భారత్‌కు ఎస్‌-400 సరఫరాపై అమెరికా ఆగ్రహం

భారత్‌కు క్షిపణి రక్షణ వ్యవస్థను విక్రయించిన రష్యాపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. ఆ ప్రాంతంలోను, వెలుపల అస్థిర పరిస్థితులను సృష్టించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను ఇది తేటతెల్లం చేస్తోందని విమర్శించింది.

Published : 29 Jan 2022 04:02 IST

ఆ ప్రాంతాన్ని అస్థిరపాల్జేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని విమర్శ

వాషింగ్టన్‌:  భారత్‌కు క్షిపణి రక్షణ వ్యవస్థను విక్రయించిన రష్యాపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. ఆ ప్రాంతంలోను, వెలుపల అస్థిర పరిస్థితులను సృష్టించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను ఇది తేటతెల్లం చేస్తోందని విమర్శించింది.

ఐదు ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలుకు 2018లో భారత్‌, రష్యాల మధ్య 500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఈ విషయంలో అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్‌ ముందడుగు వేసిన సంగతి తెలిసిందే. ‘‘ఎస్‌-400 వ్యవస్థ విషయంలో మాకున్న ఆందోళనల్లో ఏ మాత్రం మార్పు లేదు’’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ తాజాగా పేర్కొన్నారు. రష్యా నుంచి భారీ ఆయుధాలను కొనుగోలు చేయరాదని అన్ని దేశాలనూ కోరుతున్నామన్నారు. అయితే ఎస్‌-400 విషయంలో వెనక్కి తగ్గని భారత్‌పై ‘క్యాట్సా’ చట్టం కింద ఆంక్షలు విధించడంపై అమెరికా స్పష్టత ఇవ్వలేదు. దీనిపై తాము ఒక నిర్ణయానికి రాలేదని నెడ్‌ చెప్పారు. భారత్‌తో చర్చలు కొనసాగిస్తామన్నారు. ఉక్రెయిన్‌ అంశంపై అమెరికా, రష్యాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

మాది స్వతంత్ర విదేశీ విధానం: భారత్‌

జిఎస్‌-400 ఆయుధ వ్యవస్థ కొనుగోలుపై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్చి స్పందించారు. తమది స్వతంత్ర విదేశీ విధానమని స్పష్టం చేశారు. తాము చేపట్టే ఆయుధ కొనుగోళ్లకూ ఇది వర్తిస్తుందన్నారు. ఈ విషయంలో జాతీయ భద్రతా ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. భారత్‌కు అమెరికాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని చెప్పారు. అదే సమయంలో రష్యాతో ప్రత్యేక బంధం కొనసాగుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని