చైనాలో పిల్లలకు రోజుకు 2 గంటలే ఫోన్‌.. రాత్రిపూట ఇంటర్నెట్‌ బంద్‌

చైనా చిన్నారులు ఇంటర్నెట్‌కు బానిసలుగా మారిపోయారని జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

Updated : 04 Aug 2023 08:49 IST

ముసాయిదా విడుదల

బీజింగ్‌: చైనా చిన్నారులు ఇంటర్నెట్‌కు బానిసలుగా మారిపోయారని జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే తీసుకున్న అనేక చర్యలకు కొనసాగింపుగా తాజా నిబంధనలు రూపొందించింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుకునే విషయంలో చైనాలో ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి. చిన్నారులు పగటిపూట ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుకునే సమయాన్ని 90 నిమిషాలకే పరిమితం చేస్తూ 2019లో ఆంక్షలు విధించింది. శుక్ర, శని, ఆదివారాలతోపాటు సెలవుల రోజుల్లో ఈ సమయాన్ని గంటకే పరిమితం చేస్తూ 2021లో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. తాజాగా చైనా చిన్నారులకు స్మార్ట్‌ఫోను వాడకంపై మరిన్ని సరికొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. మైనర్లు స్మార్ట్‌ఫోను ఉపయోగించే సమయాన్ని రోజుకు గరిష్ఠంగా రెండు గంటలకు పరిమితం చేస్తూ జిన్‌పింగ్‌ సర్కారు ఆంక్షలను తీసుకొస్తోంది. చైనా అంతర్జాల నియంత్రణ సంస్థ అయిన ‘సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ చైనా’ (సీఏసీ) ఇందుకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం..

  • మైనర్లకు రాత్రి 10.00 నుంచి ఉదయం 6.00 గంటల మధ్య ఇంటర్నెట్‌లోని చాలా సేవలు మొబైల్‌ ద్వారా అందుబాటులో ఉండవు.
  • 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్నవారు రోజుకు రెండు గంటలు మాత్రమే ఇంటర్నెట్‌ వినియోగించుకోవచ్చు. 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఈ సమయం గంటకే పరిమితం. ఎనిమిదేళ్లలోపు వారికైతే 40 నిమిషాలు మాత్రమే అంతర్జాలం వాడుకునే అనుమతి ఉంటుంది.
  • ఈ ఆంక్షల నుంచి కొన్ని సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు. మైనర్ల శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడే యాప్స్‌, ప్లాట్‌ఫాంలకు ఆంక్షలు వర్తించవు. అయితే, నిర్దిష్టంగా ఏయే సేవలకు ఇంటర్నెట్‌ ఆంక్షల మినహాయింపు ఉంటుందనే విషయాన్ని సీఏసీ చెప్పలేదు.
  • ఇంటర్నెట్‌ ప్లాట్‌ఫాంలలో ‘యూత్‌ మోడ్‌’ను తీసుకొచ్చేలా చైనా ఇప్పటికే చర్యలు తీసుకుంది. చిన్నారులకు వారి వయసుకు తగిన సమాచారం అందేలా నిబంధనలు తీసుకొచ్చింది. యూత్‌ మోడ్‌ ప్రవేశపెట్టిన తర్వాత సానుకూల ఫలితాలు వచ్చాయని సీఏసీ వెల్లడించింది. చిన్నారులు మొబైల్స్‌కు అతుక్కుపోవడం కూడా తగ్గినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో తాజా ముసాయిదా నిబంధనలపై సెప్టెంబరు  2లోపు స్పందనలు తెలపాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. సీఏసీ తీసుకొచ్చిన కొత్త ఆంక్షలు షార్ట్‌ వీడియో, ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫాంలతోపాటు గేమింగ్‌ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని