ఉసురు తీసిన వలస వాహనం

కుటుంబాలను పోషించుకోవాలన్న ఆశతో పరాయి దేశంలోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేసిన 50 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో 12 మంది ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

Published : 29 Jun 2022 04:24 IST

ట్రక్కులో బయటపడిన 46 మృతదేహాలు

చికిత్స పొందుతూ మరో నలుగురి మృతి

అక్రమ వలసదారులను రోడ్డుపక్కన వదిలేసి వెళ్లడంతో దారుణం

శాన్‌ ఆంటోనియో: కుటుంబాలను పోషించుకోవాలన్న ఆశతో పరాయి దేశంలోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేసిన 50 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో 12 మంది ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లలు సహా సుమారు 62 మందిని ఓ ట్రక్కులో కుక్కి తీసుకెళ్లిన వ్యక్తులు వాహనాన్ని అర్ధంతరంగా రోడ్డు పక్కన వదిలేసి వెళ్లడంతో.. వేడికి తాళలేక, దాహం తీర్చుకోవడానికి నీరు లేక, సాయం అర్థించడానికి ఎవరూ కనపడక నరకయాతన అనుభవించారు. ట్రక్కు లోపలే ఒకొక్కరూ పిట్టల్లా రాలిపోయారు. అక్రమ వలసజీవుల దుర్భర పరిస్థితికి అద్దంపట్టే ఈ ఘటన అమెరికా.. టెక్సాస్‌ రాష్ట్రంలోని శాన్‌ ఆంటోనియోలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ భవనం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌-ట్రైలర్‌ నుంచి ఆర్తనాదాలు వినిపించడంతో ఓ కార్మికుడు వెళ్లి చూడగా ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తలుపు పాక్షికంగా తెరిచి ఉంచిన కంటైనర్‌లో చాలా మంది అచేతనంగా కనిపించారు. వారి శరీర ఉష్ణోగ్రతలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయి ఉన్నాయి. ట్రక్కులోని రిఫ్రిజిరేటర్లలో నీరు లేదు. ఎయిర్‌ కండీషనర్‌ పని చేయడంలేదు. ఆ రోజు శాన్‌ ఆంటోనియోలో 38 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ట్రక్కులోనే 46 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరు అధిక వేడికి తాళలేక మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. మృతుల్లో 39 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. చికిత్స పొందుతున్నవారిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. మెక్సికో నుంచి వలసదారులను ఈ వాహనంలో తీసుకొచ్చిఇక్కడ వదిలివెళ్లినట్లు భావిస్తున్నారు. ఈ ఘటన వెలుగు చూసిన ప్రదేశం అక్రమ వలసల మార్గమైన అమెరికా-మెక్సికో సరిహద్దులకు 250 కి.మీ. దూరంలో ఉంది. ట్రక్కులో ఏదైనా సమస్య తలెత్తడంతోనే డ్రైవరు ఇక్కడ వదిలి వెళ్లి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఎన్నిరోజులుగా ట్రక్కు అక్కడ ఉందన్న విషయంపై సమాచారం లేదు. వలసదారుల్లో 22 మంది మెక్సికో, ఏడుగురు గ్వాటెమలా, ఇద్దరు హొండురస్‌ దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. మిగిలినవారి వివరాలు తెలియాల్సి ఉంది.


హృదయవిదారకం: బైడెన్‌

వలసదారుల మరణంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం తెలిపారు. ‘ఈ ఘటన భయానకం, హృదయవిదారకం’ అని వ్యాఖ్యానించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ ఘటన వెనుక మానవ అక్రమ రవాణా ముఠా ఉన్నట్లు తెలుస్తోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని