టీకా యోధులకు నోబెల్‌

కొవిడ్‌ మహమ్మారిపై పోరు కోసం సమర్థ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌లను ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించింది.

Updated : 03 Oct 2023 06:21 IST

వైద్య రంగంలో పురస్కారాన్ని గెల్చుకున్న కాటలిన్‌, వెయిస్‌మన్‌
వీరి కృషితో కొవిడ్‌కు సకాలంలో ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు
ఎంపిక కమిటీ కితాబు

స్టాక్‌హోం: కొవిడ్‌ మహమ్మారిపై పోరు కోసం సమర్థ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌లను ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించింది. కరోనా వైరస్‌కు వేగంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి వీరిద్దరి పరిశోధనలు దోహదపడ్డాయని అవార్డు ఎంపిక కమిటీ కొనియాడింది. కాటలిన్‌ స్వస్థలం హంగరీ కాగా, అమెరికాలో స్థిరపడ్డారు. వైద్యశాస్త్రంలో నోబెల్‌కు ఎంపికైన 13వ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. అమెరికన్‌ శాస్త్రవేత్త వెయిస్‌మన్‌తో కలసి ఆమె సాగించిన పరిశోధనల వల్ల ఎంఆర్‌ఎన్‌ఏ..  రోగనిరోధక వ్యవస్థతో చర్యలు జరిపే తీరుపై సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎన్నో ఇబ్బందులను అధిగమించి..

కాటలిన్‌ (68).. ప్రస్తుతం అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీతోపాటు హంగరీలోని సెగెడ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బయోఎన్‌టెక్‌ కంపెనీలో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ.. ఫైజర్‌తో కలిసి కొవిడ్‌-19 టీకాలను అభివృద్ధి చేసింది. వెయిస్‌మన్‌ (64) పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కాటలిన్‌.. 1970లలో హంగరీలో కెరీర్‌ మొదలుపెట్టారు. ఆ తర్వాత అమెరికా వలస వెళ్లారు. అప్పటికి ఎంఆర్‌ఎన్‌ఏపై పరిశోధనలు చాలా కొత్త. ఆమె తొలుత అమెరికాలోని టెంపుల్‌ విశ్వవిద్యాలయంలో, ఆ తర్వాత పెన్సిల్వేనియా వర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో పరిశోధనలు మొదలుపెట్టారు. ఎంఆర్‌ఎన్‌ఏ పరిశోధనలపై విశ్వవిద్యాలయ అధికారుల్లో తొలుత ఆసక్తి వ్యక్తమైనా.. ఆ తర్వాత నీరుగారింది. వ్యాధులపై పోరుకు ఈ సాంకేతికతను వాడొచ్చన్న కాటలిన్‌ ప్రతిపాదనకు తిరస్కరణలే ఎదురయ్యాయి. ఆ పరిశోధనకు నిధులు సమకూర్చడం రిస్కుతో కూడుకున్న వ్యవహారమని వర్సిటీ అధికారులు తేల్చి చెప్పేశారు.

1995లో అధికారులు ఆమె హోదాను కూడా తగ్గించేశారు. అదే సమయంలో ఆమె క్యాన్సర్‌ బారినపడ్డారు. ఆ సమయంలో ఒక్కసారిగా ముంచెత్తిన కష్టాలను ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత పెన్సిల్వేనియా వర్సిటీలో వెయిస్‌మన్‌తో కలిసి పరిశోధనలు సాగించిన కాటలిన్‌.. ఉమ్మడిగా ఒక విధానాన్ని కనుగొన్నారు. అందులో వారు ఆర్‌ఎన్‌ఏలోని న్యూక్లియోసైడ్‌ బేస్‌ను మార్చేశారు. ఫలితంగా ఎంఆర్‌ఎన్‌ఏకు మన రోగనిరోధక స్పందన నుంచి ఇబ్బంది తొలగిపోయింది. దీనిపై 2005లో కాటలిన్‌, వెయిస్‌మన్‌లు ఒక పరిశోధన పత్రం ప్రచురించారు. అప్పట్లో అది అంతగా గుర్తింపు పొందనప్పటికీ.. కొవిడ్‌ మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ల అభివృద్ధిలో వీరి పరిశోధనలు కీలక పాత్ర పోషించాయి. ఫలితంగా 2020 చివర్లో రెండు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. ఆ వ్యాక్సిన్లు వైరస్‌ వ్యాప్తిని నిరోధించడమేగాక.. కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగాయి అని నోబెల్‌ ఎంపిక కమిటీ వెల్లడించింది.  

నోబెల్‌ పురస్కారాల గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని ఈ ఏడాది కాస్త పెంచారు. గతేడాది గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్ల నగదు అందజేయగా.. ఈసారి దాన్ని 11 మిలియన్ల క్రోనర్లకు పెంచారు. ఈ కరెన్సీ విలువ పడిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.


ఎంఆర్‌ఎన్‌ఏ అంటే...

సంప్రదాయ టీకాల తయారీ విధానంలో.. లక్షిత వైరస్‌లు లేదా అందులోని భాగాలను భారీగా వృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని శుద్ధిచేసి, తదుపరి దశల్లో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో సజీవ లేదా బలహీనపరచిన వైరస్‌లను శరీరంలోకి చొప్పించాల్సి ఉంటుంది. ఎంఆర్‌ఎన్‌ఏ (మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ) విధానం ఇందుకు పూర్తి భిన్నమైంది. ఇందులో తాత్కాలిక జన్యు సంకేతం ఉంటుంది. లక్షిత వైరస్‌లోని ఎంపిక చేసిన భాగాన్ని ఉత్పత్తి చేయాలంటూ మన కణాలకు ఆదేశాలు అందులో ఉంటాయి. దాన్ని మన కణాలు ‘చదివి’.. ఆ ప్రొటీన్‌ను తయారుచేస్తాయి. అంటే.. మన శరీరమే ఒక మినీ టీకా కర్మాగారంగా మారిపోతుందన్నమాట! అలా ఉత్పత్తయిన ప్రొటీన్‌ ఆధారంగా మన రోగనిరోధక వ్యవస్థ స్పందించి.. సంబంధిత ప్రొటీన్లను అడ్డుకునే యాంటీబాడీలు, ఇతర ప్రత్యేక కణాలను తయారుచేస్తుంది. తద్వారా.. భవిష్యత్‌లో సంబంధిత వైరస్‌ సోకినప్పుడు వెంటనే స్పందించి, ఇన్‌ఫెక్షన్‌కు అడ్డుకట్టవేసేలా ముందే శిక్షణ పొందుతుంది. ఎంఆర్‌ఎన్‌ఏ టీకా తయారీకి వైరస్‌ అవసరం ఉండదు. అయితే, ల్యాబ్‌లో వృద్ధి చేసిన ఎంఆర్‌ఎన్‌ఏను చొప్పించడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేటరీ ప్రతిచర్య తలెత్తుతుంది. అది ఎంఆర్‌ఎన్‌ఏను నాశనం చేస్తుంది. ఈ ఇబ్బందిని అధిగమించే విధానాన్ని కాటలిన్‌, వెయిస్‌మన్‌లు కనుగొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని