చైనా కమ్యూనిస్టుల భేటీకి మోగిన నగారా

వచ్చేనెలలో చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (సీపీసీ) నిర్వహించనున్న కీలకమైన కాంగ్రెస్‌ (ప్లీనరీ)కు నగారా మోగింది. ఐదేళ్లకోసారి దీనిని నిర్వహిస్తుంటారు. రెండు విడతల్లో కలిపి గత పదేళ్లుగా అధ్యక్షునిగా

Published : 26 Sep 2022 04:19 IST

ప్రతినిధుల ఎన్నిక  పూర్తయినట్లు సీపీసీ వెల్లడి

జిన్‌పింగ్‌ మార్గదర్శకాల ప్రకారమేనని ప్రకటన

బీజింగ్‌: వచ్చేనెలలో చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (సీపీసీ) నిర్వహించనున్న కీలకమైన కాంగ్రెస్‌ (ప్లీనరీ)కు నగారా మోగింది. ఐదేళ్లకోసారి దీనిని నిర్వహిస్తుంటారు. రెండు విడతల్లో కలిపి గత పదేళ్లుగా అధ్యక్షునిగా కొనసాగుతున్న షి జిన్‌పింగ్‌ మూడోసారి కూడా పగ్గాలు చేపట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు. దానికి ఆమోదం తెలపడంలో కీలకంగా నిలిచే ప్రతినిధుల (డెలిగేట్ల) ఎన్నిక పూర్తయినట్లు సీపీసీ ప్రకటించింది. అక్టోబరు 16న నిర్వహించే 20వ జాతీయ కాంగ్రెస్‌కు హాజరయ్యేందుకు మొత్తం 2,296 మంది ‘ఎన్నిక’య్యారని తెలిపింది. ఇదంతా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మార్గదర్శకాల ప్రకారమే పూర్తయిందని పార్టీ ఆదివారం ప్రకటించింది. జిన్‌పింగ్‌ గృహ నిర్బంధంలో ఉన్నట్లు వచ్చిన వార్తలపై నేరుగా ఎలాంటి ప్రస్తావననూ దీనిలో చేయకపోవడం విశేషం. జిన్‌పింగ్‌ కూడా ఒక డెలిగేట్‌గా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికైనట్లు పార్టీ గతంలో ప్రకటించింది. అధ్యక్షుడికి వ్యతిరేకంగా సైన్యంలో కుట్ర జరుగుతోందన్న ప్రచారం నడుమ ఈసారి సీపీసీ భేటీ జరగనుంది. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అనుసరించి ఈ ప్రక్రియ కొనసాగుతుందని పార్టీ తెలిపింది.

10 లక్షల మందికి శిక్షలు
2012లో తొలిసారి చైనా అధ్యక్ష పదవిలోకి జిన్‌పింగ్‌ వచ్చినప్పటి నుంచి అవినీతి వ్యతిరేక ఉద్యమం కొనసాగిస్తున్నారు. డజన్ల మంది అగ్రశ్రేణి సైనికాధికారులు సహా దాదాపు 10 లక్షల మందికి ఇంతవరకు శిక్షలు విధించారు. . పార్టీకి, ప్రభుత్వానికి, సైన్యానికి కూడా అధిపతిగా జిన్‌పింగ్‌ కొనసాగుతున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌ వారసులంతా గరిష్ఠంగా పదేళ్ల పాటు అధికారంలో కొనసాగారు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి వీలుగా డెంగ్‌ జియావోపింగ్‌ రూపొందించిన మార్గదర్శకాలకు వారు కట్టుబడి ఉన్నారు. జిన్‌పింగ్‌ మాత్రం మూడోసారి, వీలైతే జీవితాంతం అధికారంలో కొనసాగేలా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 9.60 కోట్ల మంది సభ్యులున్న సీపీసీలో దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని