రష్యాలో విలీనానికి ఉక్రెయిన్‌ ప్రాంతాల మొగ్గు!

ఉక్రెయిన్‌ దక్షిణ, తూర్పు ప్రాంతాల ప్రజలు రష్యాలో శాశ్వత విలీనాన్ని కోరుకుంటున్నట్లు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)లో వెల్లడైందని రష్యా వర్గాలు ప్రకటించాయి. సైనిక దళాలు, ఎన్నికల అధికారులు

Published : 29 Sep 2022 03:22 IST

ప్రజాభిప్రాయం అదే: పుతిన్‌ యంత్రాంగం

రెఫరెండం బూటకపు ప్రక్రియ: ఉక్రెయిన్‌

కీవ్‌: ఉక్రెయిన్‌ దక్షిణ, తూర్పు ప్రాంతాల ప్రజలు రష్యాలో శాశ్వత విలీనాన్ని కోరుకుంటున్నట్లు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)లో వెల్లడైందని రష్యా వర్గాలు ప్రకటించాయి. సైనిక దళాలు, ఎన్నికల అధికారులు ఐదు రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి రెఫరెండం నిర్వహించినట్లు తెలిపాయి. దీని ఫలితాలను అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్‌, అమెరికా, ఐరోపా దేశాలు మాత్రం ఈ ప్రజాభిప్రాయ సేకరణను బూటకమని కొట్టిపారేశాయి. రష్యాలో విలీనం కావడానికి దొనెట్స్క్‌ ప్రావిన్సులో 99 శాతం మంది అనుకూలంగా ఓటు వేసినట్లు రష్యా నియమించిన ఎన్నికల అధికారులు వెల్లడించారు. లుహాన్స్క్‌లో 98 శాతం, జపోరిజియాలో 93%, ఖేర్సన్‌లో 87% మంది విలీనానికి మద్దతుగా స్పందించారని ప్రకటించారు. ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకునే కార్యక్రమం లాంఛనంగా ఈ నెల 30న పూర్తికావచ్చు.

యుద్ధం వల్ల ఇప్పటికే అత్యధిక ప్రజలు ఇళ్లు వదిలి పరారు కాగా, మిగిలిన కొద్దిమందితోనే అభిప్రాయ సేకరణ తంతు ముగించారు. ఈ నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం అయితే ఇక ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. విలీనం తర్వాత ఈ నాలుగు ప్రాంతాలపై దాడిని రష్యాపై దాడిగానే పరిగణిస్తామని పుతిన్‌ సర్కారు ఇప్పటికే ప్రకటించింది. వీటిని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను ఉపయోగించడానికైనా సిద్ధమని స్పష్టంచేసింది. అదే జరిగితే 7 నెలలుగా సాగుతున్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తీవ్రరూపు దాల్చే అవకాశం కనిపిస్తోంది.

ఉక్రెయిన్‌లో పారిశ్రామిక కేంద్రమైన డాన్‌బాస్‌ ప్రాంతంలోని లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రావిన్సులు ఎనిమిదేళ్లుగా రష్యా అనుకూల వేర్పాటువాదుల చేతుల్లో ఉన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణతో వాటిని సాధికారికంగా విలీనం చేసుకోవడం రష్యా లక్ష్యం. అమెరికా, నాటో దేశాలు ఈ ప్రజాభిప్రాయ సేకరణ బూటకమని కొట్టివేస్తూ ఉక్రెయిన్‌ పక్షాన గట్టిగా నిలిచాయి. రష్యా సైనికులు తుపాకులతో ఇంటింటికీ వచ్చి ఉక్రెయిన్‌ వాసులతో బలవంతంగా ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని