ఇండోనేసియా విషాదాన్ని తలపించిన ఘటనలెన్నో

ఇండోనేసియాలోని ఫుట్‌బాల్‌ మైదానంలో శనివారం చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో భారీ సంఖ్యలో ప్రేక్షకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాల్లో ఇప్పటివరకు చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఇదే అత్యంత దారుణమైన ఘటనగా పేర్కొంటున్నారు.

Published : 04 Oct 2022 04:48 IST

రోమ్‌లో నాడు 20 వేల మంది మృతి!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండోనేసియాలోని ఫుట్‌బాల్‌ మైదానంలో శనివారం చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో భారీ సంఖ్యలో ప్రేక్షకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాల్లో ఇప్పటివరకు చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఇదే అత్యంత దారుణమైన ఘటనగా పేర్కొంటున్నారు. అయితే, గతంలోనూ ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ వివరాలివీ..

ఇబ్రాక్స్‌ మైదానంలో రెండు సార్లు తొక్కిసలాట

స్కాట్లాండ్‌లోని గ్లాస్‌గోవ్‌ నగరం ఇబ్రాక్స్‌ మైదానంలో రెండుసార్లు తొక్కిసలాట చోటు చేసుకుంది. తొలుత 1902, ఏప్రిల్‌ 5న స్టాండ్‌ కూలిపోవడంతో 25 మంది బలికాగా.. దాదాపు 600 మందికి గాయాలయ్యాయి. ఆ తర్వాత 1972లో రేంజర్స్‌,  క్రాస్‌ టౌన్‌ రైవల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 66 మంది మృతి చెందగా.. 140 మందికి గాయాలయ్యాయి.

మాస్కోలో 340మంది బలి!

అది 1982, అక్టోబరు 20. యూనియన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (యూఈఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో డచ్‌ క్లబ్‌-స్పార్టక్‌ మాస్కో జట్ల మధ్య ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. మ్యాచ్‌ చివర్లో ప్రేక్షకుల్లో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని దాదాపు 7 ఏళ్ల వరకు సోవియట్‌ ప్రభుత్వం దాచిపెట్టింది. అయితే ఈ తొక్కిసలాటలో 340 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కొందరు చెబుతుంటారు.

క్రీ.శ. 27లో మహావిషాదం

మైదానాల్లో తొక్కిసలాటలు జరగడం ఇప్పుడు కొత్తేం కాదు. క్రీ.శ.27లో రోమ్‌ సమీపంలోని ఫిడేనియాలోని ఓ మైదానంలో జరిగిన ప్రమాదంలో 20 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతారు. గ్లాడిటోరియల్‌ క్రీడల సందర్భంగా చెక్క థియేటర్‌ కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత క్రీ.శ 140లో రోమ్‌లో ఓ చెక్క స్టాండు కూలిపోవడంతో 1100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది.

మైదానాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు సందర్భాల్లో జరిగిన తొక్కిసలాటల్లో అత్యధికంగా మరణాలు చోటుచేసుకున్న ఘటనలు..

* సెప్టెంబర్‌ 24, 2015- సౌదీ హజ్‌యాత్రలో జరిగిన తొక్కిసలాటలో అత్యధికంగా 2411 మంది ముస్లిం యాత్రికులు చనిపోయారు.

* 1990 జులైలోనూ అక్కడ 1426 మంది, 2006 జనవరిలో 345 మంది, 2004 ఫిబ్రవరిలో 251 మంది, 1998 ఏప్రిల్‌లో 118 మంది మృత్యువాతపడ్డారు.

* మే 23, 1994 - మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో గొవారీ కమ్యూనిటీ చేపట్టిన భారీ నిరసన ప్రదర్శనలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 114 మంది ప్రాణాలు కోల్పోగా.. 500 మంది గాయాలపాలయ్యారు.

* ఫిబ్రవరి 20, 2003- అమెరికా రోడె ఐల్యాండ్‌లోని వార్విక్‌ నగరంలోని నైట్‌ క్లబ్‌ వేదికపై ఏర్పాటు చేసిన టపాసులతో మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదంలో 100 మంది చనిపోగా.. 200 మంది గాయాలపాలయ్యారు.

* జనవరి 25, 2005- మహారాష్ట్రలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.

* ఆగస్టు 31, 2005- బాగ్దాద్‌లో ఓ మతపరమైన ఊరేగింపు జరుగుతోన్న సమయంలో బ్రిడ్జ్‌ కూలిపోయింది. ఆ ఘటనలో 640 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.

* సెప్టెంబరు 30, 2008- రాజస్థాన్‌ జోధ్‌పుర్‌లోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 168 మంది చనిపోగా..100 మంది గాయాలపాలయ్యారు.

* నవంబరు 22, 2010- కాంబోడియా రాజధానిలో ఓ పండుగ వేళ జరిగిన ఘర్షణల్లో 340 మంది ప్రాణాలు కోల్పోయారు.

* ఏప్రిల్‌ 30, 2021-ఇజ్రాయెల్‌లో మౌంట్‌ మెరాన్‌ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో 45 మంది మృత్యువాతపడ్డారు.

పోలీసు బాసుకు ఉద్వాసన

మలంగ్‌: ఇండోనేసియాలోని మలంగ్‌లో ఫుట్‌బాల్‌ మైదానంలో శనివారం రాత్రి చోటుచేసుకున్న దారుణ తొక్కిసలాట ఘటన పోలీసుశాఖలో ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో దేశ పోలీసు బాసు, మరో తొమ్మిది మంది ఉన్నతాధికారులను వారి పదవుల నుంచి ప్రభుత్వం తొలగించింది. ప్రమాదానికి కారణమైన టియర్‌గ్యాస్‌ ప్రయోగానికి బాధ్యులుగా భావిస్తున్న 18 మంది పోలీసు అధికారులను విచారిస్తున్నారు. ఈ మేరకు స్థానిక అధికారులు సోమవారం వెల్లడించారు. ఆ ఘటనలో 125 మంది ప్రేక్షకులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. వారిలో 17 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మృతదేహాలను సోమవారం బంధువులకు అధికారులు అప్పగించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని