ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులకు.. ఆ మూడింటి వల్లే తీవ్రస్థాయి కొవిడ్‌ ముప్పు

ఆరోగ్యవంతులతో పోలిస్తే, ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులకు తీవ్రస్థాయి కొవిడ్‌ ముప్పు ఎందుకు ఎదురవుతోంది?- ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించింది! ఆస్ట్రేలియాకు చెందిన సెంటినరీ

Published : 19 May 2022 04:58 IST

ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధన

మెల్‌బోర్న్‌: ఆరోగ్యవంతులతో పోలిస్తే, ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులకు తీవ్రస్థాయి కొవిడ్‌ ముప్పు ఎందుకు ఎదురవుతోంది?- ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించింది! ఆస్ట్రేలియాకు చెందిన సెంటినరీ ఇన్‌స్టిట్యూట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ సిడ్నీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఇందుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగు చూశాయి. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు సీవోపీడీ బాధితుల శ్వాసవ్యవస్థ నుంచి ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాలను సేకరించి, అత్యాధునిక ఏకకణ ఆర్‌ఎన్‌ఏ-సీక్వెన్సింగ్‌ విశ్లేషణ ద్వారా వాటి జన్యు సమాచారాన్ని సేకరించారు. దీన్ని పరిశీలించడంతో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి.

1. వైరస్‌ సోకిన ఏడు రోజులకు ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల శ్వాసవ్యవస్థలోని కణాలు... ఆరోగ్యవంతుల్లోని కణాల కంటే 24 రెట్లు ఎక్కువగా ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నాయి.

2. శరీర కణాల్లోకి కరోనా వైరస్‌ చొచ్చుకు వెళ్లేందుకు దోహదపడే రెండు రకాల ఎంజైములు (టీఎంపీఆర్‌ఎస్‌ఎస్‌2, సీటీఎస్‌బీ) వీరిలో అధిక స్థాయుల్లో ఉంటున్నాయి.

3. కొవిడ్‌ మహమ్మారిపై పోరాడే వైరస్‌ వ్యతిరేక మాంసకృత్తులైన ‘ఇంటర్‌ఫెరాన్లు’ వీరి శ్వాసమార్గంలో మొద్దుబారి, అచేతనంగా ఉంటున్నాయి.

ఈ కారణాల వల్లే సీవోపీడీ రోగుల్లో కరోనా వైరస్‌ పునరుత్పత్తి ఉద్ధృతంగా జరిగి, బాధితులు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు ఎదుర్కొంటున్నారని పరిశోధనకర్త జొహాన్సెన్‌ చెప్పారు. అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ రెస్పిరేటరీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ పత్రిక ఈ వివరాలను అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని