Ukraine Crisis: లొంగిపోయిన సైనికులు వెయ్యి మంది

వారాల తరబడి పోరాడిన ఉక్రెయిన్‌ సైనికుల్లో దాదాపు వెయ్యి మంది తమకు లొంగిపోయారని రష్యా ప్రకటించింది. మేరియుపొల్‌ నగరంలోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ఆవరణను పుతిన్‌

Updated : 19 May 2022 05:22 IST

యుద్ధ నేరాల కింద వారిలో కొందరిపై విచారణ

రష్యా నుంచి సంకేతాలు

కీవ్‌, మాస్కో: వారాల తరబడి పోరాడిన ఉక్రెయిన్‌ సైనికుల్లో దాదాపు వెయ్యి మంది తమకు లొంగిపోయారని రష్యా ప్రకటించింది. మేరియుపొల్‌ నగరంలోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ఆవరణను పుతిన్‌ సేనలు మంగళవారం స్వాధీనం చేసుకొని, అక్కడి నుంచి పలువురు ఉక్రెయిన్‌ సైనికుల్ని తమ నియంత్రణలోని భూభాగంలోకి తరలించిన విషయం తెలిసిందే. ఇది తరలింపా, లొంగుబాటా అనే అనుమానాలున్న నేపథ్యంలో రష్యా రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఇగోర్‌ కొనషెన్‌కోవ్‌ బుధవారం స్పష్టతనిచ్చారు. కర్మాగార ప్రాంగణాన్ని వీడి 959 మంది బయటకు వచ్చారని చెప్పారు. ఖైదీల మార్పిడి కింద వీరిని తిరిగి వెనక్కి తీసుకువస్తామని ఉక్రెయిన్‌ ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, రష్యా మాత్రం వారిలో కొందరినైనా యుద్ధ నేరాల కింద విచారించబోతున్నట్లు తెలుస్తోంది. రష్యాలో ఆ మేరకు ఒత్తిడి పెరుగుతోంది. పౌరులపై నేరాలకు పాల్పడినవారిని గుర్తించడానికి ఉక్రెయిన్‌ సైనికుల్ని విచారిస్తామని రష్యా దర్యాప్తు సంస్థ తెలిపింది. అక్కడి అజోవ్‌ రెజిమెంట్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరే ప్రయత్నాలు మొదలయ్యాయి. కర్మాగార ఆవరణలోని బంకర్లలో దాదాపు 2,000 మంది ఉంటారని ఒక దశలో అంచనా వేసినా, ప్రస్తుతం ఇంకా ఎందరు అక్కడ మిగిలారనేది స్పష్టం కావడం లేదు. మేరియుపొల్‌కు చెందిన దాదాపు మూడువేల మంది పౌరుల్ని ఒలెనివ్కా సమీపంలోని ప్రాంతానికి రష్యా సైన్యం తరలించిందని ఉక్రెయిన్‌ మానవ హక్కుల అంబుడ్స్‌మన్‌ తెలిపారు.

నాటోకు దరఖాస్తుల సమర్పణ
రష్యా తమపైనా దురాక్రమణకు దిగవచ్చనే ఉద్దేశంతో నాటోలో చేరాలని నిర్ణయించుకున్న ఫిన్లాండ్‌, స్వీడన్‌ బుధవారం దానికి సంబంధించిన దరఖాస్తులను బ్రసెల్స్‌లోని కూటమి ప్రధాన కార్యాలయానికి పంపించాయి. నాటో సభ్యదేశాల్లో ఒకటైన టర్కీ- వీటి చేరికపై అభ్యంతరం చెబుతున్నప్పటికీ ఈ రెండు దేశాలు అధికారిక ప్రక్రియతో ముందుకు సాగుతున్నాయి. కొత్త దేశం నాటోలో చేరాలంటే అందులోని 30 సభ్య దేశాల ఆమోదం తప్పనిసరి. దీనికి రెండు వారాల సమయం పడుతుంది. అమెరికా సహా నాటోలోని చాలా దేశాలు ఫిన్లాండ్‌, స్వీడన్‌ను స్వాగతిస్తున్నాయి.

బలగాల మోహరింపును చూసి స్పందిస్తాం: రష్యా
భవిష్యత్తులో స్వీడన్‌ తన సైనిక బలగాన్ని ఎలా వినియోగిస్తుందనే దానిపై తమ స్పందన ఆధారపడి ఉంటుందని రష్యా తెలిపింది. నాటోలో చేరాలన్న అభిలాష గురించి స్వీడన్‌ రాయబారి తెలిపారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జాతీయ భద్రత అనేది ఆయా దేశాల సార్వభౌమాధికారమనీ, అయితే ఇతర దేశాల భద్రతకు ముప్పు కలిగించకూడదని పేర్కొంది. స్వీడన్లో నాటో ఎలాంటి ఆయుధాలను మోహరిస్తుందో చూసి రష్యా బదులిస్తుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని