Ukraine Crisis: ఉక్రెయిన్‌పై హైపర్‌సోనిక్‌ క్షిపణి

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా శనివారం తొలిసారిగా హైపర్‌సోనిక్‌ క్షిపణిని ప్రయోగించింది. అధునాతనమైన కింజాల్‌ క్షిపణిని మిగ్‌-31కె యుద్ధ విమానం ద్వారా పశ్చిమ ఇవానో-ఫ్రాంకివ్స్క్‌ ప్రాంతంలోని భారీ భూగర్భ ఆయుధాగారంపై సంధించింది.

Updated : 20 Mar 2022 12:31 IST

భూగర్భంలోని ఆయుధాగారంపై ప్రయోగించిన రష్యా
మరో బ్యారెక్స్‌పైనా విరుచుకుపడిన సేనలు.. 50 మంది సైనికుల మృతదేహాల లభ్యం

కీవ్‌, మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా శనివారం తొలిసారిగా హైపర్‌సోనిక్‌ క్షిపణిని ప్రయోగించింది. అధునాతనమైన కింజాల్‌ క్షిపణిని మిగ్‌-31కె యుద్ధ విమానం ద్వారా పశ్చిమ ఇవానో-ఫ్రాంకివ్స్క్‌ ప్రాంతంలోని భారీ భూగర్భ ఆయుధాగారంపై సంధించింది. ఈ దాడిలో ఆయుధాగారం ధ్వంసమైందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి మేజర్‌ జనరల్‌ కొనషెంకోవ్‌ ప్రకటించారు. ఆ ఆయుధాగారంలో ఉక్రెయిన్‌ క్షిపణులతో పాటు యుద్ధవిమానాల ద్వారా ప్రయోగించే బాంబులు ఉన్నట్లు చెప్పారు. అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు ఉక్రెయిన్‌కు పంపిస్తున్న ఆయుధాలపై హెచ్చరిక జారీ చేయడానికే ఈ క్షిపణిని ప్రయోగించినట్లు చెబుతున్నారు. ఒడెసాలోని ఓడరేవుకు సమీపంలో ఉన్న సైనిక స్థావరాలను నౌకా విధ్వంసక క్షిపణి ద్వారా ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. మైకోలైవ్‌ నగరంలో ఉక్రెయిన్‌ సైనికుల ఆవాస సముదాయం (బ్యారెక్స్‌)పై శుక్రవారం తెల్లవారుజామున రష్యా జరిపిన దాడిలో కొన్ని డజన్ల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. దాడి జరిగిన సమయంలో 200 మందికి పైగా సైనికులు అందులో నిద్రిస్తున్నారు. కనీసం 50 మృతదేహాలు ఇప్పటివరకు బయటపడ్డాయనీ, శిథిలాలు తొలగిస్తే గానీ ప్రాణనష్టంపై స్పష్టత రాదని ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.

దాడుల సెగ.. కమ్మిన పొగ

దక్షిణ నగరమైన జపోరిజిజియాలో ఉక్రెయిన్‌ సైన్యం శనివారం మధ్యాహ్నం నుంచి 38 గంటల కర్ఫ్యూ విధించింది. మేరియుపొల్‌ ఓడరేవుపై రష్యా సేనలు పట్టుబిగించడంతో అజోవ్‌ సముద్ర తీరంలో ప్రవేశించే అవకాశాన్ని తాత్కాలికంగా కోల్పోయామని ఉక్రెయిన్‌ రక్షణ శాఖ తెలిపింది. కీవ్‌ శివార్లలోని అనేక ప్రాంతాలు మరోసారి దాడులతో దద్దరిల్లాయి. పొగలు కమ్మేసి ఊపిరి పీల్చుకోవడం కష్టమయింది. ఇళ్లలో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని పౌరులకు సూచనలు జారీ అయ్యాయి. నిర్ణీత స్థాయి కంటే 27.8 రెట్లు ఎక్కువగా వాయు కాలుష్యం అక్కడ ఉన్నట్లు తేలింది. కీవ్‌తో పాటు ఎనిమిది నగరాలపై బాంబుల వర్షం కురిసింది. ఐరోపాలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారాల్లో ఒకటైన అజోవ్‌స్తాల్‌ను చేజిక్కించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. దీనిని ఉక్రెయిన్‌ అడ్డుకుంటోంది. ఆ కర్మాగారం చాలావరకు ధ్వంసమైపోయింది. మానవత పరమైన సాయాన్ని అందించడానికి, ప్రజల్ని సురక్షితంగా తరలించడానికి 10 కారిడార్ల ఏర్పాటుకు రష్యా అంగీకరించింది.

ప్రాణనష్టం మరింత పెరుగుతుంది: బ్రిటన్‌

రష్యా తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకుందని.. దీంతో భారీఎత్తున ప్రాణ, ఆస్తినష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని బ్రిటన్‌ రక్షణశాఖ తన తాజా నిఘా నివేదికలో హెచ్చరించింది. క్రెమ్లిన్‌ ఇప్పటివరకు తన అసలు లక్ష్యాలను సాధించడంలో విఫలమైందని ట్విటర్‌లో పేర్కొంది. ‘రష్యా తన యుద్ధ కార్యాచరణను మార్చుకోవాల్సి వచ్చింది. నిరంతర దాడులతో ప్రత్యర్థిని బలహీనపరిచే వ్యూహాన్ని అనుసరిస్తోంది. దీంతో ప్రాణనష్టం భారీగా పెరుగుతుంది’ అని తెలిపింది.

గగనతల నిషేధానికి విముఖం

ఉక్రెయిన్‌పై యుద్ధం ఆగాలంటే తమ గగనతలంపై ఆంక్షలు విధించాలంటూ ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థిస్తూనే ఉన్నారు. దీనికి అమెరికా విముఖత చూపించింది. ‘‘రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మేం సాయుధ బలగాలను పంపబోం. నో ఫ్లై జోన్‌ను విధించడం అంటే గగనతలంపై నియంత్రణ తీసుకోవడమే. దానర్థం రష్యా విమానాలను పడగొట్టి, ఆ దేశంతో నేరుగా యుద్ధానికి దిగడమే. అది ప్రపంచానికి మంచిది కాదు’’ అని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన ఫిరంగి గుళ్లు, ఉక్రెయిన్‌ సైన్యమే ముందు జాగ్రత్తగా వివిధ చోట్ల అమర్చిన మందుపాతరల్లో ఇంకా పేలనివి.. వివిధ నగరాల్లో శిథిలాల కిందే పడి ఉన్నాయి. వీటిని సురక్షితంగా తొలగించడానికి కొన్నేళ్ల సమయమైనా పడుతుందని ఉక్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి చెప్పారు.


చర్చలే పరిష్కారం: జెలెన్‌స్కీ

తాజా దాడుల్లో ఉక్రెయిన్‌కు వాటిల్లిన నష్టంపై దేశాధ్యక్షుడు వొలిదిమిర్‌ జెలెన్‌స్కీ శనివారం వీడియో సందేశం ద్వారా స్పందించారు. రష్యాతో సమగ్రంగా శాంతి చర్చలు జరపడమే సమస్యకు పరిష్కారమనీ, లేనిపక్షంలో ఈ యుద్ధంతో వాటిల్లిన నష్టం నుంచి తేరుకునేందుకు రష్యాకు కొన్ని తరాలు పడుతుందని వ్యాఖ్యానించారు. ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించి, ఉక్రెయిన్‌కు న్యాయం చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. లేదంటే రష్యాకు కోలుకోలేని నష్టం తప్పదన్నారు. ‘‘ఉద్దేశపూర్వకంగా మానవ సంబంధిత విపత్తు సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. మరింత రక్తపాతం జరగకుండా పుతిన్‌ నాతో చర్చ జరపాలి. ఇప్పటికే 14 వేల మంది సైనికుల్ని రష్యా కోల్పోయింది. మరికొన్ని వేలమంది గాయపడ్డారు. ఇప్పటికైనా దాష్టీకాన్ని ఆపకపోతే చివరకు రష్యా మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని