మళ్లీ పాత తప్పులు చేయొద్దు: నెతన్యాహు

‘ఉత్తరాన మమ్మల్ని పరీక్షించొద్దు. గతంలో చేసిన తప్పులను చేయొద్దు. ప్రస్తుతం మీరు చెల్లించే మూల్యం భారీగా ఉండబోతోంది’ అని సోమవారం ఇజ్రాయెల్‌ పార్లమెంటులో చేసిన ప్రసంగంలో పొరుగు దేశాలను ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు.

Updated : 18 Oct 2023 06:07 IST

 జెరూసలెం: ‘ఉత్తరాన మమ్మల్ని పరీక్షించొద్దు. గతంలో చేసిన తప్పులను చేయొద్దు. ప్రస్తుతం మీరు చెల్లించే మూల్యం భారీగా ఉండబోతోంది’ అని సోమవారం ఇజ్రాయెల్‌ పార్లమెంటులో చేసిన ప్రసంగంలో పొరుగు దేశాలను ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. అదే సమయంలో జెరూసలెంవైపు రాకెట్లు దూసుకొచ్చాయి. టెల్‌ అవీవ్‌లో సైరన్లు మోగాయి. దీంతో నేతలంతా బంకర్లలోకి వెళ్లిపోయారు.

నిఘా వైఫల్యానికి మాదే బాధ్యత: షిన్‌బెట్‌

హమాస్‌ జరిపిన పాశవిక దాడుల్లో నిఘా వైఫల్యానికి పూర్తి బాధ్యత తమదేనని ఇజ్రాయెల్‌ అంతర్గత భద్రతా సంస్థ షిన్‌బెట్‌ అంగీకరించింది. షిన్‌బెట్‌ అధిపతి బార్‌ తొలిసారిగా ఈ దాడులపై స్పందించారు. ఈ మెరుపు దాడిపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నారు.  

‘నన్ను విడిపించండి ప్లీజ్‌..’

హమాస్‌ చెరలో బందీగా ఉన్న యువతి ఒకరు.. వీలైనంత త్వరగా తనను విడిపించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్‌ సైనిక విభాగం ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అందులో 21 ఏళ్ల ఫ్రాన్స్‌-ఇజ్రాయెల్‌ యువతి మియా షెమ్‌ చేతికి ఓ వ్యక్తి కట్టు కడుతున్నారు. ఆ తర్వాత మియా మాట్లాడారు. ‘నా పేరు మియా. మాది గాజా సరిహద్దులోని షోహమ్‌ అనే ప్రాంతం. ప్రస్తుతం నేను గాజాలో ఉన్నా. ఆ రోజు నేను కిబుజ్‌లో జరిగిన సూపర్‌నోవా మ్యూజిక్‌ పార్టీకి వెళ్లా. గాజాలో నాకు 3 గంటల పాటు సర్జరీ జరిగింది. వాళ్లు నన్ను బాగానే చూసుకుంటున్నారు. మందులు ఇస్తున్నారు. నేను అడుగుతున్నది ఒక్కటే.. వీలైనంత త్వరగా నన్ను ఇక్కడి నుంచి విడిపించండి. మా అమ్మానాన్నల దగ్గరకు తీసుకెళ్లండి’ అని మియా ఆ వీడియోలో అభ్యర్థించారు.  

మధ్యవర్తుల చర్చలు

ఈజిప్టు, గాజా సరిహద్దులోని రఫా వద్ద సహాయ సామగ్రితో వచ్చిన లారీలు వేచి ఉన్నాయి. వాటిని గాజాలోకి పంపేందుకు వీలుగా ఈజిప్టు సరిహద్దును తెరిపించేందుకు మధ్యవర్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాల్పుల విరమణకు సోమవారం అంగీకారం కుదిరిందని వారు వెల్లడించినా ఇజ్రాయెల్‌ తోసిపుచ్చింది. పైగా మంగళవారం రఫాలో దాడులు చేసింది. సరిహద్దు వద్ద ఉన్న లారీల్లో 300 టన్నుల ఆహారం ఉందని అధికారులు తెలిపారు.

ముఖ్యాంశాలు

  • హమాస్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రెండోసారి అధికారంలోకి వస్తే గాజా శరణార్థులపై నిషేధం విధిస్తానని ప్రకటించారు. మొదటిసారి తాను తీసుకొచ్చిన ముస్లింల నిషేధాన్ని మరింతగా విస్తరిస్తానని వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా అయోవాలో మాట్లాడిన ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
  • ఉత్తర గాజా నుంచి వలస వెళ్తున్న ప్రజలపై ఇజ్రాయెల్‌ దాడులు చేయడాన్ని ఐరాస మానవ హక్కుల కార్యాలయం ఖండించింది. దక్షిణ గాజాపై వైమానిక దాడులను ఆపాలని ఆ సంస్థ అధికార ప్రతినిధి రవీనా శాందాసానీ సూచించారు.
  • బందీలను విడుదల చేయాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ హమాస్‌కు సూచించారు. హమాస్‌ చర్య అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు.
  • రెండు దేశాల ఏర్పాటే ఇజ్రాయెల్‌, పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపగలదని తుర్కియే అభిప్రాయపడింది. అప్పుడే శాంతి నెలకొంటుందని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి హకన్‌ ఫిదా స్పష్టం చేశారు.
  • పాలస్తీనా శరణార్థులను అంగీకరించే ప్రశ్నే లేదని జోర్దాన్‌ రాజు అబ్దుల్లా స్పష్టం చేశారు. బెర్లిన్‌లో ఆయన జర్మనీ ఛాన్సలర్‌ షోల్జ్‌తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. జోర్దాన్‌, ఈజిప్టుల్లోకి శరణార్థులను అంగీకరించబోమని తెలిపారు. గాజా, వెస్ట్‌ బ్యాంకుల్లోనే సమస్యకు పరిష్కారం చూసుకోవాలని సూచించారు.
  • గాజా సంక్షోభం మానవ హననానికి దారి తీస్తుందని మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం స్పష్టం చేశారు. పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
  • గాజాలో ఆహారం అయిపోతోందని ప్రపంచ ఆహార కార్యక్రమం అధికార ప్రతినిధి అబీర్‌ ఎతీఫా తెలిపారు. దుకాణాల్లో ఉన్న సామగ్రి నాలుగైదు రోజులే వస్తుందని వెల్లడించారు.
  • మానవతా సాయం కోసం గాజాలో కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ ఐరాస భద్రతా మండలిలో రష్యా ప్రవేశ పెట్టిన తీర్మానం వీగిపోయింది. దీనిపై సోమవారం మండలి సమావేశమైంది. 15 దేశాలు సభ్యులుగా ఉన్న భద్రతా మండలిలో తీర్మానానికి అనుకూలంగా సరిపడినన్ని ఓట్లు రాలేదు.
  • హమాస్‌ దాడులకు సంబంధించిన ఘటనలతో రూపొందించిన వీడియోను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. అందులో హమాస్‌ దారుణాలు ఇవేనంటూ పలు ఘటనలను చూపించింది.
  • గాజాలో ఐరాస తరఫున పని చేస్తున్న 13,000 మంది సహాయక సిబ్బంది అలసిపోవడంతోపాటు భయకంపితులవుతున్నారు. అందులో టీచర్లు, డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్టులు, వేర్‌హౌస్‌ వర్కర్లు, లాజిస్టిక్‌ వర్కర్లు, టెక్నీషియన్లు, డ్రైవర్లు ఉన్నారు. ఇక ఇక్కడ ఉండలేమంటూ వీరంతా తమ కార్యాలయానికి సందేశాలను పంపుతున్నారు.
  • బైడెన్‌ అధికారంలోకి రాగానే ఇజ్రాయెల్‌, పాలస్తీనా సమస్య పరిష్కారాన్ని అటకెక్కించారని, అందుకే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తాయని అరబ్‌ నేతలు అంటున్నారు. గత 50ఏళ్లుగా డెమోక్రాట్‌ అధ్యక్షులు ఈ సమస్య పరిష్కారానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని, బైడెన్‌ నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని