సంక్షిప్త వార్తలు(3)

ఇబ్బందులు, ముప్పును ఎదుర్కోడానికి కమ్యూనిస్టు పార్టీ ఐకమత్యంతో ఉండాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ఈ నెలలో అధికారపార్టీ కీలక సమావేశం జరగనుండగా.. దానికి ముందు ఆయన మాట్లాడారు. రికార్డు స్థాయిలో మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ఈ సమావేశాల్లోనే ఆయన పార్టీ అనుమతి తీసుకోనున్నారు.

Updated : 03 Oct 2022 04:48 IST

కమ్యూనిస్టు పార్టీ ఐకమత్యంతో ఉండాలి

అప్పుడే ఇబ్బందులు, ముప్పును ఎదుర్కోగలం

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు

16న సీపీసీ కీలక సమావేశం

బీజింగ్‌: ఇబ్బందులు, ముప్పును ఎదుర్కోడానికి కమ్యూనిస్టు పార్టీ ఐకమత్యంతో ఉండాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ఈ నెలలో అధికారపార్టీ కీలక సమావేశం జరగనుండగా.. దానికి ముందు ఆయన మాట్లాడారు. రికార్డు స్థాయిలో మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ఈ సమావేశాల్లోనే ఆయన పార్టీ అనుమతి తీసుకోనున్నారు. చైనా జాతీయ దినమైన శనివారం పార్టీ పత్రిక క్విషిలో ప్రచురితమైన ఓ కథనంలో.. దేశం ఇంత గొప్పగా పునరుత్థానం చెందడానికి ఇంతకంటే దగ్గరగా ఎప్పుడూ వెళ్లలేదని, కానీ ఈ చివరి అడుగులో మాత్రం చాలా కష్టాలు, సవాళ్లు ఎదురవుతాయని షి జిన్‌పింగ్‌ రాశారు. వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పార్టీ ఐకమత్యంతో ఉండాలని, సరికొత్త చారిత్రక లక్షణాలతో సమస్యలను అధిగమించాలని అన్నారు. ఈ విషయాన్ని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక ఆదివారం ప్రచురించింది. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) ఐదేళ్లకోసారి నిర్వహించే కీలక సమావేశం అక్టోబరు 16న జరగనుంది. ఇందులో కొత్త రాజకీయ, ఆర్థిక విధానాలపై చర్చిస్తారు. అందులోనే షి జిన్‌పింగ్‌ మరో ఐదేళ్ల కాలానికి, లేదా జీవితకాలం అధ్యక్షుడిగా ఉండటానికి వీలు కల్పిస్తూ తీర్మానించే అవకాశం ఉంది. ఆ తీర్మానం ఆమోదం పొందితే.. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌ తర్వాత సుదీర్ఘకాలం పదవిలో ఉన్న అధ్యక్షుడు జిన్‌పింగే కావొచ్చు.  


ఇరాక్‌లో తుర్కియే వైమానిక దాడులు
23 మంది కుర్దిష్‌ మిలిటెంట్లు హతం

ఇస్తాంబుల్‌: ఉత్తర ఇరాక్‌లోని ఏసోస్‌ ప్రాంతంలో తుర్కియే యుద్ధవిమానాలు జరిపిన దాడిలో 23 మంది కుర్దిష్‌ మిలిటెంట్లు హతమయ్యారు. అక్కడ స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్‌ ప్రాంతీయ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఈ దాడిలో తమ ఎఫ్‌-16 యుద్ధవిమానాలు పాల్గొన్నట్లు తుర్కియే రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఉత్తర సిరియాలో క్షిపణి దాడి జరిపి ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు కూడా తెలిపింది. 2019 నుంచి ఉత్తర ఇరాక్‌లో తుర్కియే దాడులు నిర్వహిస్తోంది. ప్రధానంగా కుర్దిస్థాన్‌ వర్కర్స్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ ముఠా సభ్యులు తమ దేశంపై దాడి చేయకుండా నిరోధించేందుకు ఇలా చేస్తోంది. ఏప్రిల్‌లో ఆపరేషన్‌ ‘క్లా లాక్‌’ పేరుతో తుర్కియే సైన్యం, వైమానిక దళాలు ఆపరేషన్‌ చేపట్టాయి.


ఇతరుల జీవితాన్ని ప్రభావితం చేయగలగాలి

అద్భుత వ్యక్తిత్వంతో మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. వారు గురువు కావొచ్చు లేదా తల్లిదండ్రులో, స్నేహితుడో, మరొకరో కావొచ్చు. మీరు వారినెప్పటికీ మర్చిపోలేరు. వారిలాగే మీరు కూడా మరొకరి జీవితాన్ని ప్రభావితం చేయగలగాలి. ఆదర్శవంతమైన జీవితం గడిపినప్పుడే అది సాధ్యం.

- గౌర్‌ గోపాల్‌దాస్‌


ఆర్థిక లోటును పెంచింది రిపబ్లికన్లే

రిపబ్లికన్లు ఆర్థిక లోటు గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆ పార్టీకి చెందిన వ్యక్తే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బడా కార్పొరేట్‌ సంస్థలకు పన్నులు తగ్గించడం ద్వారా ఆర్థిక లోటును పెంచేశారు. మేము ఈ ఏడాదిలో ఆర్థిక లోటును లక్ష కోట్ల డాలర్ల కన్నా ఎక్కువగా తగ్గించాం.

- జో బైడెన్‌


10 కోట్లు దాటిన నిరాశ్రయులు

ప్రపంచవ్యాప్తంగా వివిధ సంక్షోభాల వల్ల గతేడాది చివరి నాటికి 8.93 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా నిరాశ్రయుల సంఖ్య ఇప్పటికే 10 కోట్లు దాటింది. ఈ సమస్యను అరికట్టడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు పరిష్కారం గురించి ఆలోచించాలి.

- శరణార్థుల హక్కుల పరిరక్షణ సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు