అదే జరిగితే అపార ప్రాణనష్టం!

అమెరికా-రష్యాల మధ్య పూర్తిస్థాయి అణు యుద్ధం సంభవిస్తే.. తీవ్ర విపరిణామాలు తప్పవని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. వాతావరణంలోకి చేరే ధూళి, ఉద్గారాల కారణంగా కరవు కాటకాలు తలెత్తడం, ఆకలి కారణంగా 500 కోట్ల మంది ప్రాణాలు

Published : 17 Aug 2022 05:59 IST

 500 కోట్ల మందికి ముప్పు!

అణుయుద్ధం అంచనాలపై అధ్యయనం

అమెరికా-రష్యాల మధ్య పూర్తిస్థాయి అణు యుద్ధం సంభవిస్తే.. తీవ్ర విపరిణామాలు తప్పవని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. వాతావరణంలోకి చేరే ధూళి, ఉద్గారాల కారణంగా కరవు కాటకాలు తలెత్తడం, ఆకలి కారణంగా 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని అంచనా వేసింది. రట్గర్స్‌ యూనివర్సిటీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్తల నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. అణుయుద్ధం సంభవిస్తే అనంతరం పంటల ఉత్పత్తిపై పడే ప్రభావాన్ని అంచనా వేసింది. ప్రపంచంలో అణుయుద్ధం జరిగేందుకు ఉన్న అవకాశాలను విశ్లేషించింది. వీటిల్లో అమెరికా-రష్యా మధ్య జరిగే యుద్ధం భూగోళంపై భయంకరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తేల్చింది. అపార ప్రాణనష్టం సంభవిస్తుందని పేర్కొంది. అధ్యయన విశేషాలు ‘ది జర్నల్‌ నేచర్‌ ఫుడ్‌’లో ప్రచురితమయ్యాయి. ఈమేరకు అణ్వాయుధ ప్రయోగం కారణంగా వాతావరణంలోకి ఎంతమేర కర్బన ఉద్గారాలు చేరుతాయనే అంశం ఆధారంగా శాస్త్రవేత్తలు అంచనాలు వేశారు. అమెరికా జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం సహకారం కూడా తీసుకొన్నారు. దీంతో ప్రధాన పంటల ఉత్పత్తి దేశాల వారీగా ఎలా ఉండబోతుందనేది అంచనా వేశారు. చిన్నస్థాయి సంక్షోభం కూడా ప్రపంచ ఆహారోత్పత్తిపై పెను ప్రభావం చూపుతుందని ఈ పరిశోధన వెల్లడించింది. భారత్‌-పాక్‌ మధ్య స్థానికంగా జరిగే యుద్ధం కూడా ఐదేళ్లలోపు 7% పంట ఉత్పత్తులను తగ్గించేస్తుందని తేల్చింది. అదే అమెరికా-రష్యా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే.. 90% వ్యవసాయం పడిపోతుందని పేర్కొంది. నిత్యావసరాలు తీర్చే పంటలు, ఆహార వృథా కట్టడి, జంతువుల నుంచి లభించే ఆహారం వంటివి తాత్కాలికంగా మాత్రమే ఈ ప్రభావం నుంచి తప్పించగలవని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని