌ ఘటనపై కెనడా స్పందించింది. ఈ ఘటనను ఖండిస్తున్నట్లు భారత్‌లోని కెనడా హై కమిషనర్‌ కామెరాన్‌ మెకే పేర్కొన్నారు.

కెనడా, ఫిలిప్పీన్స్‌లలో నివసిస్తున్న నిషేధిత ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ ఉగ్రవాదులు అర్షదీప్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌ల తరఫున మన దేశంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారి సహాయకుడు గగన్‌దీప్‌ సింగ్‌ను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ ప్రకటించింది.


ఎట్టకేలకు అమెరికా చేరిన ప్రయాణికులు

అసౌకర్యానికి క్షమాపణలు తెలిపిన ఎయిరిండియా
టికెట్‌ డబ్బులు పూర్తిగా వెనక్కి ఇస్తామని వెల్లడి

దిల్లీ, ముంబయి: రష్యాలోని మగదన్‌లో చిక్కుకున్న ఎయిరిండియా విమానం ఏఐ-173 ప్రయాణికులు ఎట్టకేలకు గమ్యస్థానం చేరుకున్నారు. ఈ మేరకు ముంబయి నుంచి వెళ్లిన ప్రత్యేక విమానం గురువారం ఉదయం మగదన్‌ చేరుకుంది. అక్కడ ఉన్న ప్రయాణికులను అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చేర్చింది. దిల్లీ నుంచి 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు మంగళవారం బయలుదేరిన ఏఐ-173 విమానం ఇంజిన్లలో ఒక దానిలో సమస్య తలెత్తింది. దీంతో దానిని అత్యవసరంగా రష్యాలో దించిన సంగతి తెలిసిందే. మరోవైపు, తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ఎయిరిండియా క్షమాపణలు చెప్పింది. వారి టికెట్‌ డబ్బులు వెనక్కి ఇస్తామని ప్రకటించింది. భవిష్యత్తులో తమ సంస్థ విమానాల్లో ప్రయాణించేందుకు ఓ ట్రావెల్‌ వోచర్‌ను కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది.


అఫ్గాన్‌లో పేలిన బాంబు.. 11 మంది మృతి

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌లోని ఈశాన్య ప్రావిన్సు బదఖ్‌శాన్‌లో గురువారం బాంబు పేలి 11 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. నబావీ మసీదుకు సమీపంలో జరిగిన ఈ పేలుడులో మరో 30 మంది గాయపడ్డారు. మృతుల్లో తాలిబాన్‌ మాజీ పోలీసు అధికారి కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధిగా తాలిబాన్లు నియమించిన అబ్దుల్‌ నఫీ టాకోర్‌ తెలిపారు. మంగళవారం నాటి కారు బాంబు దాడిలో మృతిచెందిన బదఖ్‌శాన్‌ డిప్యూటీ గవర్నర్‌ నిసార్‌ అహ్మద్‌ అహ్మదీ స్మారక కార్యక్రమం నిర్వహిస్తుండగా తాజా దాడి జరిగింది. తాలిబాన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ మంగళవారం నాటి కారు బాంబు దాడికి తామే బాధ్యులని ప్రకటించగా, గురువారం జరిగిన తాజా దాడి ఎవరి పని అన్నది ఇంకా తెలియరాలేదు.


చైనా నిఘా కెమెరాల తొలగింపునకు బ్రిటన్‌ నిర్ణయం

లండన్‌: ప్రపంచ భద్రతకు చైనా అతి పెద్ద సవాలు విసురుతోందని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ గత నెల జీ-7 సదస్సులో వ్యాఖ్యానించిన నేపథ్యంలో యూకే కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన చైనా కంపెనీల నిఘా పరికరాలను తొలగించడానికి కాల పరిమితిని విధిస్తూ ప్రణాళిక రూపొందించింది. బ్రిటన్‌ మంత్రి  జెరెమీ క్విన్‌ మాట్లాడుతూ.. ‘‘వచ్చే వారం ప్రొక్యూర్‌మెంట్‌ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. ఈ బిల్లుకు చేయనున్న సవరణల్లో భాగంగా కీలకమైన కేంద్ర ప్రభుత్వ ప్రాంతాల నుంచి చైనా చట్టాలకు లోబడి తయారైన నిఘా పరికరాలను తొలగించడానికి కాలపరిమితి విధించనున్నాం’’ అని వివరించారు.


తాపి గ్యాస్‌ పైపులైన్‌ ప్రాజెక్టుపై పాక్‌, తుర్కిమెనిస్థాన్‌ల సంతకం

ఇస్లామాబాద్‌: వేల కోట్ల విలువైన తుర్కిమెనిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌- పాకిస్థాన్‌-ఇండియా (తాపీ) గ్యాప్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టు ఉమ్మడి అమలు ప్రణాళికపై పాకిస్థాన్‌, తుర్కిమెనిస్థాన్‌లు గురువారం సంతకం చేశాయి. ఈ కార్యక్రమంలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌, తుర్కిమెనిస్థాన్‌ ఇంధన, జలవనరుల శాఖ మంత్రి దలేర్‌ జుమా నేతృత్వంలోని ప్రతినిధి బృందం పాల్గొన్నట్లు పాక్‌ రేడియో తెలిపింది. ఈ సందర్భంగా షెహబాజ్‌ మాట్లాడుతూ.. కచ్చితమైన హామీలు, పరస్పరం ఆమోదయోగ్యమైన నియమ నిబంధనలతో కూడిన తాపి ప్రాజెక్టు మొతం ప్రాంతం పురోగతికి ముఖ్యమైన ప్రాజెక్టని పేర్కొన్నారు.


సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి నేత

సింగపూర్‌: సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో  పోటీ చేయనున్నట్లు భారత సంతతికి చెందిన ఆ దేశ మంత్రి థరమన్‌ షణ్ముగం గురువారం ప్రకటించారు. క్రియాశీల రాజకీయాల నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించారు. అధికార పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ)కి రాజీనామా చేయాలని భావిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు పార్టీ, ప్రభుత్వ పదవుల నుంచి వైదొలగాలని, అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలన్న తన ఆకాంక్షను ప్రధానమంత్రి లీ హొసీన్‌ లూంగ్‌కు తెలియజేశానన్నారు.


కల్లోలిత సూడాన్‌ నుంచి.. 300 మంది చిన్నారుల తరలింపు

కైరో: సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌లోని అల్‌-మెఖోమా అనాథ శరణాలయంలో చిక్కుకున్న 300 మంది చిన్నారులను రక్షించి ఈశాన్య ఆఫ్రికాలోని సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు యునిసెఫ్‌ అధికార ప్రతినిధి రికార్డో పైర్స్‌ గురువారం వెల్లడించారు. గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఈ అనాథ శరణాలయంలోని 71 మంది పిల్లలు ఆకలి, అనారోగ్య కారణాలతో ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో అక్కడున్నవారిని రక్షించడానికి ఈ చర్యలు తీసుకున్నారు. సూడాన్‌ సైన్యం, పారామిలటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ మధ్య చెలరేగిన ఘర్షణల కారణంగా ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని