Published : 26 Jun 2022 05:17 IST

ఆహార రంగంలో నవ యువ భారతీయ ఆవిష్కర్తలు

బిల్బావో (స్పెయిన్‌): ప్రపంచ వ్యాప్తంగా ఆహార, పానీయ రంగంలో వినూత్న మార్పులను తీసుకొచ్చిన యువ ఆవిష్కర్తలలో ఈ ఏడాది భారతీయులు కూడా ఉండటం విశేషం. ప్రపంచంలో ఏటా 50 అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాను ప్రచురించే 50 నెక్స్ట్‌ గ్రూపు... ఆహారం, పానీయాల రంగంలో నవకల్పనలు సాధించిన 35 ఏళ్లలోపు మేటి ఆవిష్కర్తలనూ సత్కరిస్తోంది. ఈ ఏడాది జాబితాలో ఏకంగా నలుగురు యువ భారతీయులకు చోటు దక్కడం గమనార్హం. విశ్వవ్యాప్తంగా పోటీపడిన 400 మంది అభ్యర్థుల నుంచి 50 మంది విజేతల పేర్లను స్పెయిన్‌లోని బిల్బావో నగరంలో గురువారం ప్రకటించారు. వీరిలో దిల్లీకి చెందిన డాక్టర్‌ రిషా జాస్మిన్‌ నాథన్‌, బెంగుళూరుకు చెందిన వినీశ్‌ జానీ, అనూషామూర్తి, ముంబయికి చెందిన నిధి పంత్‌లు ఉన్నారు. సింగపూర్‌లో భారత సంతతికి చెందిన త్రవీందర్‌ సింగ్‌ కూడా 50 నెక్స్ట్‌ జాబితాలో స్థానం సాధించారు.

భార లోహాలను పీల్చేసే పూసలతో...

తాగునీటి నుంచి భార లోహాలను పీల్చేసే పూసలను ఆహారం, కూరగాయ తొక్కల నుంచి తయారుచేయడం రిషా జాస్మిన్‌ నాథన్‌ ప్రత్యేకత. వర్థమాన దేశాల్లో తాగునీటి కాలుష్యాన్ని నివారించే పద్ధతిని కనుగొన్నందుకు ఆమె 50 నెక్స్ట్‌ జాబితాలో స్థానం పదిలం చేసుకున్నారు. త్వరలోనే బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా చేరనున్న జాస్మిన్‌... తన ప్రయోగాలను అక్కడ కొనసాగించాలనుకొంటున్నారు.

పర్యావరణహిత వంటలు...

వంట మేస్త్రి వినీశ్‌ జానీ భారతదేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ బేకింగ్‌ శిక్షణ సంస్థ లావోన్‌ అకాడెమీని ప్రారంభించారు. బెంగుళూరులో పదేళ్ల నుంచి ఈ సంస్థ పేస్ట్రీ తయారీ, బేకింగ్‌, పర్యావరణ హితంగా వంటచేసే పద్ధతులను నేర్పుతోంది. అనూషామూర్తి భారతీయ వంటల ప్రావీణ్యాన్ని నలుగురికీ పంచడానికి ఎలిజబెత్‌ యార్క్‌తో కలసి ఎడిబుల్‌ ఇష్యూస్‌ అనే సామాచ్కీజిజిక సంస్థను నడుపుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార విధానాన్ని బోధించే రోబోనూ రూపొందిస్తున్నారు.

సౌరశక్తితో నడిచే డీహైడ్రేటర్‌

నిధి పంత్‌ ‘సైన్స్‌ ఫర్‌ సొసైటీ’ సంస్థను స్థాపించి విద్యుచ్ఛక్తి అవసరం లేకుండా సౌరశక్తితోనే నడిచే ఆహార డీహైడ్రేటర్‌ను రూపొందించారు. ఈ సాధనం వ్యవసాయ దిగుబడిని పెంచి, పేదలకు మరింత ఆహారం అందించడానికి తోడ్పడుతుంది. భూమిలేని మహిళలకు ఎస్‌4ఎస్‌ పరికరాలను, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తోంది. వారికి ఆర్థిక సహాయం అందేలా చూస్తోంది.

వ్యర్థాల నుంచి బీరు తయారీతో...

ఆహారం, కూరగాయల వ్యర్థాల నుంచి ఆర్టిజాన్‌ బీరు, ఆల్కహాల్‌ రహిత పానీయాలను తయారుచేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు... త్రవీందర్‌ సింగ్‌! ఆయన స్థాపించిన అంకుర సంస్థ ‘క్రస్ట్‌’ తన వ్యాపారాన్ని సింగపూర్‌ నుంచి జపాన్‌, తైవాన్‌లకు విస్తరిస్తోంది. బ్రిటన్‌, భారత్‌, ఐరోపాలోలనూ వ్యాపారం ప్రారంభించాలనుకొంటోంది. ప్రపంచం అదనపు ఆహారోత్పత్తిని సాధించనక్కర్లేదనీ, ఇప్పటికే వృథాగా పోతున్న మిగులును సద్వినియోగం చేసుకుంటే చాలునని సింగ్‌ అంటున్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని