1,01,400 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్న ‘కోల్డ్‌ వైరస్‌’!

సాధారణ జలుబు వంటి లక్షణాలకు కారణమయ్యే ‘కోల్డ్‌ వైరస్‌’... 2019లో ప్రపంచ వ్యాప్తంగా 1,01,400 మంది ఐదేళ్లలోపు చిన్నారులను పొట్టనపెట్టుకున్నట్టు బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది

Published : 21 May 2022 07:48 IST

లండన్‌: సాధారణ జలుబు వంటి లక్షణాలకు కారణమయ్యే ‘కోల్డ్‌ వైరస్‌’... 2019లో ప్రపంచ వ్యాప్తంగా 1,01,400 మంది ఐదేళ్లలోపు చిన్నారులను పొట్టనపెట్టుకున్నట్టు బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ‘యూనివర్సిటీ ఆఫ్‌ ఈడెన్‌బరో’ ఆధ్వర్యాన చేపట్టిన ఈ పరిశోధన వివరాలను ద లాన్సెట్‌ పత్రిక అందించింది. కోల్‌్్డ వైరస్‌గా పిలిచే రెస్పిరేటరీ సిన్సిటియల్‌ వైరస్‌ (ఆర్‌ఎస్‌వీ)... చిన్నారుల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. పురిటి బిడ్డలు మొదలు ఆరు నెలల పసికందులే ఎక్కువగా దీనికి చిక్కుతుంటారు. చైనాలో కరోనా వైరస్‌ తొలిసారి వెలుగుచూసిన2019లోనే- ప్రపంచ వ్యాప్తంగా 3.3 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఆర్‌ఎస్‌వీ కారణంగా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. వీరిలో 36 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరగా, ఆరోగ్యం విషమించి 1,01,400 మంది మృతి చెందినట్లు లెక్క తేల్చారు. అదే ఏడాది ఆరు నెలల్లోపు పసికందుల్లో 66 లక్షల మంది ఆర్‌ఎస్‌వీకి గురికాగా, 14 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో  45,700 మంది చనిపోయారు.

* కోల్డ్‌ వైరస్‌ కారక మరణాల్లో 97% అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే సంభవిస్తున్నాయని, అందునా నాలుగింట మూడొంతుల మరణాలు ఆసుపత్రుల వెలుపలే చోటుచేసుకుంటున్నాయని పరిశోధనకర్త హరీశ్‌ నాయర్‌ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని