నావల్నీ తల, ఛాతీపై కమిలిన గాయాలు!

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లో మృతిచెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ స్థానికంగా ఓ మీడియా సంస్థ సంచలన కథనాన్ని వెలువరించింది.

Updated : 20 Feb 2024 05:58 IST

మాస్కో: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లో మృతిచెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ స్థానికంగా ఓ మీడియా సంస్థ సంచలన కథనాన్ని వెలువరించింది. ఆయన తల, ఛాతీపై కమిలిన గాయాలు ఉన్నాయని అందులో పేర్కొంది. మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తున్నప్పుడు అవి కనిపించాయని ఓ వైద్య నిపుణుడిని ఉటంకిస్తూ తెలిపింది. ‘‘జైల్లో మరణించిన వ్యక్తుల మృతదేహాలను సాధారణంగా గ్లాజ్కోవా వీధిలోని బ్యూరో ఆఫ్‌ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌కు తరలిస్తారు. నావల్నీ భౌతికకాయాన్ని మాత్రం క్లినికల్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. తర్వాత మార్చురీకి తీసుకొచ్చారు. అక్కడ ఇద్దరు పోలీసులను కాపలా ఉంచారు. ఈ గోప్యత ఎందుకు? వారు ఏదైనా దాచాలనుకుంటున్నారా..?’’ అని వైద్యుడు ప్రశ్నించినట్లు కథనంలో పేర్కొంది.

నా భర్తను పుతినే చంపేశారు: నావల్నీ భార్య

తన భర్తను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చంపేశారని నావల్నీ భార్య యూలియా నావల్నయా ఆరోపించారు. నావల్నీని మూడేళ్లు తీవ్ర వేధింపులు, చిత్రహింసలకు గురిచేశారని పేర్నొన్నారు. ఆమె సోమవారం ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ అందులో మాట్లాడారు. అవినీతి, అన్యాయం, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తేనే నావల్నీకి అసలైన నివాళులర్పించినట్లు అవుతుందని పిలుపునిచ్చారు. ఆయన మరణం వెనక రహస్యాలన్నింటినీ నిగ్గు తేలుస్తానని ప్రతినబూనారు. నావల్నీ మృతదేహాన్ని ఇంకా తమకు అప్పగించకపోవడంపై విమర్శలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని