మృత జీవి అవయవాన్ని పునరుద్ధరించొచ్చు!

అవయవ మార్పిడి రంగంలో ఇదో పెద్ద ముందడుగు. మృత పందుల్లో కణ, అవయవ పనితీరును పునరుద్ధరించే సరికొత్త పరిజ్ఞానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మానవుల్లోనూ

Published : 06 Aug 2022 08:04 IST

వాషింగ్టన్‌: అవయవ మార్పిడి రంగంలో ఇదో పెద్ద ముందడుగు. మృత పందుల్లో కణ, అవయవ పనితీరును పునరుద్ధరించే సరికొత్త పరిజ్ఞానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మానవుల్లోనూ ఇలాంటి ప్రక్రియ విజయవంతమైతే.. శస్త్రచికిత్సల సమయంలో శరీర భాగాలను మరింత ఎక్కువసేపు ఆరోగ్యంగా ఉంచడానికి వీలవుతుంది. అలాగే దాతల అవయవాల లభ్యతనూ పెంచొచ్చు. గుండెపోటు, పక్షవాతం బాధితుల్లో దెబ్బతినే కణజాలాలు, అవయవాలకు చికిత్స చేయడానికీ వీలు కలుగుతుంది. యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. గతంలో వీరు ‘బ్రెయిన్‌ఎక్స్‌’ అనే సాంకేతికత సాయంతో ఒక మృత వరాహంలోని మెదడులో రక్త ప్రసరణను, కొన్ని కణాల పనితీరును పునరుద్ధరించారు. తాజాగా ఈ సాంకేతికతకు మార్పిడి చేసి, ‘ఆర్గాన్‌ఎక్స్‌’ను అభివృద్ధి చేశారు. ఇందులో శస్త్రచికిత్సల సమయంలో గుండె, ఊపిరితిత్తుల విధులను నిర్వర్తించే హార్ట్‌-లంగ్‌ యంత్రాన్ని పోలిన పెర్‌ఫ్యూజన్‌ సాధనం, కణ ఆరోగ్యాన్ని పెంపొందించే, ఇన్‌ఫ్లమేషన్‌ను అణచివేసే ఫ్లూయిడ్‌ ఉన్నాయి. ప్రయోగంలో భాగంగా.. గంట ముందు చనిపోయిన కొన్ని పందులకు ఆర్గాన్‌ఎక్స్‌తో చికిత్స చేశారు. ఆరు గంటల తర్వాత వాటిని పరిశీలించారు. వాటి గుండెలో విద్యుత్‌ చర్యల ఆనవాళ్లను గమనించారు. ఫలితంగా హృదయానికి సంకోచ సామర్థ్యం సమకూరింది. మెడ, తల భాగాల్లోని కండరాల్లో అసంకల్పిత కదలికలను గమనించారు. ఆ అవయవాల్లో రక్తప్రసరణ, కణాల విధుల పునరుద్ధరణ జరిగినట్లు తేల్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని