లీసీచాన్స్క్‌ను హస్తగతం చేసుకున్నాం: రష్యా

లుహాన్స్క్‌ ప్రావిన్సులోని చిట్టచివరి ప్రధాన నగరమైన లీసీచాన్స్క్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని రష్యా రక్షణ మంత్రి సెర్గే షొయిగు వెల్లడించారు. ఈ విజయంతో డాన్‌బాస్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలన్న తమ లక్ష్యానికి మరింత చేరువైనట్లు చెప్పారు.

Published : 04 Jul 2022 05:09 IST

ఉక్రెయిన్‌లో మరో ముందడుగు పడినట్లు వెల్లడి

పోరు కొనసాగుతోందన్న జెలెన్‌స్కీ

కీవ్‌: లుహాన్స్క్‌ ప్రావిన్సులోని చిట్టచివరి ప్రధాన నగరమైన లీసీచాన్స్క్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని రష్యా రక్షణ మంత్రి సెర్గే షొయిగు వెల్లడించారు. ఈ విజయంతో డాన్‌బాస్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలన్న తమ లక్ష్యానికి మరింత చేరువైనట్లు చెప్పారు. స్థానిక వేర్పాటువాద మిలీషియాతో కలిసి ఆ నగరాన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఆయన తెలిపారని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరిణామంతో ‘లుహాన్స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌’కు స్వేచ్ఛ కల్పించినట్లు ప్రకటించింది. లీసీచాన్స్క్‌ను దక్కించుకోవడం ద్వారా దొనెట్స్క్‌ ప్రాంతంలోకి చొచ్చుకువెళ్లేందుకు రష్యాకు మార్గం సుగమం అవుతుంది. అక్కడ పోరు ఇంకా సాగుతోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌కు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇర్పిన్‌లో జరిగిన విధ్వంసం దిగ్భ్రాంతికరంగా ఉందని ఆంథోనీ అన్నారు.

రష్యాలో భారీ పేలుళ్లు

మాస్కో సేనల అధీనంలోని మెలిటోపొల్‌ నగరంపై ఉక్రెయిన్‌ విరుచుకుపడింది. అక్కడి రష్యా శిబిరంపై 30కి పైగా దాడులు జరిపినట్లు బహిష్కరణకు గురైన ఆ ప్రాంత మేయర్‌ ఇవాన్‌ ఫెడోరోవ్‌ తెలిపారు. ఉక్రెయిన్‌ సరిహద్దు నగరమైన రష్యాలోని బెల్‌గోరోడ్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 11 అపార్ట్‌మెంట్‌ భవనాలు, 39 నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడిని అక్కడి గవర్నర్‌ ధ్రువీకరించారు. దాడిపై ఉక్రెయిన్‌ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు.

* బల్గేరియాతో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా దౌత్య సిబ్బంది అక్కడినుంచి స్వదేశానికి పయనమవుతున్నారు. సోమవారంలోగా దేశం వీడి వెళ్లాలని 70 మంది రష్యా దౌత్య సిబ్బందిని బల్గేరియా ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని