Health News: ఇలా తింటే.. దీర్ఘాయుష్మాన్‌భవ!

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం చాలా అవసరం. అది మన ఆయుర్దాయాన్ని సైతం ప్రభావితం చేయగలదు! కాబట్టి సరైన ఆహార నియమాలపై శ్రద్ధ అత్యావశ్యకం. ఇందుకోసం కీటో డైట్‌,

Updated : 23 Sep 2022 09:37 IST

ఆయుర్దాయం పెంపునకు కొత్త డైట్‌ సిఫార్సులు

అడిలైడ్‌: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం చాలా అవసరం. అది మన ఆయుర్దాయాన్ని సైతం ప్రభావితం చేయగలదు! కాబట్టి సరైన ఆహార నియమాలపై శ్రద్ధ అత్యావశ్యకం. ఇందుకోసం కీటో డైట్‌, మెడిటెర్రేనియన్‌ డైట్‌ వంటి పేర్లతో రకరకాల ఆహార విధానాలు ఇప్పటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అదే కోవలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు- ‘లాంజివిటీ డైట్‌’.

ఏమిటీ డైట్‌? 

వాల్టర్‌ లాంగో అనే ఓ జీవరసాయన శాస్త్రవేత్త ‘లాంజివిటీ (దీర్ఘాయువు) డైట్‌’ను రూపొందించారు. మనిషి జీవితకాలాన్ని బాగా పెంచేందుకు ఈ ఆహార విధానం దోహదపడుతుందని ఆయన చెబుతున్నారు. ఏం తినాలి? ఏం తినొద్దు? అనే అంశాలపై ఇందులో పలు సిఫార్సులు చేశారు. జన్యువులపై పోషకాల ప్రభావం, ఉపవాసం ఫలితాలపై లాంగో అనేక పరిశోధనలు చేశారు.

లాంజివిటీ డైట్‌ను పక్కాగా పాటించడం ద్వారా 120 ఏళ్లు జీవించాలన్నది లాంగో ప్రణాళిక.


ఎవరి కోసం?

ప్రధానంగా వృద్ధుల కోసం ఈ   ఆహార నియమాలను తయారుచేశారు. యువత కూడా వాటిని అనుసరించొచ్చని చెబుతున్నారు.


ఇందులో ఏముంటాయ్‌?

ఆకుకూరలు, ఫలాలు, బీన్స్‌, బాదం వంటి గింజలు (నట్స్‌), ఆలివ్‌ నూనె, పాదరసం తక్కువగా ఉండే సముద్ర సంబంధిత ఆహారం. మొక్కల నుంచి వచ్చే ఆహారంలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్‌లు ఎక్కువగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు, లవణాలు తక్కువగా ఉంటాయి. మొక్కల ఆధారిత ఆహారాన్నే ఈ డైట్‌లో అధికంగా సిఫార్సు చేశారు. ఇది మెడిటెర్రేనియన్‌ డైట్‌కు దగ్గరగా ఉంటుంది.


వేటికి దూరంగా ఉండాలి?

మాంసం, పాల ఉత్పత్తులు (పెరుగు మినహా) ఎక్కువగా తినకూడదు. సంతృప్త కొవ్వులు, చక్కెరలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవద్దు. పాల ఉత్పత్తులకు దూరంగా ఉండలేనివారు.. ఆవు/మేక/గొర్రె పాలు తీసుకోవచ్చు.


నిర్దిష్ట విరామాలతో..

నిర్దిష్ట సమయంపాటు ఉపవాసం ఉండటమన్నది ఈ డైట్‌లో కీలకాంశం. రోజులో మనం తీసుకునే మొత్తం ఆహారాన్ని కేవలం 12 గంటల వ్యవధిలోనే (ఉదాహరణకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యే) భుజించాలి. నిద్రించడానికి 3-4 గంటల ముందు ఏమీ తినొద్దు. వారంలో రెండు రోజులు 2-3 వేల కిలోజౌళ్ల కంటే తక్కువ ఆహారాన్ని తీసుకొని.. మిగతా 5 రోజులు సాధారణ స్థాయిలో భుజించడం ఇందులో మరో విధానం. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయుల నియంత్రణ మెరుగ్గా ఉంటుందని.. టైప్‌-2 మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుందని లాంగో చెబుతున్నారు.


ప్రొటీన్లను ఎంత తీసుకోవాలి? 

ఈ విధానంలో ప్రొటీన్ల ఆరగింపు.. వ్యక్తి శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది. రోజుకు- ఒక కిలో బరువుకు.. 0.68-0.80 గ్రాముల కంటే ఎక్కువ ప్రొటీన్‌ను తీసుకోకూడదు. ఉదాహరణకు ఒక వ్యక్తి 70 కిలోల బరువుంటే.. రోజుకు 47-56 గ్రాములకు మించి ప్రొటీన్లను ఆరగించొద్దు.


ఏమైనా దుష్ప్రభావాలుంటాయా?

ప్రతి 3-4 రోజులకోసారి మల్టీవిటమిన్‌, మినరల్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవాలని ఈ డైట్‌లో సిఫార్సు చేశారు. అయితే వైద్యుల సూచన లేకుండా వాటిని తీసుకోవడం సరికాదన్నది ఆరోగ్యరంగ నిపుణుల మాట. ఆ సప్లిమెంట్స్‌ను ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్‌, గుండెవ్యాధుల ముప్పు పెరగొచ్చన్నది వారి ఆందోళన. వ్యాయామం గురించి ఈ డైట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని