పారిస్‌కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు

గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్‌ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు.

Published : 30 Apr 2024 04:36 IST

సర్బాన్‌ యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు

పారిస్‌/వాషింగ్టన్‌: గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్‌ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. భారీ పాలస్తీనా జెండాతో 100కి పైగా విద్యార్థులు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికాలోని పలు యూనివర్సిటీ ప్రాంగణాల్లో గుడారాలు వేసుకొని విద్యార్థులు తమ ఆందోళనలను ఇంకా  కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే హార్వర్డ్‌ యూనివర్సిటీలోని ప్రఖ్యాత జాన్‌ హార్వర్డ్‌ విగ్రహంపై పాలస్తీనా జెండాను ఎగరవేశారు. వాస్తవంగా దానిపై అమెరికా జెండా ఉంటుంది. ఎవరైనా విదేశీ ప్రతినిధుల వచ్చినప్పుడు వారి దేశ జెండాలను ఉంచుతారు. కానీ నిరసనకారులు అమెరికా జెండాను పక్కనపెట్టి.. పాలస్తీనాకు విముక్తి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆ దేశ జెండాను ఎగరవేశారు. హార్వర్డ్‌ ప్రతినిధి జొనాథన్‌ ఎల్‌ స్వెయిన్‌ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఇది విశ్వవిద్యాలయ నిబంధనలకు విరుద్ధమని వెల్లడించారు. ఈ ఘటన కారకులపై క్షమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తొలుత న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మొదలైన ఈ ఆందోళనలు అగ్రరాజ్యమంతా విస్తరించిన సంగతి తెలిసిందే. దాదాపు 900 మందికి పైగా విద్యార్థులను ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుత నిరసనల హక్కును తాము గౌరవిస్తామని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. అయితే విద్వేషపూరిత ప్రసంగాలను మాత్రం తీవ్రంగా ఖండిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని